Share News

గూడూరు గుండె బద్దలైంది

ABN , Publish Date - Nov 27 , 2025 | 01:07 AM

గూడూరును ప్రత్యేక జిల్లాగా చేయకపోతే పోయారు.. కనీసం నెల్లూరుజిల్లాలో అయినా కలుపుతారని నమ్మిన ప్రజలు దిగ్ర్భాంతికి గురవుతున్నారు. నెల్లూరులో మళ్లీ విలీనం అయినట్టే అని రెండు రోజుల ముందు దాకా బలంగా ప్రచారం కూడా జరిగింది. నగరి నియోజకవర్గంలోని మూడు మండలాలను కూడా తిరుపతిలో కలుపుతారని ఆశ పడ్డారు. హఠాత్తుగా కథ ఎందుకు అడ్డం తిరిగిందో అర్థం కాక అందరూ సతమతమవుతున్నారు.

గూడూరు గుండె బద్దలైంది

దిక్కుతోచని స్థితిలో నేతలు

గూడూరును ప్రత్యేక జిల్లాగా చేయకపోతే పోయారు.. కనీసం నెల్లూరుజిల్లాలో అయినా కలుపుతారని నమ్మిన ప్రజలు దిగ్ర్భాంతికి గురవుతున్నారు. నెల్లూరులో మళ్లీ విలీనం అయినట్టే అని రెండు రోజుల ముందు దాకా బలంగా ప్రచారం కూడా జరిగింది. నగరి నియోజకవర్గంలోని మూడు మండలాలను కూడా తిరుపతిలో కలుపుతారని ఆశ పడ్డారు. హఠాత్తుగా కథ ఎందుకు అడ్డం తిరిగిందో అర్థం కాక అందరూ సతమతమవుతున్నారు. జగన్‌ ప్రభుత్వంలో జరిగిన అవకతవకల నిర్ణయాన్ని చంద్రబాబు సరిదిద్దుతారని ఆశపడ్డ ప్రజలు మరోసారి తీవ్ర నిరాశకు గురవుతున్నారు. పైగా వెంకటగిరి నియోజకవర్గంలో సుదూరంగా ఉండే మూడు మండలాలను తిరుపతిలో విలీనం చేయడం కూడా అక్కడి ప్రజలకు నచ్చడం లేదు. ఈ అసంతృప్తిని ఎలా ఎదుర్కోవాలో కూటమి నాయకులకు కూడా అంతుపట్టడం లేదు. ఈ నిర్ణయాలను పునఃసమీక్షించుకుని సరిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.

తిరుపతి/గూడూరు/వెంకటగిరి/నగరి, ఆంధ్రజ్యోతి

భగ్గుమంటున్న గూడూరు

అధికారంలోకి రాగానే గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరుజిల్లాలో కలుపుతాం

-2023 జూన్‌లో కోటలో జరిగిన యువగళం బహిరంగ సభలో నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు.

- 2024 ఏప్రిల్‌ 20న ఎన్నికల సందర్భంగా గూడూరులో నిర్వహించిన మహిళా సదస్సులో సీఎం చంద్రబాబునాయుడు కూడా సభాముఖంగా ఇదే ప్రకటన చేశారు.

-స్థానిక ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ కూడా అంశాన్ని ప్రజల ఆకాంక్షగా అసెంబ్లీలో ప్రస్తావించారు.

-నూతన జిల్లాల ఏర్పాటు, మండలాల పునర్విభజన ప్రక్రియపై చేసిన మథనం తర్వాత గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరుజిల్లాలోనే విలీనం చేయాలని మంత్రివర్గ ఉపసంఘం ఇటీవల ప్రతిపాదించింది.

ఏం జరిగిందో ఏమో కానీ, గూడూరు ప్రాంత ప్రజల కల చెదిరింది. కన్నీరు మిగిలింది.

