Share News

ఈ బ్యాటరీ బండ్లు బయటకు తీయండి సారూ!

ABN , Publish Date - Oct 05 , 2025 | 11:58 PM

స్విమ్స్‌కు వచ్చే రోగులకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసిన బ్యాటరీ వాహనాలు మూలనపడ్డాయి.

ఈ బ్యాటరీ బండ్లు బయటకు తీయండి సారూ!

శ్రీవెంకటేశ్వర వైద్య విజ్జాన సంస్థ (స్విమ్స్‌)కు వచ్చే రోగులకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసిన బ్యాటరీ వాహనాలు మూలనపడ్డాయి. స్విమ్స్‌కు అనుబంధంగా ఉండే శ్రీపద్మావతి ఆస్పత్రి సెల్లార్‌లో బూజుపట్టి దర్శనమిస్తున్నాయి. వృద్ధులు, వికలాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న రోగుల తరలింపునకు గతేడాది కరూర్‌ వైశ్యాబ్యాంకు ఐదు బ్యాటరీ వాహనాలను వితరణ చేసింది. 11 సీట్ల సామర్థ్యం ఉన్నవి 4 వాహనాలతో పాటు 14 సీట్ల సామర్థ్యం ఉన్న మరో ఈ-బగ్గీని అందజేసింది. స్విమ్స్‌ సర్కిల్‌ నుంచి స్విమ్స్‌ క్యాజువాలిటీ వరకు రోగులు, కుటుంబ సభ్యులతో ప్రతిరోజు ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు రవాణా చేస్తూ వచ్చారు. కొంతకాలంగా ఈ-బగ్గీస్‌ పెద్దగా కనిపించడంలేదని ఆరా తీస్తే.. పద్మావతి ఆస్పత్రి సెల్లార్‌లో మూడు వాహనాలు దుమ్ముపట్టి కనిపించాయి. చిన్న రిపేరు రావడంతో పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. వాల్మీకి సర్కిల్‌ నుంచి రవాణా చేయకపోయినా స్విమ్స్‌ ఓపీడీ, క్యాజువాల్టీ నుంచి పద్మావతి ఆస్పత్రి, క్యాన్సర్‌, డయాలసిస్‌ సెంటర్‌ వంటి అంతర్గతంగానైనా బ్యాటరీ వాహనాలను తిప్పాల్సిన అవపరం ఉంది. వాటిని అందుబాటులోకి తీసుకురావాలని రోగులు కోరుతున్నారు.

- తిరుపతి, ఆంధ్రజ్యోతి

Updated Date - Oct 05 , 2025 | 11:58 PM