Share News

వానల కోసం.. వలస దేవర

ABN , Publish Date - Jul 08 , 2025 | 12:23 AM

వర్షాభావ పరిస్థితుల నుంచి కాపాడాలని.. వానలు కురవాలంటూ ఏడు గ్రామాల ప్రజలు గ్రామాలు వదిలి వలసదేవర

వానల కోసం.. వలస దేవర
బాలచెరువు వద్ద జనసందడి

రామకుప్పం/శాంతిపురం, జూలై 7 (ఆంధ్రజ్యోతి): వర్షాభావ పరిస్థితుల నుంచి కాపాడాలని.. వానలు కురవాలంటూ ఏడు గ్రామాల ప్రజలు గ్రామాలు వదిలి వలసదేవర చేశారు. వరుణుడు కరుణించని ప్రతిసారీ శాంతిపురం మండలం కర్లగట్ట పంచాయితీకి చెందిన కర్లగట్ట, తుమ్మిగానిపల్లె, చిన్నకర్లగట్ట, కాళిగానూరు, బెల్లప్పకొటాలు, ప్రీతిచామనూరు, మంకప్పకొట్టాలు గ్రామాల ప్రజలు ఒక రోజు తమ గ్రామాలను వదిలి కర్లగట్ట సమీపంలోని బాలచెరువుకు చేరుకుంటారు. అక్కడ వలస దేవర చేయడంగా ఆచారంగా వస్తోంది. ఈసారి వానాకాలం ప్రారంభమైనా.. వానలు కురవక పోవడంతో సోమవారం ఏడు గ్రామాల ప్రజలు తమ గ్రామాలకు ఉన్న అన్ని దారులను ముళ్ల కంపలతో మూసివేశారు. ఉదయం ఆరు గంటలకే అన్ని కుటుంబాలవారు ఇళ్లలోని పశువులు, గొర్రెలతోపాటు నిత్యావసర వస్తువులను తీసుకుని.. బాలచెరువు వద్దకు దీపాలతో ఊరేగింపుగా వెళ్లారు. అక్కడే వంటావార్పు చేసుకున్నారు. మధ్యాహ్నం తర్వాత అమ్మవారికి దీపారాధనలు చేశారు. చీకటిపడ్డాక గ్రామాలకు చేరుకుని గ్రామదేవతలకు జంతుబలులిచ్చాక ఇళ్లలోకి వెళ్లారు.

Updated Date - Jul 08 , 2025 | 12:23 AM