గ్రేటర్ ప్రతిపాదన వాయిదా!
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:49 AM
తిరుపతి మహానగరిగా మారేందుకు తొలి అడుగు పడేక్రమంలోనే అడ్డుతగిలింది. ఓ ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పడంతో తాత్కాలికంగా వాయిదా పడనుంది. కొన్ని పంచాయతీల విలీనంపై ప్రభుత్వ పెద్దలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరినట్టు తెలిసింది.
కౌన్సిల్లో తీర్మానానికి ముందే ఓ ఎమ్మెల్యే అభ్యంతరం
కొన్ని పంచాయతీలపై చర్చించాకే నిర్ణయం
నేడు తిరుపతి కార్పొరేషన్ సమావేశం
(తిరుపతి, ఆంధ్రజ్యోతి)
తిరుపతి మహానగరిగా మారేందుకు తొలి అడుగు పడేక్రమంలోనే అడ్డుతగిలింది. ఓ ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పడంతో తాత్కాలికంగా వాయిదా పడనుంది. కొన్ని పంచాయతీల విలీనంపై ప్రభుత్వ పెద్దలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరినట్టు తెలిసింది. దీంతో శుక్రవారం జరగనున్న కౌన్సిల్ సమావేశంలో అజెండాలో చేర్చిన అంశంపై చర్చలేకుండా వాయిదా వేయనున్నారు. అయితే కొందరు వైసీపీ కార్పొరేటర్లు మాత్రం గ్రేటర్ తీర్మానాన్ని సమర్థిస్తున్నట్టు సమాచారం.
వైజాగ్, విజయవాడ తరహాలో తిరుపతిని అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సంకల్పించారు. ఆ దిశగా తిరుపతిని గ్రేటర్ చేయాలని అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు. తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు మండలాలకు చెందిన 63 పంచాయతీలతో సిద్ధమైన ప్రతిపాదిత జాబితా మున్సిపల్ కౌన్సిల్ ఆమోద ముద్ర వేసేందుకు అజెండాలో పొందుపరిచారు. నాలుగురోజుల క్రితం జరిగిన ప్రీకౌన్సిల్ మీట్‌లోనూ గ్రేటర్‌పై చర్చించారు. గ్రేటర్‌కు మేయర్ శిరీష కూడా సుముఖంగా ఉన్నట్టు తెలిసింది. కౌన్సిల్ తీర్మానాన్ని మహానగరిగా ఆమోదం కోరుతూ కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో గ్రేటర్‌లో విలీనమవుతున్న పంచాయతీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఓ ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పడంతో వాయిదా పడనుంది. తిరుపతి కార్పొరేషన్ పరిధి చాలా తక్కువ. దీని పరిధి పెంచకపోతే అభివృద్ధి సాధ్యం కాదనేది ప్రభుత్వ వాదన. కాగా, తర్వాత జరగబోయే కౌన్సిల్ సమావేశంలో గ్రేటర్ అంశం ఉంటుందని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు.
గ్రేటర్ ప్రయోజనాలివీ..
పంచాయతీల నుంచి నగరపాలికలో చేరితే సత్వరం పురసేవలు అందుబాటులోకి వస్తాయి. నగరాభివృద్ధి వేగవంతమవుతుంది. రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా, వ్యర్థాల నిర్వహణ వంటి మౌలిక వసతుల అభివృద్దికి అభివృద్ధికి నిధులు అందుబాటులో ఉంటాయి. పరిశ్రమలు, ఐటీ పార్కులు, హౌసింగ్ ప్రాజెక్టులు విస్తరించేందుకు అవకాశం లభిస్తుంది. స్థానిక ఉద్యోగాలు పెరుగుతాయి. భూముల విలవ పెరిగే అవకాశం ఉంది. రాజకీయ ప్రాధాన్యం పెరుగుతుంది.
ప్రతికూలతలు
పంచాయతీ పరిధిలో వసూలు చేసే పన్నులకన్నా మున్సిపల్ పరిధిలో ఎక్కువ. పంచాయతీలో భవన నిర్మాణ అనుమతులు సులభంగా వస్తాయి. కార్పొరేషన్ అయితే టౌన్ ప్లానింగ్ నిబంధనలు క్లిష్టంగా ఉంటాయి. పరిధి పెరగడం వల్ల సమర్థంగా సేవలు అందించడం కష్టం కావచ్చు.
