విద్యార్థులకు శుభవార్త
ABN , Publish Date - May 25 , 2025 | 01:05 AM
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జవహర్ నవోదయా విద్యాలయం జిల్లాకు మంజూరు కానుంది. దానికోసం జిల్లాలో 30 ఎకరాల అనువైన భూమిని గుర్తించేందుకు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ రెవిన్యూ అధికారులను ఆదేశించారు.
జిల్లాకు జవహర్ నవోదయా విద్యాలయం
తిరుపతి, మే 24 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జవహర్ నవోదయా విద్యాలయం జిల్లాకు మంజూరు కానుంది. దానికోసం జిల్లాలో 30 ఎకరాల అనువైన భూమిని గుర్తించేందుకు కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ రెవిన్యూ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మూడేళ్ల కిందట జిల్లాల పునర్విభజన జరిగిన సంగతి తెలిసిందే. ఇదివరకూ పాత జిల్లాల పరిధిలో జిల్లాకు ఒకటి చొప్పున జవహర్ నవోదయా విద్యాలయాలను కేంద్రం ఏర్పాటు చేసింది. పునర్విభజన తర్వాత కొన్ని జిల్లాలు వాటిని కోల్పోయాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో మదనపల్లెలో ఈ విద్యాలయం ఏర్పాటైంది. అయితే పునర్విభజన కారణంగా అటు చిత్తూరు, ఇటు తిరుపతి రెండు జిల్లాల పరిధిలోనూ జవహర్ నవోదయా విద్యాలయాలు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలోనూ జవహర్ నవోదయా విద్యాలయాలను ఏర్పాటు చేసే విధానం కింద తిరుపతి జిల్లాకు మంజూరు చేసేందుకు అంగీకరించింది. ఇటీవల సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి వివిధ శాఖల కేంద్ర మంత్రులను కలసిన సందర్భంలోనూ ఈ ప్రస్తావనకు వచ్చింది. దీంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సానుకూలంగా స్పందించడంతో అనువైన భూములను ఎంపిక చేసి వెంటనే సమాచారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. శనివారం ఉదయం దీనిపై కలెక్టర్ సమీక్షించారు. నవోదయా విద్యాలయం కోసం 30 ఎకరాలు అవసరమని, ఆ మేరకు అందుబాటులో ఉన్న భూములను గుర్తించాలని ఆయన జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్‌ను ఆదేశించారు. తిరుపతి అర్బన్ మండల పరిధిలో భూములు లభించని పక్షంలో నగరం వెలుపల భూములు అన్వేషించాలని సూచించారు. వడమాలపేట మండల పరిధిలో అయినా పరవాలేదని, అక్కడ కూడా ల్యాండ్ పార్సిల్స్ పరిశీలించాలని ఆదేశించారు. కాగా 30 ఎకరాలకు తగ్గకుండా ల్యాండ్ పార్సిల్స్ గుర్తించి జిల్లా యంత్రాంగం సమాచారం కేంద్రానికి పంపిస్తే అక్కడి నుంచి జవహర్ నవోదయ సొసైటీ ప్రతినిధులు క్షేత్రస్థాయి పరిశీలనకు రానున్నట్లు సమాచారం. జిల్లాలో ఇప్పటికే నాలుగు కేంద్రీయ విద్యాలయాలున్నాయి. తిరుపతిలో రెండు, వెంకటగిరిలో ఒకటి, ఐఐటీ వద్ద ఒకటి చొప్పున నాలుగు ఉన్నప్పటికీ జవహర్ నవోదయా విద్యాలయం లేని లోటు అలాగే ఉండిపోయింది. తాజాగా కేంద్ర ప్రభుత్వ సానుకూల స్పందనతో ఆ లోటు కూడా పూడనుంది.