Share News

కార్పొరేషన్ల డైరెక్టర్లుగా గజేంద్ర,మీరా

ABN , Publish Date - Sep 02 , 2025 | 01:26 AM

టీడీపీలో కష్టపడి పనిచేసే వారిని పదవులు వెతుక్కుంటూ వస్తాయని తరచూ పార్టీ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు చంద్రబాబు, లోకేష్‌ చెబుతుంటారు.

కార్పొరేషన్ల డైరెక్టర్లుగా గజేంద్ర,మీరా

పలమనేరు/నగరి, సెప్టెంబరు1 (ఆంధ్రజ్యోతి): టీడీపీలో కష్టపడి పనిచేసే వారిని పదవులు వెతుక్కుంటూ వస్తాయని తరచూ పార్టీ అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు చంద్రబాబు, లోకేష్‌ చెబుతుంటారు.దీనికి మంచి ఉదాహరణగా పలమనేరు నియోజకవర్గంలోని మారు మూల గ్రామానికి చెందిన వి.గజేంద్రను,నగరి మండలం మాంగాడు గ్రామానికి చెందిన మీరాను చెప్పుకోవచ్చు. వి.కోట మండలం కృష్ణాపురం పంచాయితీలోని ఎడగురి గ్రామ నివాసి అయిన వి.గజేంద్రకు టీడీపీ అంటే అభిమానం.రెండేళ్ల క్రితం యువగళం పేరుతో నారాలోకేష్‌ చేపట్టిన పాదయాత్రలో చివరి వరకు గజేంద్ర పాల్గొన్నాడు. ఈ క్రమంలో భీమవరం సమీపంలోని నిడదవోలులో అప్పటి వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసుపెట్టి గజేంద్రను అరెస్టుచేసింది. 48 రోజుల పాటు జైలుజీవితం అనుభవించి విడుదలైన గజేంద్ర ఎన్నికల్లో టీడీపీ గెలుపుకోసం కృషి చేశాడు.ఈ నేపథ్యంలో గజేంద్రను రాష్ట్ర ఇరిగేషన్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టరుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నగరి మండలం మాంగాడు గ్రామానికి చెందిన టీడీపీ నాయకురాలు మీరాను రాష్ట్రస్థాయి పదవి వరించింది.మాంసాభివృద్ది కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా ఆమెను ప్రభుత్వం నియమించింది.నగరి మాజీ ఎంపీపీగా పని చేసిన ఈమె తెలుగు మహిళ అధికారప్రతినిధిగా టీడీపీకి విశేష సేవలందించారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో అరెస్టయి ఇబ్బందులెదుర్కొన్నా వెనుదీయకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేశారు.

Updated Date - Sep 02 , 2025 | 01:26 AM