Share News

చేనేత-హస్తకళల్లో జిల్లాకు మొదటి బహుమతి

ABN , Publish Date - Jul 15 , 2025 | 02:03 AM

జాతీయ స్థాయిలో చేనేత, హస్తకళల విభాగంలో (వెంకటగిరి పట్టుచీరలకు) జిల్లాకు ప్రథమ బహుమతి లభించింది.

చేనేత-హస్తకళల్లో జిల్లాకు మొదటి బహుమతి

కేంద్రమంత్రి నుంచి అవార్డు అందుకున్న కలెక్టర్‌ వెంకటేశ్వర్‌

వెంకటగిరి పట్టుచీరకు జాతీయ గుర్తింపు

తిరుపతి(కలెక్టరేట్‌), జూలై 14(ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో చేనేత, హస్తకళల విభాగంలో (వెంకటగిరి పట్టుచీరలకు) జిల్లాకు ప్రథమ బహుమతి లభించింది. కేంద్రప్రభుత్వం నిర్వహించిన ఓడీఓపీ (వన్‌ డిస్ట్రిక్‌ వన్‌ ప్రొడెక్ట్‌) జాతీయ అవార్డుల ప్రదానోత్సవంలో ఢిల్లీలోని భారత మండపం(ప్రగతిభవన్‌)లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూ్‌షగోయల్‌, సీఎం రేఖ గుప్తా చేతుల మీదుగా మొదటి బహుమతి (బంగారు కేటగిరి)ని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ సోమవారం అందుకున్నారు. ‘జిల్లాలో ఓడీఓపీ కింద ప్రోత్సహిస్తున్న వెంకటగిరి పట్టుచీరలు, స్థానికంగా చేనేత ఉత్పత్తుల వైశిష్ట్యం, నాణ్యత, గౌరవానికి జిల్లాకు మొదటి బహుమతి రావడం ఆనందంగా ఉంది. ఇలాంటి పురస్కారాలు కళాకారులను ప్రోత్సహించేలా ఉంటుంది. వారి జీవనోపాధికి భరోసా కల్పిస్తుంది. వెంకటగిరి చీరలకు జాతీయస్థాయి గుర్తింపు రావడం, ప్రాంతీయ కళాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చే అవకాశాన్ని కలిగించింది’ అని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి జితిన్‌ ప్రసాద్‌, రాష్ట్ర మంత్రి సవిత, జిల్లా చేనేత అధికారి రాచపూడి రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 02:03 AM