కామర్స్ పీజీటీ పోస్టు దక్కించుకున్న గిన్నె రవిశంకర్
ABN , Publish Date - Sep 27 , 2025 | 02:05 AM
డీఎస్సీలో కామర్స్ పీజీటీ పోస్టులు రాష్ట్రానికంతా ఉన్నదే నాలుగు. అందులో రాయలసీమ జోన్-4 ప్రాంతంలో ఉన్నది ఒక పోస్టే. ఈ నాలుగు పోస్టులకు పోటీ పడింది 354 మంది. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఒక పోస్టును దక్కించుకున్నారు తిరుపతికి చెందిన గిన్నె రవిశంకర్.
డీఎస్సీలో కామర్స్ పీజీటీ పోస్టులు రాష్ట్రానికంతా ఉన్నదే నాలుగు. అందులో రాయలసీమ జోన్-4 ప్రాంతంలో ఉన్నది ఒక పోస్టే. ఈ నాలుగు పోస్టులకు పోటీ పడింది 354 మంది. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఒక పోస్టును దక్కించుకున్నారు తిరుపతికి చెందిన గిన్నె రవిశంకర్. తిరుపతిలోని టీటీడీ శిల్పకళాశాల ఇన్‌స్ట్రక్టర్ గిన్నె సాగర్, అలివేలు కుమారుడు, పూలవానిగుంటకు చెందిన రవిశంకర్.. ఎస్వీయూలో ఎంకాం చదివారు. ఆ తర్వాత బీఈడీ చేశారు. తిరుపతిలోని భారతీయ విద్యాభవన్‌లో పీజీటీ (అకౌంటెన్సీ)గా పనిచేస్తున్నారు. మెగా డీఎస్సీలో ఆదర్శ పాఠశాలల్లో కామర్స్ పీజీటీ పోస్టులు రాష్ట్రంలో నాలుగంటే నాలుగు ఖాళీగా ఉన్నాయి. పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ పట్టుదలతో సాధన ప్రారంభించారు. 62.05 శాతం మార్కులతో రాష్ట్ర స్థాయిలో మూడో.. రాయలసీమజోన్ స్థాయిలో ఒకటో స్థానంలో నిలిచారు. ఇలా రాయలసీమ జోన్‌లో ఉన్న ఒకేఒక్క పోస్టును కైవసం చేసుకున్నారాయన. ‘మెగా డీఎస్సీలాంటి బంగారు అవకాశాన్ని వదులుకోకూడదని భావించా. ఎలాగైనా ఉద్యోగం సాధించాలని రోజుకు 6 నుంచి 8 గంటలు చదివా. రాష్ట్రంలోని నాలుగు పోస్టుల్లో ఒకటి సాధించడం చాలా ఆనందంగా ఉంది’ అని రవిశంకర్ పేర్కొన్నారు.
- తిరుపతి(విద్య), ఆంధ్రజ్యోతి