Share News

గూడూరు.. విభజన ఖరారు

ABN , Publish Date - Dec 30 , 2025 | 01:20 AM

గూడూరు నియోజవర్గ విభజన ఖరారైంది. మూడు మండలాలు నెల్లూరులో కలవనున్నాయి. మిగిలిన రెండు జిల్లాలోనే కొనసాగనున్నాయి. అన్నమయ్య జిల్లా నుంచి రైల్వేకోడూరు పూర్తిగా తిరుపతిలో విలీనం కానుంది.

గూడూరు.. విభజన ఖరారు

నెల్లూరుకు మూడు, తిరుపతికి రెండు మండలాలు

జిల్లాలో రైల్వేకోడూరు విలీనం

మంత్రివర్గ సమావేశంలో ఆమోదం

గూడూరు నియోజవర్గ విభజన ఖరారైంది. మూడు మండలాలు నెల్లూరులో కలవనున్నాయి. మిగిలిన రెండు జిల్లాలోనే కొనసాగనున్నాయి. అన్నమయ్య జిల్లా నుంచి రైల్వేకోడూరు పూర్తిగా తిరుపతిలో విలీనం కానుంది. ఈ మార్పులకు సీఎం అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో మంత్రివర్గం ఆమోదముద్రవేసింది.

- తిరుపతి, ఆంధ్రజ్యోతి

జిల్లాల పునర్విభజనకు సంబంధించి ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ జారీ అయ్యాక కూడా ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు, అభ్యర్థనలు వచ్చాయి. వాటిని పరిశీలించిన సీఎం చంద్రబాబు అందులో కొన్నింటిని పరిగణనలోకి తీసుకొని తుదినిర్ణయం తీసుకున్నారు. వాటికి సోమవారం జరిగిన సమావేశంలో మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దాని ప్రకారం గూడూరు నియోజకవర్గంలోని గూడూరు, కోట, చిల్లకూరు మండలాలు నెల్లూరు జిల్లాలో విలీనమవుతాయి. వాకాడు, చిట్టమూరు మండలాలు యథాప్రకారం తిరుపతి జిల్లాలో కొనసాగుతాయి. అన్నమయ్య జిల్లా నుంచి రైల్వేకోడూరు నియోజకవర్గం తిరుపతిజిల్లాలో విలీనమవుతుంది. దీంతో జిల్లాలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య నాలుగు నుంచి మూడుకు తగ్గనుండగా మండలాల సంఖ్య మాత్రం 34నుంచి 36కు పెరుగుతున్నాయి. జిల్లా జనాభా 29.04 లక్షల నుంచి 29.47లక్షలకు పెరగనుంది. తుది నోటిఫికేషన్‌తో ఇవి అమల్లోకి రానున్నాయి.

‘తొమ్మిది’ నియోజకవర్గాల జిల్లా

ఈ పునర్విభజనతో తిరుపతి ‘తొమ్మిది నియోజకవర్గాల జిల్లాగా మారనుంది. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి, సూళ్లూరుపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలు పూర్తిగాను.. గూడూరు (2 మండలాలు), వెంకటగిరి (3మండలాలు), నగరి (2మండలాలు) నియోజకవర్గాలు పాక్షికంగాను ఉంటాయి. కాగా, మూడు నియోజకవర్గాలు రెండు జిల్లాల పరిధిలో ఉండటంపై కొందరు సామాన్య ప్రజలకు అయోమయంగా కనిపిస్తోంది. అయితే సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మెజారిటీ వర్గం హర్షం వ్యక్తంచేస్తున్నట్టు సమాచారం.

జనసేనకు ఇద్దరు ఎమ్మెల్యేలు

ఇప్పటి వరకు జిల్లాలో జనసేన తరపున ఆరణి శ్రీనివాసులు మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు రైల్వే కోడూరు తిరుపతిలో విలీనం కానుండటంతో జనసేనకు చెందిన అక్కడి ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ కూడా జిల్లా ఎమ్మెల్యే జాబితాలో చేరబోతున్నారు.

తిరుపతి మాకు అనుకూలమే

రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలపడం సంతోషమే. అయితే మా నియోజకవర్గంలోని పెనగలూరు మండలం మాత్రం రాజంపేటకు దగ్గరగా ఉంటుంది. సాంస్కృతికంగా, నైసర్గికంగా తిరుపతి అన్నివిధాలుగా అనుకూలమే.

- అరవ శ్రీధర్‌, రైల్వే కోడూరు, ఎమ్మెల్యే

వైసీపీ తప్పును టీడీపీ సవరించింది

నెల్లూరుతో ముడిపడిన గూడూరును వైసీపీ ప్రభుత్వం తిరుపతిలో కలిపి అడ్డగోలుగా తప్పుచేసింది. కూటమి ప్రభుత్వం ఆ తప్పును సవరించి ప్రజాభీష్టం మేరకు గూడూరును నెల్లూరులో కలిపింది. గూడూరు ప్రజల ఆకాంక్షను చంద్రబాబు, లోకేశ్‌ నెరవేర్చారు. సమన్యాయం కోసమే వాకాడు, చిట్టమూరు మండలాలను తిరుపతి జిల్లాలో ఉంచారు.

- సునీల్‌, గూడూరు ఎమ్మెల్యే

రెవెన్యూ డివిజన్‌కు వెళ్లాలంటే ఇబ్బందే

వెంకటగిరి నియోజకవర్గంలోని డక్కిలి, బాలాయపల్లి, వెంకటగిరి మండలాలను శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్‌ పరిధికిందకు తీసుకొస్తే.. రెండు బస్సులు ఎక్కాలి. నెల్లూరు జిల్లాలోనే కలిపేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది.

- తలారి కోటయ్య, రైతు, బాలాయపల్లి

కొంచెం ఇష్టం..కొంచెం కష్టం

నియోజకవర్గంలోని మండలాలన్నీ ఏదైనా ఒకే జిల్లాలో ఉంచినట్లైతే అందరం కలిసే ఉన్నామనే భావన ఉండేది. ఇలా రెండు జిల్లాల్లో ఉంచడం వల్ల పాలనపరమైన విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి.

- పల్లా వెంకటేశ్వర్లు, వ్యాపారి, వాకాడు

Updated Date - Dec 30 , 2025 | 01:20 AM