Share News

సచివాలయ ఉద్యోగి చేతివాటం

ABN , Publish Date - Jul 05 , 2025 | 02:07 AM

మామిడి రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ఓ సచివాలయ ఉద్యోగి నకిలీ టోకెన్లతో మోసగించిన ఘటన శుక్రవారం కార్వేటినగరం మండలంలో వెలుగుచూసింది.

సచివాలయ ఉద్యోగి చేతివాటం
నకిలీ టోకెన్ల కలకలంతో ఫ్యాక్టరీ వద్ద అన్‌లోడ్‌ కాకుండా ఆగిన ట్రాక్టర్లు

ఏసీబీ జ్యూస్‌ ఫ్యాక్టరీలో నకిలీ టోకెన్ల కలకలం

వెదురుకుప్పం, జూలై 4 (ఆంధ్రజ్యోతి):మామిడి రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న ఓ సచివాలయ ఉద్యోగి నకిలీ టోకెన్లతో మోసగించిన ఘటన శుక్రవారం కార్వేటినగరం మండలంలో వెలుగుచూసింది.డీఎంపురం సచివాలయంలో హార్టికల్చర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న వెంకటే్‌షకు కార్వేటినగరం మండలం అన్నూరు వద్ద వున్న ఏబీసీ జ్యూస్‌ ఫ్యాక్టరీ వద్ద డ్యూటీ వేశారు.ఫ్యాక్టరీ యాజమాన్యంతో పాటు మామిడి కాయలు తోలుకొచ్చే రైతులకు సహకారం అందించే విధులు ఆయనవి.రైతుల రద్దీని తట్టుకోలేక చాలా ఫ్యాక్టరీల వద్ద టోకెన్‌ సిస్టం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.మామిడి రైతులకు అవసరమైన టోకెన్ల డిమాండ్‌ను గుర్తించిన వెంకటే్‌ష పుత్తూరులో నకిలీ టోకెన్ల బుక్‌, ఏబీసీ ఫ్యాక్టరీ అధికారి సీలు తయారు చేయించాడు. ఆ అధికారి సంతకం ఫోర్జరీ చేసి రైతులకు టోకెన్లను రూ.వెయ్యి చొప్పున విక్రయించాడు.నకిలీ టోకెన్లను మొదట ఫ్యాక్టరీ సిబ్బంది గుర్తించలేదు.గురువారం తాము ఇచ్చిన టోకెన్లకన్నా ట్రాక్టర్లు ఎక్కువగా ఉండడం గమనించిన యాజమాన్యం ప్రత్యేక నిఘా ఉంచితే నకిలీ టోకెన్లతో వచ్చిన 20 ట్రాక్టర్లు మామిడి కాయలను అన్‌లోడ్‌ చేసినట్లు గుర్తించారు.ఇంకా నకిలీ టోకెన్లతో వచ్చిన ట్రాక్టర్లు ఫ్యాక్టరీ ఆవరణంలో వున్నట్లు కూడా గుర్తించారు.వాటిని శుక్రవారం అన్‌లోడ్‌ చేయకుండా కార్వేటినగరం పోలీసులకు ఫ్యాక్టరీ మేనేజరు వెంకటేష్‌ ఫిర్యాదు చేశారు.సీఐ ఎస్‌.హనుమంతప్ప ఫ్యాక్టరీ వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు.34 నకిలీ టోకెన్లను సీజ్‌ చేసి సచివాలయ ఉద్యోగి వెంకటే్‌షపై కేసు నమోదు చేశారు.ఇంకా ఈ నకిలీ టోకెన్ల వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందో పోలీసు దర్యాప్తులో తేలనుంది.

Updated Date - Jul 05 , 2025 | 02:07 AM