గూడూరు నియోజకవర్గంలోని గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల నుంచి 40 కిలోమీటర్ల లోపు దూరంలో నెల్లూరు ఉంటుంది. 30 నుంచి 40 నిమిషాల సమయంలో నెల్లూరుకు చేరుకోవచ్చు. జిల్లా కేంద్రంతో ఈ ప్రాంతం పెనవేసుకుని ఉండేది. గత వైసీపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజనలో భాగంగా 2022 ఏప్రిల్‌ నెలలో గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లా నుంచి విడదీసీ నూతనంగా ఏర్పాటు చేసిన తిరుపతి జిల్లాలో విలీనం చేసింది. ఈ ప్రాంతాల నుంచి తిరుపతి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే 100 నుంచి 110 కిలోమీటర్ల వరకు.. 2 గంటలకుపైగా ప్రయాణం సాగించాలి. నెల్లూరు కంటే తిరుపతికి ప్రయాణ ఖర్చులు ఎక్కువ. నియోజకవర్గం నుంచి తిరుపతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలంటే ఇటు ప్రజలు, అటు ఉద్యోగులు, వ్యాపారులు ఇబ్బందులు పడాల్సివచ్చేది. అప్పట్లో ఈ నిర్ణయాన్ని నియోజకవర్గ ప్రజలు వ్యతిరేకిస్తూ పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలను చేపట్టినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల్లో అందుకు తగిన మూల్యాన్ని ఆ పార్టీ చెల్లించుకోవాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం ఈ తప్పును సరిదిద్దుతుందని ప్రజలు ఆశించారు. నెల్లూరులో కలపడం కాదు ప్రత్యేక జిల్లానే కావాలని డిమండ్‌ను తెరమీదకు తెచ్చారు. అయితే ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది. ఇదిగో అయిపోయింది.. అదిగో పూర్తయ్యిందని ఇప్పటిదాకా ప్రజలకు నచ్చజెపుతూ వచ్చిన కూటమి నాయకులంతా ఇప్పుడేమి చెప్పాలా అని ఆందోళన చెందుతున్నారు. అధినేతా, యువనేతా ఇచ్చిన హామీలకే దిక్కులేకపోతే ఇక తమ మాటలను ప్రజలేం నమ్ముతారనే ఆవేదన కొందరు వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌లు స్థానిక ప్రజల ఆకాంక్షలను పట్టించుకుని పునరాలోచించాలని కోరుతున్నారు. నెల్లూరులో కలపాలని కోరుతున్నారు.

ప్రభుత్వానికి విన్నవించా

‘గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలని ప్రభుత్వానికి మెయిల్‌ ద్వారా వినతిపత్రం పంపా. వైసీపీ ప్రభుత్వం గూడూరును తిరుపతి జిల్లాలో కలపంతో కలపడంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.. నెల్లూరుజిల్లాలోనే కలపాలని కోరుతున్నారు. దీనిపై చంద్రబాబు, లోకేశ్‌ కూడా హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రజల గళాన్ని వినిపించా. అందరి అభ్యర్థనను సీఎం చంద్రబాబు పరిగణనలోకి తీసుకుని, గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరుజిల్లాలో కలపాలని విన్నవించా’నని ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ తెలిపారు.

అసంతృప్తిని మిగిల్చింది!

గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేస్తారని ఇక్కడి ప్రజలు ఎంతో ఆశగా వున్నారు. ప్రభుత్వ నిర్ణయం ప్రజలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులకు తీవ్ర అసంతృప్తిని మిగిల్చింది.

- వై.సుబ్రమణ్యం రాజు, ఏపీటీఎఫ్‌ గౌరవాధ్యక్షుడు

నెల్లూరుతోనే మా అనుబంధం

రోజువారీ విద్య, వైద్యం, వ్యాపారాలపరంగా నెల్లూరుతో మా అనుబంధం ముడిపడివుంది. తిరుపతి జిల్లాలో కొనసాగించడం ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. గూడూరును నెల్లూరు జిల్లాలో విలీనం చేయాలి.

