కర్నూలు బస్సు ప్రమాదంలో గుడుపల్లెవాసి
ABN , Publish Date - Oct 27 , 2025 | 02:09 AM
హైదరాబాదు నుంచి వస్తూ కర్నూలు వద్ద ట్రావెల్స్ బస్సు కాలిపోయిందన్న వార్తతో.. ఆ బస్సులో ఏమైనా ఎక్కారా అన్న ఆందోళన ఇంకోవైపు. వస్తారులే అంటూ శుక్ర, శనివారాల్లో ఎదురు చూసిన వారికి కన్నీళ్లే మిగిలాయి. కర్నూలు బస్సు ప్రమాదంలో 19వ మృతదేహం గుడుపల్లె మండలం యామగానిపల్లెకు చెందిన త్రిమూర్తి(58)గా ఆదివారం నిర్ధారించడంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
అమ్మా.. నేను ఊరికి బయలుదేరా.
- కూతురికి వాట్సప్ కాల్ చేసి చెప్పాడు.
శుక్రవారం ఉదయం 7.30 గంటలకల్లా బంగారుపేట వచ్చేస్తా. కారు తీసుకొని వచ్చేయ్.
కుప్పంలోని ట్రావెల్స్ డ్రైవర్ నాగరాజుకు ఫోన్ చేసి చెప్పారు.
కానీ, ఆయన రాలేదు. ఎక్కడున్నాడో తెలుసుకుందామంటే ఫోను స్విచ్చాఫ్. ఒకవైపు ఏమయ్యారోనని కుటుంబీకుల్లో ఆదుర్దా. మరోవైపు.. పనుల నిమిత్తం తరచూ బయట వెళ్తుండటంతో.. వస్తారులే అనే నమ్మకం. ఇంతలో హైదరాబాదు నుంచి వస్తూ కర్నూలు వద్ద ట్రావెల్స్ బస్సు కాలిపోయిందన్న వార్తతో.. ఆ బస్సులో ఏమైనా ఎక్కారా అన్న ఆందోళన ఇంకోవైపు. వస్తారులే అంటూ శుక్ర, శనివారాల్లో ఎదురు చూసిన వారికి కన్నీళ్లే మిగిలాయి. కర్నూలు బస్సు ప్రమాదంలో 19వ మృతదేహం గుడుపల్లె మండలం యామగానిపల్లెకు చెందిన త్రిమూర్తి(58)గా ఆదివారం నిర్ధారించడంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
త్రిమూర్తి క్వారీ వ్యాపారం చేస్తున్నారు. పెద్ద భార్య వసంతమ్మతో కలిసి ఉంటున్నారు. త్రిమూర్తి, వసంతమ్మ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు కళ్యాణ్ భరత్ హైరబాదులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుండగా, కుమార్తె చైతన్య పెళ్లయి చెన్నైలో నివసిస్తున్నారు. హైదరాబాదులో బంధువుల పెళ్లికని ఈనెల 22వ తేది ఉదయం కుప్పం నుంచి బెంగళూరుకు రైలులో.. అక్కడ్నుంచి ట్రావెల్స్ బస్సులో వెళ్లారు. హైదరాబాదులో 23వ తేదీ వివాహానికి హాజరయ్యారు. అదే రోజు రాత్రి ట్రావెల్స్ తిరుగు ప్రయాణమయ్యారు. తాను కుప్పం బయలుదేరుతున్నట్లు చెన్నైలోని కుమార్తె చైతన్యకు వాట్సప్ కాల్ చేసి చెప్పారు. తనకు ఎప్పుడూ కారు తీసుకువచ్చే కుప్పానికి చెందిన ట్రావెల్స్ డ్రైవర్ నాగరాజుకు ఫోన్ చేసి.. శుక్రవారం (24వ తేది) ఉదయం 7.30కంతా కర్ణాటక రాష్ట్రం బంగారుపేటకు చేరుకుంటానని చెప్పారు. ఆ సమయానికి కారు తీసుకురమ్మన్నారు. ఆ ప్రకారం బంగారుపేట వెళ్లిన నాగరాజు ఎంత సేపు వేచిఉన్నా త్రిమూర్తి రాకపోవడం.. ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఫోను చేశారు. త్రిమూర్తి వద్దనున్న నెంబర్లకు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ అనే వచ్చింది. ఆ తర్వాత ఆయన వెనక్కి వచ్చేశారు. హైదరాబాదు నుంచి బెంగళూరు బయలుదేరిన ట్రావెల్స్ బస్సు కర్నూలు ప్రమాదంలో దగ్ధమైందన్న వార్తలు మీడియాలో రావడంతో త్రిమూర్తి కుటుంబ సభ్యులు కొంత ఆందోళనకు గురయ్యారు. ఇక, 19 మంది మృతుల వివరాలు ఆరా తీసే క్రమంలో కర్నూలు పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ సేకరించారు. తద్వారా 19వ మృతదేహం త్రిమూర్తిది అయిఉంటుందని ప్రాథమికంగా గుర్తించారు. డీఎన్‌ఏ పరీక్ష నిమిత్తం హైదరాబాదులోని అతడి కుమారుడు కళ్యాణ్ భరత్‌కు సమాచారం ఇచ్చి కర్నూలు పిలిపించారు. ఆదివారం జరిపిన డీఎన్‌ఏ పరీక్షల్లో చనిపోయింది త్రిమూర్తిగా నిర్ధారించినట్లు తెలిసింది. కర్నూలు నుంచి మృతదేహాన్ని సోమవారానికి యామగానిపల్లెకు తీసుకొచ్చే అవకాశం ఉందని త్రిమూర్తి కుటుంబీకులు తెలిపారు.
- కుప్పం, ఆంధ్రజ్యోతి