మాజీ ఎమ్మెల్యే చెంచురెడ్డి కన్నుమూత
ABN , Publish Date - Aug 12 , 2025 | 01:47 AM
శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. శ్రీకాళహస్తి మండలం ఎంపేడులో 1937 జూలై 1న ఆయన జన్మించారు.
శ్రీకాళహస్తి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి అనారోగ్యంతో చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూశారు. శ్రీకాళహస్తి మండలం ఎంపేడులో 1937 జూలై 1న ఆయన జన్మించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని పొన్నాలమ్మ ఆలయం సమీపంలో స్వర్ణముఖి నది ఒడ్డున స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. బీఏ, బీఎల్ విద్యాభ్యాసం పూర్తి చేశారు. విద్యార్థి దశనుంచీ కాంగ్రెస్ పార్టీలో పోరాట నాయకుడిగా పేరు పొందారు. 1978, 1983, 1985 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున శ్రీకాళహస్తి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిచెందారు. 1985లో టీడీపీ తరపున పోటీ చేసిన సత్రవాడ మునిరామయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన రైల్వే కాంట్రాక్టరుగా ఉంటూ శాసనసభకు ఎన్నిక కావడంపై అభ్యంతరాలు వ్యక్తమమయ్యాయి. 1987లో సత్రవాడ మునిరామయ్య ఎన్నిక రద్దవడంతో 1988లో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి కొండుగారి శ్రీరామమూర్తిపై చెంచురెడ్డి 4,419 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సుమారు 18నెలల పాటు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. సుదర్ఘీకాలం కాంగ్రె్‌సపార్టీలో కొనసాగిన ఆయన 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. ఇటీవల వయసు మీదపడటంతో అనారోగ్యానికి గురయ్యారు. తిరుపతిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందారు. ఆయనకు భార్య సుభద్రమ్మ, కొడుకు మోహన్‌రెడ్డి, కుమార్తెలు చెంచులత, బాలమ్మ ఉన్నారు. బుధవారం ఇంటి వద్ద అంత్యక్రియలు జరిపేలా కుటుంబసభ్యులు ప్రకటన విడుదల చేశారు. ఆయన మృతిపై కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి, వైసీపీ నేత సిరాజ్‌బాషా, ముక్కంటి ఆలయ మాజీ పాలకమండలి మాజీ సభ్యుడు జయగోపాల్, రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం శ్రీకాళహస్తి యూనిట్ అధ్యక్షుబు వెంకయ్య, శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ సమన్వయకర్త దామోదర్‌రెడ్డి తదితరులు సంతాపం తెలిపారు.