Share News

శేషుడిపై గణపతి చిద్విలాసం

ABN , Publish Date - Sep 01 , 2025 | 02:03 AM

కాణిపాకంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధుడు ఆదివారం స్వర్ణ పెద్ద శేష వాహనంపై విహరించారు. ఈ కార్యక్రమానికి కాణిపాకం, వడ్రాంపల్లె, మిట్టఇండ్లు, కొత్తపల్లె, అడపగుండ్లపల్లె, బొమ్మసముద్రం, తిమ్మోజిపల్లె, తిరువణంపల్లె, చిగరపల్లె, అగరంపల్లె గ్రామాలకు చెందిన కమ్మ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు.

శేషుడిపై గణపతి చిద్విలాసం
వరసిద్ధునికి పట్టువస్త్రాలు తీసుకొస్తున్న కసాపురం ఆలయ ఈవో విజయరాజు

- వేడుకగా కలశాల ఊరేగింపు

ఐరాల(కాణిపాకం), ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): కాణిపాకంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధుడు ఆదివారం స్వర్ణ పెద్ద శేష వాహనంపై విహరించారు. ఈ కార్యక్రమానికి కాణిపాకం, వడ్రాంపల్లె, మిట్టఇండ్లు, కొత్తపల్లె, అడపగుండ్లపల్లె, బొమ్మసముద్రం, తిమ్మోజిపల్లె, తిరువణంపల్లె, చిగరపల్లె, అగరంపల్లె గ్రామాలకు చెందిన కమ్మ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం ఉభయదారుల ఆధ్వర్యంలో మూల విరాట్‌కు పంచామృత అభిషేకాన్ని నిర్వహించారు. ఉత్సవర్లను చిన్న శేష వాహనంపై ఉంచి కాణిపాకం పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా ఉభయదారులు కలశాల ఊరేగింపును వేడుకగా నిర్వహించారు. మంగళవాయిద్యాలు, కళాకారుల కోలాటాల నడుమ మణికంఠేశ్వరస్వామి ఆలయం నుంచి పాలతో నింపిన కలశాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా ఆలయంలోకి చేరుకున్నారు. తదనంతరం అలంకార మండపం వద్ద కల్యాణ వేదికపై ఉత్సవర్లకు క్షీరాభిషేకాన్ని శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వేలాదిగా భక్తులు విచ్చేశారు. రాత్రి ఉభయ వరుస రావడంతో ఆలయంలోని కల్యాణ వేదిక వద్ద స్వామివారి ఉత్సవర్లకు పూజలు చేసి, భక్తులకు తీర్థప్రదాలను అందజేశారు. అనంతరం స్వర్ణ పెద్దశేష వాహనంపై ఉత్సవర్లను ఉంచి కాణిపాక పురవీధుల్లో ఊరేగించారు. కాగా, వరసిద్ధుడికి అనంతపురం జిల్లాలోని కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయం తరఫున ఈవో విజయరాజు పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమాల్లో పూతలపట్టు, చిత్తూరు ఎమ్మెల్యేలు మురళీ మోహన్‌, జగన్మోహన్‌, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, జడ్పీటీసీ సుచిత్ర, ఆలయ ఈవో పెంచలకిషోర్‌, ప్రధాన అర్చకుడు సోమశేఖర్‌ గురుకుల్‌, మాజీ చైర్మన్‌ మణినాయుడు, ఏఈవోలు రవీంద్రబాబు, ఎస్వీ కృష్ణారెడ్డ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్‌బాబు, టీడీపీ మండల అధ్యక్షుడు హరిబాబునాయుడు, పూతలపట్టు పోల్‌ మేనేజ్‌మ్మెంట్‌ కన్వీనర్‌ గిరిధర్‌బాబు, మాజీ సర్పంచ్‌ మధుసూదన్‌రావు, మాజీ జడ్పీటీసీ లత, ఉభయదారుల సంఘ అధ్యక్షుడు ఈశ్వర్‌బాబు పాల్గొన్నారు.

కాణిపాకంలో నేడు

సోమవారం ఉదయం వరసిద్ధుడికి చిలుక వాహన సేవ, రాత్రి వృషభ వాహన సేవ నిర్వహించనున్నారు.

Updated Date - Sep 01 , 2025 | 02:03 AM