శ్రీసిటీలో నేడు ఎల్జీ పరిశ్రమకు శంకుస్థాపన
ABN , Publish Date - May 08 , 2025 | 01:41 AM
రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో ఎల్జీ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు.
తిరుపతి, మే 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం తిరుపతి జిల్లాలోని శ్రీసిటీలో ఎల్జీ పరిశ్రమకు శంకుస్థాపన చేయనున్నారు. బుధవారం సాయంత్రం జిల్లాకు చేరుకున్న మంత్రి సత్యవేడులో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. రాత్రికి అక్కడే బస చేసి గురువారం ఉదయం శ్రీసిటీ చేరుకుని ఎల్జీ పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. శ్రీసిటీలో భూములు కేటాయిస్తే రూ. 5001 కోట్ల పెట్టుబడితో మూడు దశల్లో ఏసీలు, రిఫ్రిజిరేటర్లు తయారు చేసే ప్లాంట్ నెలకొల్పుతామని ఎల్జీ సంస్థ గతేడాది సెప్టెంబరులో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్లాంట్ ద్వారా 1495 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రతిపాదించింది. అంతేకాకుండా మరో రూ.839 కోట్లతో ఐదు అనుబంధ యూనిట్లు కూడా నెలకొల్పుతామని తెలిపింది. ఎల్జీ సంస్థ ప్రతినిధులతో సమావేశమైన మంత్రి లోకేశ్ ప్రభుత్వం నుంచీ అవసరమైన భూముల కేటాయింపు, రాయితీలు, మినహాయింపులు ఇవ్వడానికి హామీ ఇవ్వడంతో పాటు ఆ ప్రతిపాదన అమలుకు చొరవ తీసుకున్నారు. దీంతో మూడు దశలకూ కలిపి శ్రీసిటీలో ఆ సంస్థకు 450 ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం గతేడాది నవంబరులో ఉత్తర్వులు జారీ చేసింది. పలు రాయితీలు, మినహాయింపులు సైతం ప్రకటించింది. తొలుత నిర్ణయించుకున్న షెడ్యూలు ప్రకారం ఎల్జీ సంస్థ ఈ ఏడాది జనవరిలోనే ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించాల్సి ఉంది. అయితే వివిధ కారణాలతో ఆలస్యమైంది. ఇటీవల ఏర్పాట్లన్నీ పూర్తి కావడంతో శంకుస్థాపనకు నిర్ణయించారు. వాస్తవానికి ఎల్జీ పరిశ్రమకు ఇదే తేదీన సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసేలా తొలుత కార్యక్రమం ఖరారైంది. అయితే బిజీ షెడ్యూలు కారణంగా సీఎం పర్యటన మారింది. దీంతో ఐటీ మంత్రి నారా లోకేశ్ నేడు శంకుస్థాపన చేయనున్నారు.