- నల్లారెడ్డి రాజే్‌షరెడ్డి, సర్పంచ్‌, అరవపాలెం, చిట్టమూరు మండలం

హామీ నెరవేర్చండి

ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు ఇచ్చిన హమీని నెరవేర్చాలి. గూడూరు ఎన్నో ఏళ్లుగా నెల్లూరుజిల్లాలో భాగంగానే ఉంది. ప్రజల ఆకాంక్షను నెరవేర్చేలా ప్రభుత్వం పునరాలోచన చేసి నెల్లూరులో కలిపేలా చర్యలు తీసుకోవాలి.

- జీ శశికుమార్‌, సీపీఐ నాయకుడు

ఎవరడిగారని తిరుపతిలో విలీనం?

నెల్లూరు జిల్లాలో వున్న వెంకటగిరి నియోజకవర్గానికి చెందిన కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను తిరుపతిలో విలీనం చేయనుండడం పట్ల అక్కడి ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రాజేస్తోంది. వాస్తవానికి ఈ మూడు మండలాల విషయంలో సీఎం చంద్రబాబు గానీ, మంత్రి లోకేశ్‌ గానీ గత ఎన్నికల్లో ఎలాంటి హామీలూ ఇవ్వలేదు. దానికి తోడు ఈ మూడు మండలాల ప్రజలు గానీ, కూటమి పార్టీల శ్రేణులు గానీ తిరుపతి జిల్లాలో కలపాలని కోరలేదు. ఎలాంటి డిమాండు లేకున్నా నెల్లూరు పరిధిలోని మూడు మండలాలను గూడూరు డివిజన్‌లో కలపడం అక్కడి ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. దూరాభారాల విషయంలో ఈ మూడు మండలాల ప్రజలు ప్రభుత్వ తాజా నిర్ణయంతో తీవ్ర అసౌకర్యానికి గురి కావాల్సి ఉంటుంది. కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలు నెల్లూరుకు చేరువగా వున్నాయి. అదే తిరుపతి అయితే రెట్టింపు కంటే ఎక్కువ దూరం. ఉదాహరణకు కలువాయి నుంచి నెల్లూరుకు 70 కిలోమీటర్లు కాగా తిరుపతి ఏకంగా 160 కిలోమీటర్ల దూరంలో వుంది. అలాగే రాపూరు నుంచి నెల్లూరు 60 కిలోమీటర్లు అయితే తిరుపతి 90 కిలోమీటర్లు. సైదాపురం నుంచి నెల్లూరు 50 కిలోమీటర్ల దూరాన వుంటే తిరుపతి ఏకంగా 130 కిలోమీటర్ల దూరంలో వుంది. డివిజన్‌ విషయంలో కూడా ఈ మండలాలకు గూడూరు కంటే ఇపుడున్న నెల్లూరే చేరువ.

నెల్లూరులోనే కొనసాగించాలి!

నెల్లూరు జిల్లా ఏర్పడినప్పటి నుంచీ అందులోనే ఉన్నాం. నెల్లూరుతో యాస, భాషతో పాటు అన్ని రకాలుగా ప్రత్యేక అనుబంధం ఏర్పడిపోయింది. అలాంటిది ఇప్పుడు విడదీయం తగదు.

- ఇస్కా రమణయ్య, లారీ యజమాని, రాపూరు

మాకు తిరుపతి వద్దు

సైదాపురం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతారు. మాకు అన్ని విధాలా నెల్లూరే అనుకూలం. కాబట్టి నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలి.

- డి.వెంకటేశ్వర్లు, సైదాపురం

రైతులకు కష్టం

కలువాయి మండలం ఇప్పుడు ఆత్మకూరు డివిజన్‌లో ఉంది. కలువాయి నుంచి ఆత్మకూరుకు 50 కిలోమీటర్లు. గూడూరు డివిజన్‌లో కలిపితే 80 కిలోమీటర్లు ప్రయాణించాలి. పనుల మీద తిరిగే రైతులు రానూపోనూ 60 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాలి. జిల్లా కేంద్రం తిరుపతికి పోవాలంటే 160 కిలోమీటర్లు ప్రయాణించాలి.

- నాగిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సింగిల్‌విండో మాజీ ఛైర్మన్‌, కలువాయి

Updated Date - Nov 27 , 2025 | 01:09 AM