యాళి వాహనంపై గణనాథుడి చిద్విలాసం
ABN , Publish Date - Sep 09 , 2025 | 01:16 AM
కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా సోమవారం యాళి వాహనంపై వరసిద్ధుడు విహరించాడు.
ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా సోమవారం యాళి వాహనంపై వరసిద్ధుడు విహరించాడు. ఈ కార్యక్రమానికి అగరంపల్లెకు చెందిన ఎ.నరసింహారెడ్డి కుమారులు, చినకాంపల్లెకు చెందిన పి.సుబ్బారెడ్డి కుమారులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉదయం మూల విరాట్‌కు అభిషేకం, చందనాలంకారం చేశారు. ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. రాత్రి ఉభయదారులు ఉభయ వరుస తీసుకురావడంతో అలంకార మండపంలో సిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవర్లకు పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను యాళి వాహనంపై అధిష్ఠింపజేసి, కాణిపాకం పురవీధుల్లో ఊరేగించారు,. ఆలయ ఈవో పెంచలకిషోర్, ఏఈవో రవీంద్రబాబు, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, ఇన్‌స్పెక్టర్లు చిట్టిబాబు, బాలాజీనాయుడు, ఉభయదారులు పాల్గొన్నారు. ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సూర్యప్రభ వాహన సేవ జరగనుంది.