గుడిమల్లం ఆలయ అన్నదాన సత్రానికి గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Nov 30 , 2025 | 01:17 AM
మండలంలోని గుడిమల్లం పరశురామేశ్వరస్వామి ఆలయంలో అన్నదాన సత్రం నిర్మాణానికి నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ అనుమతి మంజూరు చేసింది.
ఏర్పేడు, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): మండలంలోని గుడిమల్లం పరశురామేశ్వరస్వామి ఆలయంలో అన్నదాన సత్రం నిర్మాణానికి నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ అనుమతి మంజూరు చేసింది. ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన శివలింగాల్లో ఒకటైన గుడిమల్లం పరశురామేశ్వరస్వామిని దర్శించుకునేందుకు రోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారు. సౌకర్యాల విస్తరణలో భాగంగా కల్యాణకట్ట, పాకశాల, అన్నదాన సత్రం, యాగశాల, రాధాశాల వంటి నిర్మాణాలకు అనుమతుల కోసం ఎంపీ గురుమూర్తి పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి, పురావస్తుశాఖ ఉన్నతాధికారులకు లేఖల ద్వారా వివరించారు. ఆలయ కమిటీ అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పలు పర్యాయాలు లేఖలు రాశారు. నిర్మాణాల్లో కొంతభాగం ఆలయ రక్షిత ప్రాంతంలోకి వస్తుండటంతో అనుమతులు ఆలస్యమైనా ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో భక్తులకు అత్యవసరమైన తాత్కాలిక అన్నదాన సత్రం నిర్మాణానికి నేషనల్ మాన్యుమెంట్స్ అథారిటీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేసింది. కాగా, ఆలయాభివృద్ధికి దేవదాయ శాఖ ఇప్పటికే రూ.95లక్షలు సీజీఎఫ్ నిధులు కేటాయించింది.