Share News

నలుగురు నకిలీ విజిలెన్స్‌ అధికారుల అరెస్టు

ABN , Publish Date - Jul 11 , 2025 | 02:18 AM

విజిలెన్స్‌ అధికారులమంటూ వడమాలపేట మండలం ఎస్‌.వి.పురం వీఆర్వో భూపతిని బురడీ కొట్టించి రూ.1.5 లక్షలు కాజేసిన నలుగురిని అరెస్టు చేసినట్లు గాజులమండ్యం సీఐ మంజునాథ రెడ్డి గురువారం తెలిపారు.

నలుగురు నకిలీ విజిలెన్స్‌ అధికారుల అరెస్టు

డమ్మీ తుపాకీ, రూ.1.26 లక్షల స్వాధీనం

రేణిగుంట, జూలై 10 (ఆంధ్రజ్యోతి): విజిలెన్స్‌ అధికారులమంటూ వడమాలపేట మండలం ఎస్‌.వి.పురం వీఆర్వో భూపతిని బురడీ కొట్టించి రూ.1.5 లక్షలు కాజేసిన నలుగురిని అరెస్టు చేసినట్లు గాజులమండ్యం సీఐ మంజునాథ రెడ్డి గురువారం తెలిపారు. రేణిగుంట మండలం తిమ్మయ్యపల్లికి చెందిన కృష్ణంరాజు ఇచ్చిన సమాచారం మేరకు రెవెన్యూ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని ముఠాగా ఏర్పడ్డారు. ఈక్రమంలో గత నెల 28న ఉదయం రేణిగుంట మండలం జీవాగ్రంలోని వీఆర్వో భూపతి ఇంటికి ఏలూరుకి చెందిన కాశీవిశ్వేశ్వరయ్య, తెలంగాణ రాష్ట్రం మంచిర్యాలకు చెందిన సంతోష్‌, శంషుద్దీన్‌, తిరుపతికి చెందిన నరేంద్ర విజిలెన్స్‌ అధికారులమంటూ వచ్చారు. ఆయనపై ఫిర్యాదులు వచ్చాయంటూ బెదిరించడంతో, ఆందోళన చెందిన భూపతి రూ.1.5 లక్షలు ఇచ్చారు. మిగిలిన మొత్తాన్ని సర్దుబాటు చెయ్యాలని బెదిరించి వెళ్లారు. వారం తర్వాత పదే పదే డబ్బుల కోసం ఫోను చేయడంతో ఆయన గాజులమండ్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ సుధాకర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బుధవారం ఉదయం డబ్బు కోసం భూపతికి నకిలీ అధికారులు ఫోన్‌ చేశారు. పోలీసులు సూచించిన ప్రకారం తూకివాకం జంక్షన్‌కు వచ్చి డబ్బు తీసుకోవాల్సిందిగా భూపతి వారికి చెప్పాడు. అక్కడికి చేరుకున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో ఈ ముఠాకు కీలకమైన నిందితుడిని నరేంద్రను తిరుపతిలో అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి డమ్మీ తుపాకీ, 5 సెల్‌ఫోన్లు, రూ.1.26 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. గురువారం సాయంత్రం జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించామని సీఐ తెలిపారు.

Updated Date - Jul 11 , 2025 | 02:18 AM