63 పంచాయతీలతో కలిపి గ్రేటర్ తిరుపతి
ABN , Publish Date - Nov 18 , 2025 | 11:51 PM
సవరించిన తిరుపతి గ్రేటర్ తీర్మానానికి మున్సిపల్ కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. మంగళవారం మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం ఎస్వీయూ సెనేట్ హాలులో జరిగింది. గత నెల 24న జరిగిన కౌన్సిల్ సమావేశంలో 53 గ్రామ పంచాయతీలతో పాటు 10 రెవెన్యూ గ్రామాలను గ్రేటర్‌లో విలీనం చేసిన ప్రతిపాదన చర్చకు ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే.
తిరుపతి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): సవరించిన తిరుపతి గ్రేటర్ తీర్మానానికి మున్సిపల్ కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. మంగళవారం మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన కౌన్సిల్ అత్యవసర సమావేశం ఎస్వీయూ సెనేట్ హాలులో జరిగింది. గత నెల 24న జరిగిన కౌన్సిల్ సమావేశంలో 53 గ్రామ పంచాయతీలతో పాటు 10 రెవెన్యూ గ్రామాలను గ్రేటర్‌లో విలీనం చేసిన ప్రతిపాదన చర్చకు ఆమోదముద్ర వేసిన విషయం తెలిసిందే. అయితే నగరానికి అతిచేరువలో మిగిలిపోయినవి, ప్రజలు, ప్రజాప్రతినిధుల అభీష్టం మేరకు భౌగోళిక స్వరూపం, పట్టణ లక్షణాలను పరిగణలోకి తీసుకున్నారు. కలెక్టర్ వెంకటేశ్వర్ లేఖ మేరకు రెవెన్యూ గ్రామాలను తొలగించి అదనంగా 10 గ్రామ పంచాయతీలు విలీనం చేసేందుకు ఆమోదం కోసం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. గత సమావేశంలో గొడవ నేపథ్యంలో ఈసారి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఈ సమావేశంలోనూ రాద్దాంతం చేయాలని వైసీపీ భావించింది. పది లక్షల జనాభాతో గ్రేటర్ ఏర్పాటు చేయాలంటూ ఆ పార్టీ కార్పొరేటర్లు ప్లకార్డులు ప్రదర్శించారు. తవకుఉ 12 లక్షల జనాభాతో పెట్టినా అభ్యంతరం లేదంటూ డిప్యూటీ మేయర్లు ఆర్సీ మునికృష్ణ, ముద్ర నారాయణ, సభ్యులు ఎస్కే బాబు, నరసింహాచారి, నరేంద్రనాథ్ తదితరులు చెప్పడంతో వారి నోట మాట రాలేదు.
మరింత విస్తరణ అవసరం
తిరుపతి కేంద్రంగా నలువైపులా కల్యాణిడ్యాం, రాయలచెరువు, అంజారమ్మకణం, ఏర్పేడు ఐఐటీ, ఐజర్ వరకు విస్తరిస్తే భవిష్యత్ తరాలకు మంచి చేసినట్లవుతుందని మేయర్ శిరీష అభిప్రాయపడ్డారు. గ్రేటర్ పరిధిలోకి తిరుమలనూ తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి సూచించారు. ‘గ్రేటర్’పై తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండబట్టే అత్యవసర సమావేశాన్నీ ఏర్పాటు చేశామని, మేయర్ ప్రతిపాదనలనూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. పాలనాసౌలభ్యం, మౌలిక వసతుల రూపకల్పన, ఆదాయం, అర్బన్ స్వరూపం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు కమిషనరు మౌర్య చెప్పారు. తొలుత 10 లక్షల జనాభాతోనే పరిశీలించినా అనుకూల అంశాలు తక్కువగా ఉన్నాయన్నారు. గ్రేటర్ క్రెడిట్ సీఎం చంద్రబాబుదేనని డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ చెప్పారు.
కొత్తగా చేరిన పంచాయతీలు
తిరుపతి రూరల్ మండలంలోని బ్రాహ్మణపట్టు, కుంట్రపాకం, గాంధీపురం, పెరుమాళ్లపల్లి, పుదిపట్ల.. చంద్రగిరి మండలంలోని రాయలపురం, బుచ్చినాయుడుపల్లె, పిచ్చినాయిడుపల్లె.. రేణిగుంట మండలంలోని అత్తూరు.. ఆర్సీపురం మండలంలోని సి.రామాపురం గ్రామ పంచాయతీలను చేర్చనున్నారు.
ప్రస్తుతం
మున్సిపల్ పరిధి: 30.17 కి.మీ
నగర జనాభా: 4.52 లక్షలు
ఆదాయం : రూ.149 కోట్లు
విలీనం తర్వాత
వచ్చే ఆదాయం : రూ.43కోట్లు
మొత్తం ఆదాయం: రూ.192 కోట్లు
63 గ్రామాల జనాభా : 3.4 లక్షలు
మొత్తం జనాభా :7.86 లక్షలు
గ్రేటర్‌లో మేము కలవలేం
తిరుపతి రూరల్‌లో 32 పంచాయతీల విముఖత
సాయినగర్, న్యూమంగళం అనుకూలం
తిరుపతిరూరల్, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): గ్రేటర్ తిరుపతిలో కలిసేందుకు రూరల్ మండలంలోని ప్రజాప్రతినిధులు విముఖత చూపారు. గ్రేటర్‌లో విలీనానికి 34 పంచాయతీల పాలకమండళ్ల అభిప్రాయ తీర్మానాలను పంపాలని కోరుతూ ఈనెల4న డీపీవో పేరిట నోటీసులు జారీ అయ్యాయి. పదిరోజుల్లోపు తీర్మానాలను సమర్పించాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశాల్లో 32 పంచాయతీల పాలకమండళ్లు గ్రేటర్‌లో కలవలేమంటూ తీర్మానించారు. సాయినగర్, న్యూమంగళం(శెట్టిపల్లె) పంచాయతీలు మాత్రం అనుకూలంగా తీర్మానం చేశాయి. తమకు స్థానికంగా రాజకీయ భవిష్యత్ ఉండదన్న భయంతో గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు విలీనాన్ని తిరస్కరిస్తున్నారని తెలుస్తోంది. పాలక మండళ్ల తీర్మానాలను జిల్లా ఉన్నతాధికారులకు పంపిస్తామని ఇన్‌చార్జి ఎంపీడీవో దయాసాగర్ తెలిపారు.