జిల్లా అభివృద్ధికి నిధులు కావాలి
ABN , Publish Date - Sep 16 , 2025 | 01:06 AM
శ్రీసిటీ భూసేకరణలో అడ్డంకులు తొలగించాలి పులికాట్ పూడికతీత పనుల వేగవంతానికి చర్యలు తీసుకోవాలి సీఎం చంద్రబాబును కోరిన కలెక్టర్ వెంకటేశ్వర్
తిరుపతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లా అభివృద్ధికి నిధులు కావాలంటూ సీఎం చంద్రబాబును కలెక్టర్ వెంకటేశ్వర్ అభ్యర్థించారు. అమరావతిలో సీఎం అధ్యక్షతన సోమవారం మొదలైన 4వ కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. శ్రీసిటీకి అదనంగా 2500 ఎకరాలు కేటాయించాలన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా భూసేకరణ చేస్తున్నామని వివరించారు. అయితే, దీనికి సంబంధించి పలు కోర్టు కేసులు పెండింగులో ఉన్నాయని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం సహకరించాలని కోరారు. పులికాట్ సరస్సుకు సంబంధించి పూడిరాయి దొరువు వద్ద సముద్ర ముఖ ద్వారాలు పూడిపోవడంతో పూడికతీతకు రూ. 97 కోట్లు నిధులు విడుదలయ్యాయని, కానీ పనులు చేపట్టడంలో ఆలస్యం జరుగుతోందని సీఎంకు నివేదించారు. కలెక్టర్ అభ్యర్థనలకు సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. అంతకు మునుపు తొలిరోజు నిర్దేశిత శాఖలపై జరిగిన చర్చ సందర్భంగా జిల్లాలో పథకాలు, కార్యక్రమాల అమలు తీరును సీఎం సమీక్షించారు. ముఖ్యంగా పారిశ్రామిక పెట్టుబడులు, పీ4 అమలు, సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.
జిల్లా స్థూల ఉత్పత్తి రూ.20,160 కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ ప్రభుత్వం నిర్దేశించిన జిల్లా స్థూల ఉత్పత్తి లక్ష్యం రూ.1.08 లక్షల కోట్లు. తొలి త్రైమాసికంలో రూ.20.160 కోట్లు సాధించింది. వార్షిక పెరుగుదల రేటు లక్ష్యం 18.77 శాతం కాగా.. మూడు నెలల్లో 18.55 శాతం సాధించింది. జీడీపీ లక్ష్య సాధనలో జిల్లా 17వ స్థానంలో వుంది.
వ్యవసాయ ఉత్పత్తుల్లో 13వ స్థానం
వ్యవసాయ రంగ ఉత్పత్తుల విలువ లక్ష్యం రూ.19,487 కోట్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. దీనికిగానూ మొదటి మూడు నెలల్లో జిల్లా రూ.2,458 కోట్లు సాధించి 13వ స్థానంలో ఉంది. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో జిల్లా 21 పాయింట్లతో స్కోర్ బోర్డులో సీ గ్రేడ్‌లో నిలిచింది. జిల్లాలపరంగా అట్టడుగున 26వ స్థానంలో ఉంది.
పారిశ్రామిక ఉత్పత్తుల విలువ రూ.7880 కోట్లు
జిల్లాలో పారిశ్రామిక ఉత్పత్తుల విలువ లక్ష్యం రూ. 43,068 కోట్లు. తొలి మూడు నెలలకు రూ.7990 కోట్లు సాధించి 24వ స్థానంలో ఉంది. స్కోర్ బోర్డు పరంగా 54 పాయింట్లతో బి గ్రేడ్ దక్కగా, జిల్లా 22వ స్థానంలో ఉంది.
పాల ఉత్పత్తి పెంచుకునేందుకు అవకాశం
2024-25లో పశు సంవర్ధక శాఖకు సంబంధించి ఉత్పత్తుల విలువ రూ.8028 కోట్లు. ఆ విలువ పరంగా జిల్లా 11వ స్థానంలో వుంది. పాల ఉత్పత్తిని పెంచుకునేందుకు అవకాశాలున్నాయని ప్రభుత్వం గుర్తించి.. ఆ దిశగా కృషి చేయాలని ఆదేశించింది.
స్వర్ణాంధ్రలో బి గ్రేడ్
స్వర్ణాంధ్రలో జిల్లాకు బి గ్రేడ్ దక్కింది. స్కోర్ బోర్డులో 60 పాయింట్లు వచ్చాయి.