Share News

అలిపిరిలోనే దేవుడు కనిపిస్తున్నాడు

ABN , Publish Date - Dec 25 , 2025 | 01:27 AM

ఒకప్పుడు తిరుమల కొండమీదకు చేరుకున్న భక్తులు గంటలకు గంటలు క్యూలైన్‌లో వేచి ఉన్నాక మాత్రమే వేంకటేశ్వరుడి దర్శనం లభించేది. ఇప్పుడు అలిపిరిలోనే దేవుడు కనిపించేస్తున్నాడు.

అలిపిరిలోనే దేవుడు కనిపిస్తున్నాడు

- వందల సంఖ్యలో నిలిచిపోతున్న వాహనాలు

తిరుమల, డిసెంబరు24(ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు తిరుమల కొండమీదకు చేరుకున్న భక్తులు గంటలకు గంటలు క్యూలైన్‌లో వేచి ఉన్నాక మాత్రమే వేంకటేశ్వరుడి దర్శనం లభించేది. ఇప్పుడు అలిపిరిలోనే దేవుడు కనిపించేస్తున్నాడు. రద్దీ రోజుల్లో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాల బారులు చూస్తే గుండె బేజారవుతుంది. గరుడ విగ్రహం దాకా వాహనాలు నిలిచిపోతున్నాయి. అలిపిరిలో తనిఖీలకు 12 లైన్లు ఉన్నాయి. ఇందులో ఒక లైన్‌ను వీఐపీల కోసం, మరో రెండు ద్విచక్రవాహనాల కోసం కేటాయించారు. రద్దీ పెరిగినప్పుడు ఈ రెండు లైన్లలోనూ అందరినీ అనుమతిస్తారు. ఒక్కోసారి టీటీడీ కోసం కేటాయించిన సర్వీసు లైన్లలో వీఐపీల వాహనాలను అనుమతించాల్సి వస్తోంది. కొవిడ్‌ తర్వాత తిరుమలకు వచ్చే కార్ల సంఖ్య విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కొవిడ్‌కి ముందు వరకు రోజుకి 7,500 నుంచి 8 వేల వరకు వాహనాలు తిరుమలకు వచ్చేవి. ఈ సంఖ్య ప్రస్తుతం సాధారణ రోజుల్లో 9 వేలు, రద్దీరోజుల్లో 10 వేలకు పెరిగింది. దీంతోపాటూ భద్రతా చర్యలపై మరింత దృష్టి పెట్టారు. ప్రతి వాహనాన్నీ, ప్రతి ఒక్క లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీలకు పాత విధానమే అవలంభిస్తున్నారు. లగేజీని స్కానర్లలో పరీక్షిస్తుండగా, వాహనాలను బానెట్‌, డిక్కీ సహా సిబ్బంది స్వయంగా తనిఖీ చేస్తున్నారు. ఉన్న స్కానర్లలో కొన్ని సరిగా పనిచేయక పోవడంతో కొద్దివాటిమీదే ఆధారపడాల్సివస్తోంది. దీంతో విపరీతమైన ఆలస్యం జరుగుతోంది. వాహనాల స్కానింగ్‌కు ఆధునిక యంత్రాలను వినియోగించగలిగితే ఈ జాప్యాన్ని నివారించవచ్చు. ప్రస్తుతం అలిపిరిలో తనిఖీల కోసం ఎస్పీఎఫ్‌ సిబ్బంది 35 నుంచి 40 మంది, విజిలెన్స్‌ సిబ్బంది మరో 24 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ సంఖ్య కూడా సరిపోవడంలేదు. బస్సుల్లోని ప్రయాణికులు తమ లగేజీలతో దిగి స్కానింగ్‌ చేయించుకుని మళ్లీ బస్సు ఎక్కాలి. ఈ సమయంలోనూ దిగిన బస్సూ ఎక్కేబస్సూ విషయంలో వీరు గందరగోళానికి గురవుతున్నారు. ఆధునిక విధానం ఏదైనా అమలు చేస్తే తప్ప అలిపిరిలో ఆలస్యాన్ని నివారించే అవకాశం లేదని అంటున్నారు. టీటీడీ దృష్టి పెడితే ఇదేమంత పెద్ద సమస్య కాబోదు.

Updated Date - Dec 25 , 2025 | 01:27 AM