Share News

ఆ రికార్డులు అప్పగించండి

ABN , Publish Date - May 16 , 2025 | 01:08 AM

నేతిగుట్టపల్లి, ఆవులపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లపై విజిలెన్సు విచారణకు అడుగులు

ఆ రికార్డులు అప్పగించండి

తిరుపతి(నేరవిభాగం), మే 15(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని నేతిగుట్టవారి పల్లి, ఆవులపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లలో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్సు విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వీటి రికార్డులను తక్షణం తమకు సమర్పించాలని కోరుతూ విజిలెన్సు ఎస్పీ కరీముల్లా షరీఫ్‌ ఇరిగేషన్‌ ఎస్‌ఈకి లేఖ రాశారు. ఈ రికార్డులు ఆందాక విచారణ అధికారులు.. ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి ఆ రెండు రిజర్వాయర్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించనున్నారు. ఎంత మేరకు పనులు జరిగాయి? ఎంత ఖర్చు పెట్టారు? దీనివల్ల ప్రజలకు, రైతులకు ఎంత వరకు ప్రయోజనం చేకూరుతుంది అనే కోణాల్లో విచారించనున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు నేతిగుట్టపల్లె రిజర్వాయర్‌కు సంబంధించి రూ.717 కోట్లు, ఆవులపల్లికి సంబంధించి రూ.660 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ రెండు పనులను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత కంపెనీ చేపట్టింది. నేతిగుట్టపల్లి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో దాదాపు 89.9 శాతం పనులు పూర్తి కావడంతో ఇక్కడే అధిక మొత్తంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో విజిలెన్సు అధికారులు దీనిపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించనున్నారు. ఇప్పటి వరకు జరిగిన పనుల్లో 30 నుంచి 40 శాతం వరకు పనులు చేయకనే ఎం-బుక్కులు సిద్ధం చేసి నిధులు స్వాహా చేశారనే విమర్శలూ ఉన్నాయి. ఈ క్రమంలో జరిగిన పనుల విలువ ఎంత? ఎం-బుక్కుల్లో ఎంత చూపారనే దానిపైనా విచారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ఈ విచారణను నెల రోజుల్లో పూర్తిచేసేందుకు విజజలెన్సు అధికారులు చర్యలు చేపట్టారు.

Updated Date - May 16 , 2025 | 01:08 AM