పంటలపై ‘గజ’దాడులు
ABN , Publish Date - Dec 11 , 2025 | 01:42 AM
మండలంలో గజదాడులు కొనసాగుతున్నాయి. ఇరికిపెంట పంచాయతీ ఎర్రమిట్ట సమీపంలో మంగళవారం రాత్రి మూడు ఏనుగులు వరి పైరును తొక్కేసి, మామిడి తోటల్లో కొమ్మలను విరిచేశాయి. ఎర్రమిట్టకు చెందిన భాస్కర్ నాయుడు విద్యుత్ మోటర్, డ్రిప్ పైపులను ధ్వంసం చేశాయి.
మధురమలై కొండలో మకాం
సోమల, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): మండలంలో గజదాడులు కొనసాగుతున్నాయి. ఇరికిపెంట పంచాయతీ ఎర్రమిట్ట సమీపంలో మంగళవారం రాత్రి మూడు ఏనుగులు వరి పైరును తొక్కేసి, మామిడి తోటల్లో కొమ్మలను విరిచేశాయి. ఎర్రమిట్టకు చెందిన భాస్కర్ నాయుడు విద్యుత్ మోటర్, డ్రిప్ పైపులను ధ్వంసం చేశాయి. రెడ్డిబాబు, రెడ్డెప్ప నాయుడు, కృష్ణ, శేఖర్ వరి పొలంలో పంటను తిని, తొక్కేసి నష్టపరిచాయి. బాధిత రైతుల ఫిర్యాదు మేరకు ఎఫ్‌బీవో రాధ పంటలను పరిశీలించి, నష్టాన్ని అంచనా వేశారు.
మధురమలై కొండ ఆవాసంగా..
మండలంలోని ఆవులపల్లె పంచాయతీ ఎగువకొత్తూరు, పట్రపల్లె వైపు నుంచి వచ్చిన ఏనుగులు మధురమలై కొండను ఆవాసంగా చేసుకుని పగలు కొండలో సంచరిస్తూ రాత్రి సమీప పొలాల వైపు వస్తున్నాయి. సోమవారం నెలుకూరివారిపల్లె సమీపంలో టమోటా, వరి పంటల్లో స్వైరవిహారం చేసి బోరు పైపులు, డ్రిప్ పరికరాలను ధ్వంసం చేశాయి. మంగళవారం మధురమలై కొండ వద్ద సంచరించడంతో పశువులను మేతకు తీసుకెళ్లడానికి రైతులు ఇబ్బందిపడ్డారు. మంగళవారం రాత్రి ఎర్రమిట్ట వద్ద పంటలను ధ్వంసం చేశాయి. ఆ పొలాలను బుధవారం ఉదయం సోమల ఏఎంసీ చైర్మన్ శ్రీనివాసులు నాయుడు, చెన్నపట్నం చెరువు నీటి సంఘ అధ్యక్షుడు గల్లా బోస్, ఉపాధ్యక్షుడు గౌతం సందర్శించి, అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాడులు చేయకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశువుల, మేకల, గొర్రెల కాపరులు అటువైపు వెళ్లరాదని అటవీ శాఖ అధికారులు సూచించారు.