Share News

కఠారి దంపతుల హత్యకేసులో నేడు తుది తీర్పు

ABN , Publish Date - Oct 24 , 2025 | 01:07 AM

పదేళ్ల క్రితం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అప్పటి చిత్తూరు మేయర్‌ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్‌ హత్య కేసుకు సంబంధించి శుక్రవారం తుదితీర్పు వెలువడనుంది.

కఠారి దంపతుల హత్యకేసులో నేడు తుది తీర్పు
కఠారి మోహన్‌, అనురాధ

21మంది నిందితుల,122మంది సాక్షుల విచారణ

పదేళ్ల విచారణ తరువాత వెలువడనున్న తీర్పు

ఆరుగురు సీఐలు, 15 మంది ఎస్‌ఐలతో పాటు

179మంది పోలీసులతో భారీ బందోబస్తు

చిత్తూరు అర్బన్‌, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి):పదేళ్ల క్రితం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అప్పటి చిత్తూరు మేయర్‌ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్‌ హత్య కేసుకు సంబంధించి శుక్రవారం తుదితీర్పు వెలువడనుంది. పదేళ్ల సుదీర్ఘ విచారణ తరువాత జిల్లా కేంద్రంలో ఉన్న ప్రత్యేక మహిళా న్యాయస్థానం ఈ కేసుకు సంబంధించిన తీర్పును వెలువరించనుంది. 2015 నవంబరు 17వ తేదీన ఉదయం చిత్తూరు నగరపాలక కార్యాలయం తుపాకుల కాల్పులతో, కత్తిపోట్లతో హోరెత్తింది.చిత్తూరు కార్పొరేషన్‌ తొలి మేయర్‌ అనురాధతో పాటు మున్సిపల్‌ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడైన ఆమె భర్త కఠారి మోహన్‌ వారి ఛాంబర్లలో ఉన్నారు.ఇంతలో బురఖా ధరించిన కొంతమంది కత్తులు, తుపాకులతో కార్యాలయంలోకి వచ్చారు. మేయర్‌ అనురాధను ఆమె ఛాంబర్‌లో పాయింట్‌బ్లాంక్‌ రేంజ్‌లో తుపాకీతో కాల్చడంతో ఆమె అక్కడిక క్కడే చనిపోయారు.కాల్పుల శబ్దం విని వచ్చిన ఆమె భర్త కఠారి మోహన్‌ అక్కడి దృశ్యం చూసి దిగ్ర్భాంతి చెందారు. వెంటనే దుండగులు కత్తులతో అతడి వెంటపడ్డారు.ప్రాణభయంతో కౌన్సిల్‌ హాలు గుండా పరుగెత్తగా కత్తులతో పొడిచి పారిపోయారు.తీవ్రగాయాలతో రక్తమోడుతున్న మోహన్‌ను వెంటనే వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించగా అదేరోజు సాయంత్రం ఆయన కూడా మృతి చెందారు.మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కఠారి మోహన్‌ మేనల్లుడు చింటూను ప్రధాన నిందితుడిగా చూపించిన పోలీసులు..ఈ జంట హత్యలకు సంబంధముందని 23 మందిని అరెస్టు చేశారు.వీరిలో శ్రీకాళహస్తికి చెందిన కాసరం రమేష్‌ అనే వ్యక్తికి హత్యలతో సంబంధం లేదని గతంలోనే న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. మరో నిందితుడు శ్రీనివాసాచారి కేసు విచారణలో ఉండగానే అనారోగ్యంతో మృతి చెందాడు. మిగిలిన 21మందిలో చింటూ ప్రధాన నిందితుడు కాగా వెంకటాచలపతి, జయప్రకా్‌షరెడ్డి, మంజునాధ్‌, వెంకటేశ్‌, మురుగన్‌, యోగానంద్‌, పరంధామ, దాసు, మొగిలి, శశిధర్‌, యోగానందం, ఆర్వేటి బాబు, లోకేష్‌, రఘుపతి, నాగరాజు, ఆనంద్‌కుమార్‌, కమలాకర్‌, రజనీకాంత్‌, నరేంద్రబాబు, సురేష్‌ పేర్లను పోలీసులు ఛార్జీషీట్‌లో దాఖలు చేశారు.ఈ పదేళ్ల కాలంలో మొత్తం 122 మంది సాక్షులను విచారించిన జిల్లా జడ్జి శ్రీనివాసరావు శుక్రవారం తీర్పు వెలువరించనున్నారు.

200మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు

రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన మేయర్‌ దంపతుల హత్య కేసుకు సంబంధించి శుక్రవారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో పోలీసుశాఖ అప్రమత్తమైంది. కోర్టు ఏ తీర్పు ఇచ్చినా...కోర్టు ఆవరణతో పాటు నగరంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందుకోసం ఆరుగురు సీఐలు, 15 మంది ఎస్‌ఐలతో పాటు 179 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. వీరు కోర్టు ప్రాంగణంతో పాటు కఠారి కుటుంబం , చింటూ నివాసాలున్న గంగనపల్లె, ప్రధాన కూడళ్ల వద్ద బందోబస్తును నిర్వహి ంచనున్నట్లు డీఎస్పీ సాయినాథ్‌ తెలిపారు.

Updated Date - Oct 24 , 2025 | 01:07 AM