గ్రేటర్ ప్రతిపాదిత పంచాయతీల సంఖ్య: 63
ప్రస్తుత మున్సిపల్ పరిధి: 30.17 కి.మీ
ఆదాయం : రూ.149 కోట్లు
ప్రతిపాదిత పరిధి : 299 కి.మీ
విలీనంతో వచ్చే ఆదాయం: రూ33 కోట్లు
నగర జనాభా: 4.52 లక్షలు
63 గ్రామాల జనాభా: 2.98 లక్షలు
ప్రభావిత మండలాలు: తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట, ఏర్పేడు
కాలనీల పేర్లు మార్పు
తిరుపతి స్కావెంజర్స్ కాలనీ పేరును స్వచ్ఛతేశ్వర కాలనీ, ఏకలవ్య కాలనీ, సుదాసు కాలనీ, శంభూకుల కాలనీల పేర్లను కౌన్సిల్ ముందు తీసుకురానున్నారు. జ్యోతి లెప్రసీ కాలనీ పేరునూ జ్యోతి కాలనీగా మార్చనున్నారు. ఎస్జీఎస్ ఆర్ట్స్ కాలేజ్ రోడ్డుకు మాజీ ఎమ్మెల్యే మబ్బు రామిరెడ్డి రోడ్డుగా పేరు పెట్టే అంశాన్ని అజెండాలో ఉంచారు. ఈట్ స్ర్టీట్ త్వరితగతిన ఏర్పాటుచేసేందుకు, ఉద్యోగుల పదోన్నతులు, పీఆర్వోవోల నియామకంతో పాటు పలు అభివృద్ధిపనులతో కూడిన 108 అంశాలపై చర్చించనున్నారు.
సీవోసీ భవనం పూర్తికి కసరత్తు
ఫ రూ.25 కోట్ల రుణంపై నేడు కౌన్సిల్‌లో చర్చ
తిరుపతిలో కార్పొరేషన్ భవన నిర్మాణం పూర్తికి కసరత్తు మొదలైంది. రూ25కోట్ల రుణంతో ఆరు నెలల్లో పనులు పూర్తి చేయాలని నగరపాలకసంస్థ సంకల్పిస్తోంది. దీనికి మంత్రి నారాయణ అంగీకరించినట్టు తెలిసింది. శుక్రవారం నాటి కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చించనున్నారు. 2018లో టీడీపీ హయాంలో స్మార్ట్ సిటీ నిధులతో సిటీ ఆపరేషన్ సెంటర్ (సీవోసీ) నిర్మించాలని ప్రతిపాదించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళ తర్వాత రూ.71కోట్లతో భూమి పూజ చేశారు. రెండేళ్లలో 20 శాతం పనులు కూడా పూర్తిచేయలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాదిలోనే 60 శాతం పనులు (మొత్తం 80 శాతం) పూర్తయ్యాయి. కాంట్రాక్టర్‌కు బిల్లులు నిలిచిపోవడంతో మిగిలిన పనులను ఆపేశారు. మరో రూ.40కోట్లు ఉంటే భవనం పూర్తవుతుందని అంచనా. తొలుత రూ.25కోట్లు కాంట్రాక్టర్‌కు చెల్లిస్తే ఆగిన పనులు మొదలు పెట్టొచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఐకానిక్ భవనంలా..
శ్రీవారి నామాలు ప్రతిబింబించేలా.. సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఐదు అంతస్తులతో సీవోసీ భవనం రూపుదిద్దుకుంటోంది. నగర భద్రతకు పెద్దపీట వేస్తూ కమాండ్ కంట్రోల్ వ్యవస్థతో పాటు సిటిజన్ సర్వీసెస్, ఎన్విరాన్మెంట్ సైన్సెస్, నీరు, విద్యుత్ వినియోగ వివరాలను ఈ సెంటరు నుంచి పర్యవేక్షించొచ్చు. పీజీఆర్‌ఎ్‌స్ వినతుల స్వీకరణకు ప్రత్యేక హాలు ఉండనుంది. ఇక, మేయర్, డిప్యూటీ మేయర్ల ఛాంబర్లు, కౌన్సిల్ సమావేశ మందిరంతో పాటు కమిషనర్ ఛాంబర్, విభాగాధిపతులకు ప్రత్యేక గదులు ఉంటాయి.