నలుగురు దొంగల ముఠా అరెస్టు
ABN , Publish Date - Jul 31 , 2025 | 12:21 AM
పుత్తూరు పోలీసులు బుధవారం కరుడుగట్టిన నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు.
తిరుపతి(నేరవిభాగం), జూలై 30 (ఆంధ్రజ్యోతి): పుత్తూరు పోలీసులు బుధవారం కరుడుగట్టిన నలుగురు అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేశారు. ఈ వివరాలను తిరుపతిలో ఎస్పీ హర్షవర్ధన రాజు మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం నమక్కల్ జిల్లా సేరిక్కలై గ్రామానికి చెందిన ఎం.మణి అలియాస్ కోవిల్‌మణి, ఎం.సురేష్ స్నేహితులు. వీరు తమిళనాడుతో పాటు పలు ప్రాంతాల్లో ఇంటి దొంగతనాలకు పాల్పడేవారు. అలాగే, తిరుపతి నగరం మంగళం పరిధిలోని తిరుమల నగర్‌కు చెందిన స్నేహితులు కుమార్, మణికంఠ చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు. అయితే వీరు గతంలో తమిళనాడులో దొంగతనాలు చేసి వేలూరు జైలులో ఉండగా, తమిళనాడుకు చెందిన ఇద్దరు నిందితులతో పరిచయమైంది. ఆ తర్వాత ఈ నలుగురూ కలిసి కొన్నేళ్ళుగా తమిళనాడుతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో ఇంటి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇటీవల నెల్లూరులోని పలు ప్రాంతాల్లో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో నెల్లూరు పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, వేలిముద్రలు పరిశీలించారు. వీరు చంద్రగిరి, పుత్తూరు పోలీసు స్టేషన్ల పరిధిలో ఇళ్ల తాళాలు పగులకొట్టి బంగారు నగలు అపహరించుకుని వెళ్ళారు. ఈనెల 15న ఏర్పేడు పోలీసు స్టేషన్ పరిధిలో ఇంటి ముందు నిలిపిన బైకును దొంగలించి నెల్లూరు వెళ్లారు. అక్కడ నవాబ్‌పేటలో ఇంటి ముందు ఆపి వున్న మరో ద్విచక్ర వాహనాన్ని దొంగలించారు. ఈ రెండు మోటారు సైకిళ్లలో తిరుగుతూ పగటి పూట రెక్కీ నిర్వహించి రాత్రి పూట ఇంటి దొంగతనాలకు పాల్పడేవారు. ఈ కేసుల్లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దొంగల కోసం వేట మొదలు పెట్టారు.
క్రైం అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో..
పుత్తూరు, ఏర్పేడు, చంద్రగిరి, గాజులమండ్యం పరిధిలోని పెనుబాల కళాశాలలో జరిగిన దొంగతనం కేసుల్లో నిందితులను పట్టుకోవడానికి ఎస్పీ హర్షవర్ధనరాజు తిరుపతి క్రైం అదనపు ఎస్పీ నాగభూషణరావు, పుత్తూరు డీఎస్పీ రవికుమార్ నేతృత్వంలో తిరుపతి క్రైం సీఐలు ప్రకాష్, శివకుమార్ రెడ్డి, రూరల్ సీఐ రవీంద్ర, పుత్తూరు, కేవీబీ పురం, పిచ్చాటూరు ఎస్‌ఐలు ఓబయ్య, నరేష్, వెంకటే్‌షలతో పాటు జిల్లా క్రైం పార్టీలు దాము, నాగరాజు, రమేష్, మోహన్, రాజశేఖర్, భారుష, రవిప్రకాష్, మోహన్, మునిరత్నంను బృందాలుగా ఏర్పాటు చేశారు. వీరు పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో బుధవారం పుత్తూరు- చెన్నై హైవేలోని సిరుగురాజుపాలెం సమీపంలో మురుగన్‌గుడి వద్ద నలుగురు నిందితులు ఉన్నట్లు గుర్తించి పట్టుకున్నారు. వారి నుంచి దాదాపు రూ.20.40 లక్షల విలువ చేసే 190 గ్రాముల బంగారు నగలు, 2.3 కిలోల వెండి వస్తువులు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇదే కేసుల్లో తమిళనాడు రాష్ట్రం చిదంబరానికి చెందిన ఎం.ప్రభు, వేలూరు జిల్లా అనైకట్టుకు చెందిన మణిగండన్ పరారీలో ఉన్నారు. కాగా, అరెస్టయిన వారిలో మణిపై 50, సురే్‌షపైన 15, కుమార్‌పై 18, మణికంఠపై 18 చొప్పున కేసులున్నాయి. ఈ కేసుల్లో ప్రతిభ కనపరచిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి నగదు రివార్డులు అందచేశారు.