Share News

రైతులకు అండగా ‘గజ-ప్రజ యాప్‌’

ABN , Publish Date - Oct 12 , 2025 | 11:44 PM

ఏనుగులు పంటలను తరచూ ధ్వంసం చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు

రైతులకు అండగా ‘గజ-ప్రజ యాప్‌’
కల్లూరు అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగులు (ఫైల్‌ ఫొటో)

ఏనుగులు పంటలను తరచూ ధ్వంసం చేస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఆపై నష్టపరిహారం పొందడానికి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. తీరా వచ్చిన మొత్తం తీసుకుని సరిపెట్టుకుంటున్నారు. ఇటువంటి కష్టాలకు చెక్‌ పెడుతూ.. రైతులకు అండగా నిలిచేలా.. రాష్ట్ర అటవీ శాఖ ‘గజ-ప్రజ’ యాప్‌ను తీసుకొచ్చింది. దీన్ని రాష్ట్రంలోనే తొలిసారిగా చిత్తూరు జిల్లాలో అమల్లోకి తేనున్నారు.

- చిత్తూరు సెంట్రల్‌, ఆంధ్రజ్యోతి

గజ-ప్రజ యాప్‌

వినియోగంలోకి వస్తే రైతులు ఏ ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పనిలేదు. నష్ట పరిహారం కూడా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలోకి జమవుతుంది. పంటలే కాదు.. అడవి జంతువుల వల్ల పశువులు, మనుషులు చనిపోయినా యాప్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చు. దీనిపై మూడ్రోజులుగా వైల్డ్‌ లైఫ్‌ ఎక్స్‌పర్ట్‌ రాకేష్‌ కల్వ జిల్లాలోని అటవీ, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ శాఖ అధికారులకు శిక్షణ ఇచ్చారు. త్వరలో అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు, రైతులకు క్షేత్ర స్థాయిలో ఈ యాప్‌ వినియోగంపై అవగాహన కల్పించనున్నారు.

రూపకల్పన ఇలా..

రాష్ట్ర ప్రభుత్వం-అటవీ శాఖ సంయుక్తంగా ఓ ప్రైవేటు ఏజెన్సీ ద్వారా ఈ యాప్‌ను రూపొందించింది. ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి దీన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్‌ చేసుకున్నాక రైతు తన వ్యక్తిగత వివరాలు, మొబైల్‌ నెంబరు, రెవెన్యూ రికార్డుల ప్రకారం భూమి, పంట సాగు వివరాలు, వ్యక్తిగత బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేసుకోవాలి. పాస్‌వర్డ్‌ పెట్టుకునే వెసులుబాటు ఉంటుంది.

నాలుగు శాఖలతో అనుసంధానం

ఈ యాప్‌ అటవీ, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ శాఖలతో అనుసంధానం చేయబడి ఉంటుంది. యాప్‌లో రైతులు సమస్యలు లేవనెత్తినప్పుడు వాటిని ఆయా శాఖలు లాగిన్ల ద్వారా పరిష్కరించే వీలుంటుంది.

పంట నష్టం నమోదు ఇలా..

ఏనుగులు, ఇతర అడవి జంతువుల కారణంగా రైతులు పంట నష్టపోయిన సమయంలో ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. ఆపై రైతు భూ వివరాలు, సాగు చేసిన పంట, నష్టం, బ్యాంకు వివరాలన్నీ అటవీ శాఖ బీట్‌ అధికారి లాగిన్‌కు వెళతాయి. బీట్‌ అధికారి క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి.. వివరాలు సరిచూసుకుని వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులకు పంపుతారు. ఆయా శాఖల అధికారులు మరోసారి క్షేత్రస్థాయిలో పరిశీలించి.. నష్ట పరిహారాన్ని అంచనా వేసి అటవీశాఖ డిప్యూటీ రేంజ్‌ అధికారి (డీఆర్వో) స్థాయి అధికారికి లాగిన్‌కు పంపుతారు. ఆపై మూడో స్థాయిలో అటవీ శాఖ ఫారెస్టు రేంజ్‌ అధికారి (ఎఫ్‌ఆర్వో) వివరాలు పరిశీలించి అన్ని సరిగ్గా ఉంటే చివరిగా జిల్లా అటవీ అధికారి (డీఎ్‌ఫవో) లాగిన్‌కు పంపుతారు. ఆయన చివరగా ప్రభుత్వానికి నివేదిస్తారు. అక్కడినుంచి అనుమతి రాగానే ఒక్క క్లిక్‌తో పంట నష్టం మొత్తాలు రైతుల బ్యాంకు ఖాతాలోకి నేరుగా జమవుతాయి. కేవలం పంట నష్టమే కాదు, అడవి జంతువుల వల్ల పశువులు, చివరకు మనుషులు చనిపోయినా ఈ యాప్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చు.

ఫైల్‌ ట్రాకింగ్‌

నష్టపోయిన రైతు.. తాను నమోదు చేసిన వివరాలు, ఎంత నష్టపరిహారం నమోదైంది.. తన ఫైల్‌ ఏ స్థాయిలో, ఏ అధికారి వద్ద ఉందనే విషయాన్ని ఈ యాప్‌ ద్వారా రైతు నేరుగా తెలుసుకునే వీలుంది.

ప్రస్తుతానికి ఏనుగులకే అనుమతి

రైతులకు పంట నష్టం.. మూడు రకాలైన అడవి జంతువుల ద్వారా జరిగే వీలుంది. ఏనుగులు, అడవి పందులు, దుప్పులు. ప్రస్తుతానికి ఏనుగుల ద్వారా పంట నష్టం వివరాలు మాత్రమే నమోదు చేయడానికి యాప్‌లో వీలు కల్పించారు. భవిష్యత్తులో అడవి జంతువుల కారణంగా పంట నష్టపోతే వాటిని కూడా రైతులు యాప్‌లో నమోదు చేసే వీలు కల్పిస్తారు.

ఏనుగుల సంచారాన్ని తెలియజేయవచ్చు

ఏనుగులు తమ పంటలను నాశనం చేయడానికి గ్రామాలకు సమీపించిన సమయంలో రైతులు ఆ సమాచారాన్ని యాప్‌ ద్వారా అటవీ శాఖ అధికారులకు తెలియజేయవచ్చు. అటవీశాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమై వాటిని తిరిగి అటవీ ప్రాంతంలోకి తరలించే చర్యలు వెంటనే చేపడతారు.

త్వరలోనే అవగాహన కార్యక్రమాలు

గ్రామీణ, అటవీ సరిహద్దు ప్రాంతాల్లోని రైతులకు, స్థానిక ప్రజలకు గజ-ప్రజ యాప్‌ను ఎలా ఉపయోగించుకోవాలనే దానిపై అటవీ, వ్యవసాయ, ఉద్యాన శాఖల సంయుక్త ఆధ్వర్యంలో త్వరలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Updated Date - Oct 12 , 2025 | 11:44 PM