పరిశ్రమల్లో తరచూ ప్రమాదాలు
ABN , Publish Date - Sep 20 , 2025 | 12:59 AM
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు కనబడటం లేదు. ఎక్కడో ఒకచోట.. ఏదో ఒక ప్రమాదం జరుగుతూ కార్మికుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. పరిశ్రమ మనుగడకూ ఇబ్బందిగా తయారవుతున్నాయి. భద్రతా ప్రమాణాల డొల్లతనాన్ని బహిర్గతపరుస్తున్నాయి.
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు కనబడటం లేదు. ఎక్కడో ఒకచోట.. ఏదో ఒక ప్రమాదం జరుగుతూ కార్మికుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. పరిశ్రమ మనుగడకూ ఇబ్బందిగా తయారవుతున్నాయి. భద్రతా ప్రమాణాల డొల్లతనాన్ని బహిర్గతపరుస్తున్నాయి.
- తడ, ఆంధ్రజ్యోతి
రాష్ట్రాభివృద్ధికి పారిశ్రామికీకరణ ఎంతో ముఖ్యం. ఆ ప్రకారం జిల్లాలో స్థాపితమైన శ్రీసిటీ, మాంబట్టు, మేనకూరు సెజ్‌లలో వందల పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఆయా పరిశ్రమల ద్వారా లక్ష మందికి పైగా ఉద్యోగావకాశాలు లభించాయి. అంతవరకు బాగానే ఉన్నా పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు పాటించడంలో మాత్రం యాజమాన్యాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. కొన్ని పరిశ్రమల్లో అయితే ఆ భద్రతా ప్రమాణాలు మచ్చుకైన కనపడని పరిస్థితి. తద్వారా ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒకచోట ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దాంతో ఆయా ప్రమాదాల భారీనపడి ప్రాణాలు కోల్పోయే కార్మికులే కాకుండా పరిశ్రమ మనుగడకు ఇది ఇబ్బందిగా మారుతుంది.
ఇటీవల జరిగిన ప్రమాదాలివీ
ఈ ఏడాది జనవరి ఒకటో తేదీన పెళ్లకూరు మండలం పెన్నేపల్లి సమీపంలోని అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో ఫర్నేస్ ఆయిల్ బాయిలర్ తీవ్రమైన ఒత్తిడికి లోనై పేలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు సిపాయిలాల్, సోనూమహ్మద్ మృతిచెందారు. మరో 8 మంది వరకు గాయపడ్డారు.
జూన్ 26వ తేది ఇదే పరిశ్రమలో మరోసారి అగ్ని ప్రమాదం జరిగి జూరాల యాదవ్ అనే కార్మికుడు మృతి చెందాడు.
గూడూరు మండలం తుంగపాళెం గ్రామం వద్ద ఉన్న కలర్‌షైన్ పరిశ్రమలో ఈనెల 13వ తేదీ జింక్‌ట్యాంక్ బాయిలర్ పేలిపోయిన దుర్ఘటనలో ఆదిత్యకుమార్ అనే కార్మికుడిపై జింక్ ద్రావణం పడింది. దీంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందగా, మరో 10 మంది వరకు గాయపడ్డారు.
2023లో ఓజిలి మండలం పెద్దపరియ గ్రామ సమీపంలోని నెల్‌క్యాస్ట్ పరిశ్రమలో ఫర్నెస్ ఆయిల్ బాయిలర్ పేలి సిలిండర్లపై పడ్డాయి. అవి పేలిపోయి ఆ పక్కనే విధుల్లో ఉన్న ఇద్దరు కార్మికులు అక్కడిక్కడే మృతి చెందగా, మరి కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
ఏడాది క్రితం మాంబట్టు సెజ్‌లోని డాల్మీయా పరిశ్రమకు సమీపంలోని అనధికార పరిశ్రమల వ్యర్థాల డంప్‌లో అగ్నిప్రమాదం జరగడంతో అగ్నిమాపక సిబ్బంది సుమారు 10 ఫైర్ ఇంజన్లతో రెండు రోజులపాటు తీవ్రంగా శ్రమించి ఆ మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో డాల్మీయ పరిశ్రమకు కొంత నష్టం వాటిల్లింది.
