ఒక క్లిక్‌తో ఫోను హ్యాక్
ABN , Publish Date - Nov 12 , 2025 | 01:26 AM
ఆ రైతు సెల్‌ఫోనుకు ఒక లింకు వచ్చింది. దానిపై ఆయన క్లిక్ చేశారు. అంతే ఫోను హ్యాక్ అయింది. బ్యాంకు ఖాతాలోని రూ.7.5 లక్షలు సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోకి పోయాయి.
రూ.7.5 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
తిరుపతి (నేరవిభాగం), నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఆ రైతు సెల్‌ఫోనుకు ఒక లింకు వచ్చింది. దానిపై ఆయన క్లిక్ చేశారు. అంతే ఫోను హ్యాక్ అయింది. బ్యాంకు ఖాతాలోని రూ.7.5 లక్షలు సైబర్ నేరగాళ్ల ఖాతాల్లోకి పోయాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. రూరల్ సీఐ చిన్నగోవిందు మంగళవారం తెలిపిన ప్రకారం... అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం ఎగువరెడ్డిపల్లెకు చెందిన రైతు, తన ఇద్దరు పిల్లల చదువు నిమిత్తం తిరుపతి రూరల్ మండలం ఓటేరు పంచాయతీలో పదేళ్లుగా నివసిస్తున్నారు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. కెనరా బ్యాంకులో ఆయనకు సేవింగ్స్ అకౌంట్ ఉంది. జూలై నెలలో ఆయన ఫోనుకు వాట్సాప్ ద్వారా పీఎంజేవై కిసాన్ యోజన పేరుతో వచ్చిన ఓ లింకును ఆయన క్లిక్ చేశారు. ‘మీ వివరాలు నమోదు చేయండి’ అంటూ మరో లింకు వచ్చింది. ఏ మాత్రం అనుమానించకుండా దానిని క్లిక్ చేసి తన వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం అందించారు. అంతే, ఆయన ఫోను హ్యాక్ అయింది. ఇటీవల గుండె సంబంధిత చికిత్స కోసం ఇంట్లోని బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.10.81 లక్షల రుణం తీసుకున్నారాయన. ఆ మొత్తాన్ని తన బ్యాంక్ అకౌంట్‌లో జమ చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం రూ.7.50 లక్షలు ట్రాన్స్‌ఫర్ అయినట్లు ఆయన సెల్‌ఫోనుకు మెసేజీ వచ్చింది. వెంటనే ఆ రైతు బ్యాంను సంప్రదించారు. సైబర్ హెల్ప్‌లైన్ 1930 నెంబరుకు కాల్ చేశారు. దీంతో రూ.3.09 లక్షలు హోల్డ్ చేయగలిగారు. ఈ ఘటనపై రూరల్ సీఐ టి.చిన్నగోవిందు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపించే వాట్సాప్, ఎస్‌ఎంఎస్, లేదా సోషల్ మీడియా లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని, వ్యక్తిగత, బ్యాంక్ వివరాలు ఎవరికీ చెప్పొద్దని సూచించారు.