క్లస్టర్ల వ్యవస్థకు మంగళం
ABN , Publish Date - Oct 14 , 2025 | 01:53 AM
కొత్త సంస్కరణలతో పల్లె పాలన మారనుంది. గ్రామపంచాయతీల సర్వతోముఖాభివృద్ధికి తీసుకొస్తున్న నూతన విధానానికి రాష్ట్ర మంత్రివర్గం రెండు రోజుల కిందట ఆమోదం తెలిపింది. ప్రజలకు చేరువగా పాలన ఉండటంతో పాటు కేంద్రప్రభుత్వం నుంచి అధిక మొత్తంలో నిధులు రాబట్టేలా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో క్లస్టర్ల వ్యవస్థకు మంగళం పలికింది.
తిరుపతి(కలెక్టరేట్), అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): కొత్త సంస్కరణలతో పల్లె పాలన మారనుంది. గ్రామపంచాయతీల సర్వతోముఖాభివృద్ధికి తీసుకొస్తున్న నూతన విధానానికి రాష్ట్ర మంత్రివర్గం రెండు రోజుల కిందట ఆమోదం తెలిపింది. ప్రజలకు చేరువగా పాలన ఉండటంతో పాటు కేంద్రప్రభుత్వం నుంచి అధిక మొత్తంలో నిధులు రాబట్టేలా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో క్లస్టర్ల వ్యవస్థకు మంగళం పలికింది. గ్రేడ్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. పట్టణ సమీపంలో ఉండే పంచాయతీలను రూరల్-అర్బన్ (రూర్బన్) పంచాయతీలుగా ప్రత్యేక గ్రేడ్ ఇస్తున్నారు. వీటిలో 10 వేల జనాభా, కోటిపైన ఆదాయం ఉండాలి. ఈ పంచాయతీల్లో గ్రామ కార్యదర్శుల స్థానంలో డిప్యూటీ ఎంపీడీవో (ఈవోపీఆర్డీలు)లు నియమితులు కానున్నారు. మున్సిపాలిటీల్లో ఏ విధమైన పాలన ఉంటుందో ఇక్కడా అదే తరహాలో కొనసాగుతుంది. మిగిలిన పంచాయతీలను.. మూడువేలపై జనాభా ఉన్న వాటిని గ్రేడ్-1గా, 3వేలు జనాభాలోపు గ్రేడ్-2గా, 2 వేల లోపు జనాభాఉన్న పంచాయతీలను గ్రేడ్-3గా విభజించారు. ఇలా గ్రామ పంచాయతీ వ్యవస్థను ప్రక్షాళన దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరోవైపు సచివాలయ వ్యవస్థను హేతుబద్ధీకరిస్తున్నారు.
పీడీవోలుగా పంచాయతీ కార్యదర్శులు
గ్రామపంచాయతీ కార్యదర్శులు ఇక పంచాయతీ డెవల్‌పమెంట్ అధికారులు(పీడీవో)గా వ్యవహరించనున్నారు. పల్లెల అభివృద్ధిలో వీరి పాత్ర కీలకం చేశారు. ప్రతి పంచాయతీకి పీడీవో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోంటోంది.
జిల్లాలో పంచాయతీలు: 774
అర్బన్-రూరల్ పంచాయతీలు: 15
గ్రేడ్-1: 49
గ్రేడ్ -2: 145
గ్రేడ్ -3: 569
గ్రామీణ జనాభా: 16.82 లక్షలు
ఏటా వచ్చే ఇంటి పన్ను: రూ.42కోట్లు.
సుస్థిర పాలనకు ఊతం
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సంస్కరణలు గ్రామాల్లో సుస్థిర అభివృద్ధికి, సుపరిపాలకు ఎంతగానో దోహదపడతాయి. పట్టణాల తరహాల్లో పల్లెలను అభివృద్ధి చేసేలా కొత్త వ్యవస్థను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. మున్సిపాలిటీ తరహాలోనే నూతన పట్టణ ప్రణాళిక విభాగం ఏర్పాటు చేయడంతో ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది.
- సుశీలాదేవి, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి