కఠారి దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరి
ABN , Publish Date - Nov 01 , 2025 | 01:43 AM
ఉమ్మడి చిత్తూరు జిల్లా చరిత్రలోనే ఒక సంచలన తీర్పు వెలువడింది. చిత్తూరు మొదటి మేయర్ కఠారి అనురాఽధ దంపతుల హత్య కేసులో ఐదుగురికి చిత్తూరు కోర్టు శుక్రవారం ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.
శిక్ష ప్రకటించిన న్యాయమూర్తి
బాధిత కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం
గాయపడిన ప్రత్యక్ష సాక్షికి రూ.20 లక్షలు ఇవ్వాలని ఆదేశం
ఉమ్మడి చిత్తూరు జిల్లా చరిత్రలోనే ఒక సంచలన తీర్పు వెలువడింది. చిత్తూరు మొదటి మేయర్ కఠారి అనురాఽధ దంపతుల హత్య కేసులో ఐదుగురికి చిత్తూరు కోర్టు శుక్రవారం ఉరి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. 2015 నవంబరు 17న కఠారి అనురాధ, మోహన్ దంపతుల్ని నగరపాలక సంస్థ కార్యాలయంలోనే క్రూరంగా హత్య చేశారు. పదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం శుక్రవారం ఉదయం 10:50 గంటలకు న్యాయమూర్తి శ్రీనివాసరావు తుది తీర్పు ప్రకటించారు.
- చిత్తూరు లీగల్, ఆంధ్రజ్యోతి
ఇదీ తీర్పు!
ఏ1 నుంచి ఏ5 దాకా చింటూ, వెంకటా చలపతి, జయప్రకా్‌షరెడ్డి, మంజునాథ్, వెంకటే్‌షలకు ఉరిశిక్ష.
ఏ1 చింటూ బాధిత కఠారి కుటుంబీకులకు రూ.50 లక్షలు, గాయపడిన సతీ్‌షకు రూ.20 లక్షలు పరిహారం చెల్లించాలి.
ఏ2, ఏ3, ఏ4, ఏ5లకు రూ.11,500 చొప్పున జరిమానా.
సాక్షులకు నోటీసులు
పోలీసుల విచారణలో చెప్పిన వాంగ్మూలాన్ని కోర్టులో చెప్పకుండా అబద్ధం చెప్పిన 9 మంది సాక్షుల నుంచి సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేయాలని కోర్టు సిబ్బందిని న్యాయమూర్తి ఆదేశించారు.
కేసులో నిందితులు: శ్రీరామచంద్రశేఖర్ అలియాస్ చింటూతో పాటు 22 మంది.
సాక్షులు: 133 మంది.
విచారించింది 57 మందిని
బెయిల్: చింటూ, జయప్రకాష్, మంజునాథ్ మినహా మిగిలిన వారికి హైకోర్టు షరతులతో కూడిన బెయిళ్లను మంజూరు చేసింది. ప్రధాన నిందితుడు చింటూకు సుప్రీం కోర్టు బెయిల్ ఇచ్చింది. జయప్రకా్‌షరెడ్డి, మంజునాథ్‌లకు బెయిల్ రాకపోవడంతో
రిమాండ్ ఖైదీలుగా కోర్టు వాయిదాలకు హాజరయ్యేవారు.
352 వాయిదాలు
చిత్తూరు అర్బన్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): కఠారి అనురాధ దంపతుల హత్య కేసుకు సంబంధించి 2015 ఫిబ్రవరి 16న చిత్తూరు ఒకటవ పట్టణ పోలీసులు కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ కేసుకు సంబంధించి 355 వాయిదాలు జరిగాయి. కొన్నిసార్లు నిందితులు నేరుగా కోర్టుకు హాజరుకాగా... ఇంకొన్నిసార్లు జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాయిదాలకు హాజరయ్యారు. ఈ పదేళ్ల కాలంలో కఠారి దంపతుల హత్య కేసు రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.2025 నవంబరు 10వ తేదిలోపు తీర్పు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కోర్టు సాక్షుల విచారణను వేగవంతం చేసి శుక్రవారం శిక్షలు ఖరారు చేస్తూ తీర్పు ప్రకటించింది.
తుది తీర్పు.. వారం రోజుల ఉత్కంఠ
పదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఈ నెల 24వ తేదీన ఈ కేసు తుది దశకు చేరుకుంది. ఈ కేసులో ఉన్న నిందితులంతా కోర్టుకు వచ్చారు. ఏ1 నుంచి ఏ5 వరకు నిందితులపై శిక్ష ఖరారైందని, మిగిలినవారిపై కేసు కొట్టేస్తున్నట్లు కోర్టు తీర్పు ఇచ్చింది. శిక్ష పడ్డ చింటూ, వెంకటా చలపతి, జయప్రకా్‌షరెడ్డి, మంజునాథ్, వెంకటే్‌షలను కస్టడీలోకి తీసుకోవాలని ఆరవ అదనపు జిల్లా కోర్టు ఇన్‌చార్జి న్యాయమూర్తి శ్రీనివాసరావు ఆదేశించారు. ఐదుగురిపై తుది తీర్పును 30వ తేదీకి వాయిదా వేశారు. 30న చింటూ తరఫు న్యాయవాది విజయచంద్రారెడ్డి పలు కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పుల పత్రాలను జిల్లా న్యాయమూర్తికి అందించారు. నాలుగు గంటల సేపు వాదనల్ని వినిపించారు. పీపీ శైలజ కూడా కోర్టుకు తమ వాదనల్ని వినిపించారు. అలాగే వైద్యాధికారులు, జైలు సూపరింటెండెంట్, పోలీసులు, మానసిక వైద్యులు వేర్వేరుగా ఇచ్చిన నివేదికలను న్యాయమూర్తి పరిశీలించారు. తీర్పును శుక్రవారం వెల్లడిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం పోలీసులు కోర్టు పరిధిలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. కక్షిదారులను కూడా అనుమతించలేదు. మీడియా సిబ్బందిని కూడా పరిమితంగానే లోపలికి పంపించారు.
కేసు.. సెక్షన్లు..
హత్య జరిగిన సమయంలో ప్రత్యక్ష సాక్షి సతీ్‌షకుమార్ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అప్పటి వన్ టౌన్ సీఐ నిరంజన్‌కుమార్ పలు సెక్షన్ల కింద 130-2015 నెంబరుతో కేసు పెట్టారు. 147, 148, 302, 307, 326, 120-బీ, 109 రెడ్‌విత్ 149, ఐపీసీ సెక్షన్ 212, 216, 201, ఐపీసీ సెక్షన్ 25 (1ఏ), సెక్షన్ 25 (1ఏఏఏ), సెక్షన్ 25 (1బీ)(ఏ), సెక్షన్ 25 (1బీ)(సీ), సెక్షన్ 27 (3) అండ్ సెక్షన్, 30ఆఫ్‌ది ఆర్మ్స్ యాక్ట్ 1959 కింద కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. అప్పటి ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీఎస్పీ లక్ష్మీనాయుడు ఆధ్వర్యంలో దర్యాప్తు సాగింది. 69 మంది వాంగ్మూలాలను నమోదు చేశారు. ఏ2 నుంచి ఏ23 వరకు ఉన్న నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.. 22వ నిందితుడైన శ్రీకాళహస్తికి చెందిన కాసరం రమే్‌షను విచారణ సమయంలోనే కోర్టు డిశ్చార్జ్ చేసింది. 21వ నిందితుడు శ్రీనివాసాచారి వయసైపోయి మరణించాడు.