Share News

కోలాహలంగా చిత్తూరు నడివీధి గంగజాతర

ABN , Publish Date - May 14 , 2025 | 12:32 AM

చిత్తూరులో నడివీధి గంగజాతర మంగళవారం వేకువజామున వైభవంగా ప్రారంభమైంది.అమ్మవారికి తొలిపూజను వంశపారంపర్య ధర్మకర్తలు సీకే బాబు దంపతులు,హేమంత్‌ కుమార్‌ నిర్వహించాక భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.

  కోలాహలంగా చిత్తూరు నడివీధి గంగజాతర
విశేషాలంకారంలో నడివీధి గంగమ్మ

చిత్తూరు కల్చరల్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): చిత్తూరులో నడివీధి గంగజాతర మంగళవారం వేకువజామున వైభవంగా ప్రారంభమైంది.అమ్మవారికి తొలిపూజను వంశపారంపర్య ధర్మకర్తలు సీకే బాబు దంపతులు,హేమంత్‌ కుమార్‌ నిర్వహించాక భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ దంపతులు పూజలు నిర్వహించారు.అంతకుముందు అమ్మవారి మంగళసూత్రాన్ని సీకే బాబు భార్య లావణ్య భక్తులకు చూపించి అమ్మవారి మెడలో వేశారు. భక్తులకు పసుపు, కుంకుమ, గాజులు, బొందారాలను అందజేశారు. అనంతరం అమ్మవారికి సీకే దంపతులు, ఎమ్మెల్యే గురజాల దంపతులు వింజామరలను సమర్పించారు. ఉత్సవ నిర్వాహకులు వెంకటేష్‌, ఆర్‌ఎ్‌సఎల్‌ఎస్‌ సుబ్బు, సీఆర్‌సీ రవి పాల్గొన్నారు.జాతరలో అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు అంబళ్ళు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులతో వేకువజామునుంచే క్యూలైన్లు నిండిపోయాయి.ఉదయం 10గంటల సమయంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి రాంప్రసాద్‌రెడ్డి నడివీధి గంగమ్మను దర్శించుకుని పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. పుంగనూరు టీడీపీ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చుడా చైర్‌పర్సన్‌ కటారి హేమలత, కాజూరు బాలాజి, ఎస్‌. చంద్రప్రకాష్‌ పాల్గొన్నారు.నడివీధి గంగమ్మను ప్రభుత్వ విప్‌ థామస్‌ దర్శించుకుని పూజలు చేశారు. గిరింపేట నడివీధి గంగమ్మను మంత్రి, ఎమ్మెల్యే దర్శించుకుని పూజలు చేశారు. వారిని ఉత్సవ నిర్వాహకులు, దుర్గాంబ ఆలయ మాజీ చైర్మన్‌ వీకే విశ్వనాధ్‌ తదితరులు సత్కరించారు.

జాతరలో భక్తులు కర్పూర హరతులు,నెయ్యి, పిండిదీపాలు, కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పలు ప్రాంతాల్లో భక్తులు మాతంగి వేషాలతో అమ్మవారిని కొలిచారు. అదే విధంగా జానకారపల్లెలో భక్తులు కాళికాదేవి వేషం ధరించి అమ్మవారికి పూజలు చేశారు.గిరింపేట, కొంగారెడ్డిపల్లె, మురకంబట్టు, మంగసముద్రం, సంతపేట, మంగసముద్రం హౌసింగ్‌ కాలనీ, కట్టమంచి, దొడ్డిపల్లె, చిత్తూరు తదితర ప్రాంతాల్లోనూ గంగజాతర వైభవంగా జరిగింది.

గంగజాతరకు హాజరైన భక్తులకు పొన్నియమ్మ ఆలయం వద్ద అన్నదానం చేశారు. రాములగుడి వీధిలోని జైన్‌ ప్రార్థనా మందిరంలో మజ్జిగ, తాగునీరు పంపిణీ చేశారు. గిరింపేట గంగజాతరలో భక్తులకు మాజీ ఎమ్మెల్యే ఏఎస్‌ మనోహర్‌ పళ్ళరసాలను అందించారు. మంగళవారం సాయంత్రం నడివీధి గంగమ్మలకు ఉత్సవాల నిర్వాహకులు మహా కుంభ నైవేద్యం సమర్పించి పూజలు చేశారు.ఎస్పీ మణికంఠ కుటుంబసభ్యులతో కలిసి నడివీధి గంగమ్మతో పాటు మురకంబట్టు, కొంగారెడ్డిపల్లె, సంతపేట ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గంగమ్మలను దర్శించుకున్నారు.

నేడు నడి వీధి గంగమ్మల జల ప్రవేశం

చిత్తూరు బజారు వీధిలోని నడి వీధి గంగమ్మకు బుధవారం జలాధివాసం నిర్వహించనున్నారు.ఉత్సవ నిర్వాహకులు సీకే బాబు ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం అమ్మవారికి సారె సమర్పించాక ఊరేగింపు ప్రారంభమవుతుంది.మార్గమధ్యంలో భక్తులను ఆకట్టుకునేందుకు భారీగా సంగీత విభావరి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.అగస్తీశ్వరాలయం నుంచి ఓంశక్తి భక్తులు శరీరాలపై శూలాలు గుచ్చుకుని పొక్లయినర్లు, లారీల మీదుగా వేలాడుతూ వచ్చి హైరోడ్‌ మాక్స్‌ సెంటర్‌లో అమ్మవారికి పూలమాల సమర్పించనున్నారు. అనంతరం కట్టమంచి చెరువులో అమ్మవారికి జలాధివాసం నిర్వహించనున్నారు.

Updated Date - May 14 , 2025 | 12:32 AM