నేటి ముగింపు సదస్సుకు గవర్నర్
ABN , Publish Date - Sep 15 , 2025 | 01:09 AM
సోమవారం జరిగే జాతీయ మహిళా సాధికారత సదస్సు ముగింపు కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. రాష్ట్రప్రభుత్వం తరపున డెలిగేట్లకు ఆయన మధ్యాహ్నం 12.30 గంటలకు ఆతిథ్య విందు ఇస్తారు.
తిరుపతి(కలెక్టరేట్), సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): సోమవారం జరిగే జాతీయ మహిళా సాధికారత సదస్సు ముగింపు కార్యక్రమానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరుకానున్నారు. రాష్ట్రప్రభుత్వం తరపున డెలిగేట్లకు ఆయన మధ్యాహ్నం 12.30 గంటలకు ఆతిథ్య విందు ఇస్తారు. అనంతరం సదస్సుకు విచ్చేసిన ప్రతినిధులు ప్రత్యేక బస్సుల్లో శ్రీకాళహస్తీశ్వరస్వామి దర్శనానికి వెళ్లనున్నారు. రాత్రికి వీరంతా రాహుల్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు. 7.30 గంటలకు డిప్యూటీస్పీకర్ రఘురామకృష్ణంరాజు ఆత్మీయ విందు ఇవ్వనున్నారు. మంగళవారం ఉదయం అల్పాహారం తీసుకుని అతిథులు తిరుగు ప్రయాణం కానున్నారు. కాగా, గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదివారం ఉదయమే తిరుపతికి చేరుకున్నారు. కాగా, ప్రతినిధులు సోమవారం ఉదయం తిరుమల చేరుకుని శ్రీవారిని దర్శించుకోనున్నారు.
నేటి కార్యక్రమం ఇలా
ఉదయం 10.50 గంటలకు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడిచే పలువురికి సత్కారం. 11గంటలకు రాష్ట్ర మహిళా సాధికారత కమిటీ చైర్‌పర్సన్ గౌరు చరితారెడ్డి ప్రసంగం, 11.05గంటలకు పార్లమెంటు మమిళా సాధికారత చైర్‌పర్సన్ పురందేశ్వరి.. 11.10 స్పీకర్ అయ్యన్నపాత్రుడు.. 11.15 గంటలకు రాజ్యసభ్య డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్.. 11.20కి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. 11.30గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. 11.40కి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు ధన్యవాద తీర్మానం చేయనున్నారు.
ఏర్పాట్లపై ప్రశంసలు
డెలిగేట్లకు వసతి, బస ఏర్పాట్లు బాగున్నాయంటూ ముఖ్య అతిథులు, సభ్యులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కలెక్టర్ వెంకటేశ్వర్, జిల్లా యంత్రాంగాన్ని ప్రశంసించారు.