ఎల్వీఎం3-ఎం5 రాకెట్‌కు తుది పరీక్షలు
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:29 AM
ఇస్రో మరో భారీ ఉపగ్రహ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఎల్వీఎం3-ఎం5 రాకెట్ ద్వారా సీఎంఎస్-03 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు.
సూళ్లూరుపేట, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఇస్రో మరో భారీ ఉపగ్రహ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఎల్వీఎం3-ఎం5 రాకెట్ ద్వారా సీఎంఎస్-03 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు. ఇప్పటి వరకు ఎన్నో శక్తిమంతమైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన ఇస్రో తాజాగా 4,410 కిలోల బరువు కలిగిన మల్టీబ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. నవంబరు 2న సాయంత్రం 5:26 గంటలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఎల్వీఎం3-ఎం5 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ప్రయోగ వేదికపై ఉన్న రాకెట్‌కు బుధవారం శాస్త్రవేత్తలు తుది పరీక్షలు నిర్వహించి ప్రయోగానికి సిద్ధం చేస్తున్నారు. ప్రయోగానికి సంబంధించిన ఎంఆర్‌ఆర్ సమావేశం ఈ నెల 31న షార్‌లో జరగనుంది. అదేరోజు మిషన్ రెడీనెష్ రివ్యూ (ఎంఆర్‌ఆర్) సమావేశం షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో కౌంట్‌డౌన్ సమయం అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం ఇస్రో వర్గాల సమాచారం మేరకు కౌంట్‌డౌన్‌ను 24 గంటల ముందు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇస్రో అత్యంత బరువైన ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఇదే ప్రఽథమం. భారత్ సహా విశాలమైన సముద్ర ప్రాంతంలో కమ్యూనికేషన్ సేవలు అందించడం కోసం ఈ ఉపగ్రహాన్ని మన శాస్త్రవేత్తలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి ప్రయోగిస్తున్నారు. రాకెట్ ప్రయోగం 16 నిమిషాల్లో పూర్తయ్యేలా డిజైన్ చేశారు.