ఆగస్టు 15నుంచి ఫ్రీ బస్సు అమలు
ABN , Publish Date - Aug 11 , 2025 | 12:13 AM
రాష్ట్ర ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ హామీల్లో ఒకటైన ‘స్త్రీ శక్తి’ పేరిట ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని ఈనెల 15 తేదీ నుంచి శ్రీకారం చుట్టనున్న విషయం తెలిసిందే.
తిరుపతి- ఆంధ్రజ్యోతి
రాష్ట్ర ప్రభుత్వం ‘సూపర్ సిక్స్’ హామీల్లో ఒకటైన ‘స్త్రీ శక్తి’ పేరిట ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాన్ని ఈనెల 15 తేదీ నుంచి శ్రీకారం చుట్టనున్న విషయం తెలిసిందే. ఐదు రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. పల్లె వెలుగు, అల్ర్టా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అయితే తిరుపతి - తిరుమల ప్రయాణానికి మాత్రం ఉచితం లేదని అధికారులు అంటున్నారు. రేషన్ కార్డు/ఓటర్ ఐడీ/ఆధార్ కార్డుల్లో ఏదో ఒకటి కండక్టర్‌కు చూపిస్తే చాలు. ఆయన ‘జీరో’ టికెట్ ఇస్తారు. ఈ పథకాన్ని పక్కాగా అమలు చేయడానికి అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా తిరుపతి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జగదీష్ ‘ఆంధ్రజ్యోతి’తో సంభాషించారు.
ఫ సిబ్బందిని సమాయత్తం చేస్తున్నాం
ప్రభుత్వం, ఆర్టీసీ ప్రధాన కార్యాలయం నుంచి మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు వచ్చాయి. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నాం. సిబ్బందికి పలు దఫాలుగా అవగాహన కల్పిస్తున్నాం. బస్సుల కండిషన్స్ మెరుగుపరుస్తున్నాం. పూర్తిస్థాయిలో మరమ్మతులతో పాటు రంగులు వేస్తున్నాం. పాడైన బస్సులు అవకాశం ఉన్న వరకు సిద్ధం చేస్తున్నాం. ఆన్ కాల్ డ్రైవర్లను తీసుకోవడానికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాం. కండక్టర్లకు ఓడీ (ఓవర్ డ్యూటీ) ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిబ్బంది అవసరం కాబట్టి బస్టాండ్లలో, రిజర్వేషన్ కౌంటర్లు, అనౌన్స్‌మెంట్ ఇతర పనులకు ఉన్న కండక్టర్లను లైన్ మీదకు పంపే యోచనలో ఉన్నాం.
ఫ రద్దీ ప్రాంతాల్లో మరిన్ని బస్సులు
తిరుపతి నుంచి శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుచానూరుకు అదనపు బస్సుల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాం. పీక్ అవర్స్ రూట్స్ అయిన శ్రీకాళహస్తి, చిత్తూరు, సత్యవేడు, కాణిపాకం సర్వీసులు ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు మరిన్ని బస్సులు ఏర్పాటు చేయనున్నాం. అంతేగాకుండా గూడూరు, వాకాడు, వెంకటగిరి, సత్యవేడు నియోజకవర్గాల్లో తిరిగే బడి బస్సులను కూడా ఖాళీ సమయంలో రోడ్డెక్కించనున్నాం. లాంగ్‌రూట్ బస్సులను ఖాళీగా ఉంచకుండా రద్దీ ప్రాంతాలకు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. వారాంతం, పర్వదినాలు, సెలవులు రోజుల్లో ఓఆర్ (ఆక్యుపెన్సీ రేట్) తక్కువగా ఉన్న రూట్స్‌ను రద్దు చేసి రద్దీ ప్రాంతాలలో నడపనున్నాం. తిరుమలకు నడిచే సప్తగిరి ఎక్స్‌ప్రె్‌సలకు, నాన్‌స్టా్‌ప బస్సులకు స్పష్టత లేదు. తిరుపతి-తిరుమల మధ్య ఉచిత ప్రయాణం ప్రస్తుతానికి లేదు. అధికారికంగా ప్రకటన వస్తే మరిన్ని మార్పులు జరగవచ్చు.