తాజాగా గురువారం.. ఏర్పేడు మండలం వికృతమాల రెవెన్యూ పరిధిలోని మునోత్ లిథియం అయాన్ బ్యాటరీల తయారీ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ సమయంలో పరిశ్రమలో కార్మికులెవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. రూ.65 కోట్లకుపైగా ఆస్తినష్టం జరిగినట్లు భావిస్తున్నారు.
ఇక, మేనకూరు సెజ్‌లోని అరబిందో పరిశ్రమలోని గ్రాన్యూలేషన్ విభాగంలోనూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో సుమారు రూ.15 కోట్ల ఆస్తినష్టం జరిగింది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు.
ఉదాసీనంగా పరిశ్రమ వర్గాలు
పరిశ్రమలో భద్రతా ప్రమాణాలపై కార్మిక, రెవెన్యూశాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి. జాతీయ భద్రతా సూచనలకు అనుగుణంగా ఆ పరిశ్రమ ఉందా లేదా అన్నది నిర్ధారించాలి. అలాగే బాయిలర్లు తీవ్ర ఒత్తిడితో ఉండే ట్యాంక్‌ల నాణ్యతా ప్రమాణాలను ప్రతి 6 నెలలకోసారి ఆయా సంస్థలు తనిఖీచేసి వాటి ఫిట్‌నె్‌సను నిర్ధారించాలి. అలాగే ఐఎ్‌సఐ, ఐఎ్‌సవో వంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కూడా పరిశ్రమ భద్రతా ప్రమాణాలను పరిగణలోకి తీసుకుని ఆమేరకు సర్టిఫికెట్లను మంజూరు చేయాలి. ఇలా భద్రతపై అటు ప్రభుత్వాలు, ఇటు ప్రభుత్వేతర సంస్థలు ధ్రువీకరించాకే ఆ పరిశ్రమ నడవాల్సి ఉంటుంది. కానీ, ఇన్ని నియమాలను, తనిఖీలను పరిశ్రమలు పెద్దగా పట్టించుకోవవడం లేదన్న విమర్శలున్నాయి. వీటిని ధ్రువీకరించి సర్టిఫికెట్లు మంజూరు చేసే సంస్థలు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలున్నాయి. ఇలా మొక్కుబడిగా తనిఖీలతో సర్టిఫికెట్లను మంజూరు చేయటంతోనే ఇటు వంటి ప్రమాదాలకు మూలంగా కనబడుతోందన్న ప్రచారం జరుగుతోంది. భద్రతలోపాలు బయటపడకూడదనే ఉద్దేశ్యంతో కొన్ని పరిశ్రమలు విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌లో అగ్ని ప్రమాదమని చెప్పడం సాధారణమైందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఒక విద్యుత్ ప్యానల్ బోర్డులోని వైర్లలో చిన్నపాటి లోపం ఏర్పడిన వెంటనే వాటిని నియంత్రించేలా ఏర్పాటు చేసే రిలే యూనిట్ల ద్వారా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగదు. ఒక వేళ అలా ప్రమాదం జరిగితే ఆ రిలేలు చెడిపోయేస్థితిలో ఉండటమో, నాణ్యతా ప్రమాణాలు లేని రిలేలను వినియోగించడంతోనే ఇటువంటి షార్ట్‌సర్క్యూట్‌లు జరుగుతుంటాయి. మచ్చుకు ఇది ఒక ఉదాహరణమాత్రమే. ఇలా ఇటువంటి ప్రమాదాల నేపథ్యంలో అధికారులు పరిశ్రమల్లో నిరంతరంగా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రమాదం జరిగిన రెండు, మూడు రోజులపాటు హడావుడి చేసి ఆ తర్వాత పట్టించుకోకపోవడంతోనూ ఇలాంటి ప్రమాదాలు మళ్లీ మళ్లీ జరుగుతున్నాయని చెప్పవచ్చు.