శేషాచలంలో తొలిసారి పులుల గణన
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:31 AM
శేషాచలంలో పెద్దపులి కోసం తొలిసారి అన్వేషణ మొదలవుతోంది.
మంగళం, ఆంధ్రజ్యోతి
శేషాచలంలో పెద్దపులి కోసం తొలిసారి అన్వేషణ మొదలవుతోంది. దేశవ్యాప్తంగా అన్ని అడవుల్లోనూ డిసెంబరులో జరిగే పులుల గణన కార్యక్రమం శేషాచలం లోనూ ఈసారి జరగనుంది. నాలుగేళ్లకు ఒకసారి మాత్రమే పులుల సంఖ్యను లెక్కిస్తారు. నల్లమల అడవులను మాత్రమే ఆవాసంగా చేసుకున్న పెద్దపులి జాడ శేషాచలం సమీపంలో కొన్నేళ్లుగా కనిపించడమే ఇందుకు కారణం. 2017లో చామల రేంజ్ (నల్లమల అటవీప్రాంతం)లో ఒక మగపులి కనిపించింది. నాగార్జునసాగర్ రిజర్వ్ నుంచి ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని నల్లమల, శేషాచలం కొండల మధ్య ఉన్న టైగర్‌కారిడార్‌లోకి పెద్దపులి ప్రవేశించిందని అప్పుడు గుర్తించారు. అలాగే ఈ ఏడాది ఆగస్టు నెలలో శేషాచల అడవులకు ఆనుకుని ఉన్న అన్నమయ్య జిల్లాలోని చిట్వేలి అడవుల్లోకూడా పెద్దపులి కనిపించింది. ఇక్కడ ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో పగటిపూట, సాయంత్రం సమయాల్లో పులి తిరుగుతున్నట్టు రికార్డు అయింది. దాదాపు వందేళ్ల తరువాత ఈ ప్రాంతంలో పెద్దపులి కనిపించడం విశేషం. నల్లమల నుంచి వచ్చిన పెద్దపులులు శేషాచలంలో ఎన్ని ఉన్నాయో ఈ లెక్కింపు ప్రక్రియలో తేలనుంది.
300 ట్రాప్ కెమెరాలు
తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో పులుల గణన కోసం 300 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. రేంజ్ విస్తీర్ణం బట్టి 20 నుంచి 30 కెమెరాలు పెడుతారు.ఇక్కడ 15మంది సిబ్బందిని ఏర్పాటు చేస్తారు. ట్రాప్ కెమెరాల ద్వారా పెద్దపులితో పాటూ ఇతర జంతువుల లెక్కింపు కూడా జరుగుతుంది.
పులులు ఎలా లెక్కిస్తారంటే..
ట్రాప్ కెమెరాలు
అడవిలోని వివిధప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేస్తారు. పులులు కదలిక కనిపించినపుడు కెమెరాలు గుర్తించి ఫోటోలు తీస్తాయి.
పాదముద్రలు
అడవుల్లో పులుల పాదముద్రల కోసం అన్వేషిస్తారు. వాటిని గుర్తించడం ద్వారా పులి పరిమాణం, ఆకారం , వయసు అంచనా వేస్తారు.
వెంట్రుకలు, గోళ్లు
పులులు తిరిగిన ప్రదేశాల్లోనూ, ఆవాసంగా చేసుకున్న తావుల్లోనూ వెంట్రుకలు, గోళ్లు సేకరిస్తారు. వీటిని డీఎన్‌ఏ పరీక్షలు కోసం పంపుతారు. ఈ నమూనాల ద్వారా పులుల సమగ్ర సమాచారం నిర్ధారిస్తారు.
భూభాగ విశ్లేషణ
పులులు నివసించే ప్రాంతాలను ముందుగా గుర్తిస్తారు. ఆ ప్రాంతాల్లోని ఇతర జంతువుల సంఖ్యను అంచనా వేస్తారు. పులికి ఆహారంగా ఉండే జంతువుల సంఖ్య ఎక్కువగా ఉన్న ప్రాంతానే పులి ఆవాసంగా ఎంచుకుంటుంది.