Share News

గజలక్ష్మి నమోస్తుతే

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:36 AM

అమ్మవారి ఉత్సవాల్లోనూ ఐదో రోజు గజ వాహనసేవకు అంతటి ప్రాధాన్యం.

గజలక్ష్మి నమోస్తుతే

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు గరుడ సేవకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. అమ్మవారి ఉత్సవాల్లోనూ ఐదో రోజు గజ వాహనసేవకు అంతటి ప్రాధాన్యం ఉంది. తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారాన్ని ధరించి.. శుక్రవారం రాత్రి మహాలక్ష్మిగా పద్మావతి అమ్మవారు తన ప్రీతిపాత్రమైన గజ వాహనంపై ఊరేగారు. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులతో తిరుచానూరు జనసంద్రంగా మారింది. కీలుగుర్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్క భజనలు, జీయర్ల పరివారం ప్రబంధ పారాయణం చేస్తుండగా గజవాహన సేవ ముందుకు సాగింది. అమ్మవారికి హారతులిచ్చేందుకు భక్తులు పోటీపడ్డారు. తరలివచ్చిన భక్తజనంతో మాడవీధులు రద్దీగా మారాయి. పోలీసులు, టీటీడీ విజిలెన్స్‌ అప్రమత్తమై పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఉదయం.. మోహినీ రూపంలో పల్లకిలో వయ్యారంగా కూర్చున్న అమ్మవారు.. తన సుందర మనోహర సౌందర్యాన్ని ఎదురుగా ఉన్న దర్పణంలో చూసుకుని మురిసిపోతున్నట్లు కదులుతూ పరవశింపచేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. చిరుజల్లుల మధ్య పల్లకీ వాహనసేవ జరిగింది. ఆయా కార్యక్రమాల్లో జీయర్‌స్వాములు, టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సభ్యులు పనబాక లక్ష్మి, భానుప్రకా్‌షరెడ్డి, సుచిత్ర యెల్లా, సాంబశివరావు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీ ఈవో హరీందర్‌నాథ్‌, ఏఈవో దేవరాజులు, ఏవీఎస్వో రాధాకృష్ణమూర్తి, అర్చకులు బాబుస్వామి, మణికంఠస్వామి, సూపరింటెండెంట్లు రమేష్‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌, చలపతి, సుబ్బరాయుడు సుభాస్కర్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం వసంతోత్సవం జరిగింది.

Updated Date - Nov 22 , 2025 | 12:36 AM