Share News

వేలి ముద్ర వేయాల్సిందే

ABN , Publish Date - Jul 15 , 2025 | 02:10 AM

ఎక్కడో హత్యలు చేస్తారు. తిరుపతిలోని లాడ్జీలో దిగుతారు. ఎక్కడో నేరాలకు పాల్పడతారు. నెలలపాటు జిల్లాలో ఆశ్రయం పొందుతారు. ఇలా ఎక్కడపడితే అక్కడ నేరస్థులు తప్పుడు వివరాలిచ్చి దర్జాగా తలదాచుకునే పరిస్థితి లేకుండా పోలీసులు వినూత్న విధానాన్ని తీసుకొస్తున్నారు.

వేలి ముద్ర వేయాల్సిందే

నేరస్థుల గుర్తింపుకోసం పోలీసుల వినూత్న విధానం

అన్ని లాడ్జీలు, హోం స్టేలు, హోటళ్లలో త్వరలో పరికరాల ఏర్పాటు

ఎక్కడో హత్యలు చేస్తారు. తిరుపతిలోని లాడ్జీలో దిగుతారు. ఎక్కడో నేరాలకు పాల్పడతారు. నెలలపాటు జిల్లాలో ఆశ్రయం పొందుతారు. ఇలా ఎక్కడపడితే అక్కడ నేరస్థులు తప్పుడు వివరాలిచ్చి దర్జాగా తలదాచుకునే పరిస్థితి లేకుండా పోలీసులు వినూత్న విధానాన్ని తీసుకొస్తున్నారు. లాడ్జీల్లో వేలి ముద్ర వేస్తేనే గదులిచ్చేలా చర్యలు చేపడుతున్నారు.

- తిరుపతి (నేరవిభాగం), ఆంధ్రజ్యోతి

తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో దేశ విదేశాల నుంచి శ్రీవారి దర్శనం కోసం రోజూ వేలాది మంది వస్తుంటారు. అదే సమయంలో కొన్ని అసాంఘిక శక్తులూ వచ్చి తలదాచుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఆధార్‌, చిరునామా తీసుకుని బయటి వారికి రూములు ఇస్తున్నారు. దీనివల్ల కొంత వరకు ఫలితాలు వస్తున్నాయి. కానీ చాలా హోటళ్లు, లాడ్జీలు, హోంస్టేలలో తూతూ మంత్రంగా అమలు చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎస్పీ హర్షవర్ధనరాజు తిరుపతితో పాటు జిల్లాలోని అన్ని వసతి సముదాయాల్లో ఆన్‌లైన్‌ విధానం అమలు చేసేలా చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని అన్ని హోటళ్లు, లాడ్జీలు, హోంస్టేల కాంటాక్టు నెంబర్లు తీసుకుని వాటిని పోలీసు యాప్‌తో అనుసంధానం చేసేలా చర్యలు చేపట్టారు. అలాగే, వీటిలో దిగే వారి అడ్ర్‌సలు, కాంట్రాక్టు నెంబర్లు కూడా పోలీసు యాప్‌తో అనుసంధానం అయ్యేలా చూస్తున్నారు. ఇప్పటి వరకు నెలన్నర కాలంలో 261 హోంస్టేలు, 304 లాడ్జీలను ఆన్‌లైన్‌ చేశారు. మిగిలిన వాటినీ త్వరలో ఆన్‌లైన్‌ చేయనున్నారు. ఇక, అన్ని హోటళ్లు, లాడ్జీలు, హోం స్టేలలో వేలిముద్రల డివైజర్లను అందుబాటులో ఉంచాలి. నాలుగు నెలల వ్యవధిలో వీటిని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత నుంచి వేలిముద్ర వేస్తేనే గదులు ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియను పోలీసు కమాండ్‌ కంట్రోల్‌తో అనుసంధానం చేస్తారు. దీంతో గదుల కోసం వేలి ముద్ర వేసిన వారిలో నేరస్థులు ఉంటే.. వారి నేర చరిత్ర తెలుసుకోవడానికి వీలవుతుంది. ఇక, ఏ గదిలో ఎవరు.. ఎంతమంది.. ఏప్రాంతానికి చెందిన ఉంటున్నారనే వివరాలూ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది అమలైతే నేరాలు, అసాంఘిక కార్యక్రమాలు బాగా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని ఎస్పీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Jul 15 , 2025 | 02:10 AM