Share News

వారిపై కేసు నమోదు చేయండి

ABN , Publish Date - Jun 09 , 2025 | 12:38 AM

అమరావతి మహిళ లను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన.. చేయించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఎస్పీ హర్షవర్ధన్‌ రాజుకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

వారిపై కేసు నమోదు చేయండి
ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నేతలు సుగుణమ్మ, నరసింహ యాదవ్‌, ఆర్సీ మునికృష్ణ తదితరులు

తిరుపతి, జూన్‌8(ఆంధ్రజ్యోతి): అమరావతి మహిళ లను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన.. చేయించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఎస్పీ హర్షవర్ధన్‌ రాజుకు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఏపీజీబీసీ చైర్‌పర్సన్‌ ఎం.సుగుణమ్మ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్‌ చైర్మన్‌ నరసింహ యాదవ్‌, డిప్యూటీ మేయర్‌ ఆర్సీ మునికృష్ణ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రుల రాజధాని అమరావతిపై జగన్‌ టీవీలో జగన్మోహన్‌ రెడ్డి, భారతి దంపతుల ప్రోద్బలం లేకుండా ఇలాంటి నీచమైన చర్చాగోష్ఠి జరగదన్నారు. దీనిపై జగన్‌ వెంటనే రాష్ట్ర ప్రజలకు, మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండు చేశారు. జర్నలిస్టుల ముసుగులో ఉన్న సంస్కారహీనులు, కిరాయి బ్యాచ్‌ మహిళలను కించపరుస్తూ చేసిన నీచపు వ్యాఖ్యలు మహిళల వ్యక్తిత్వం మీద దాడిగా చూస్తున్నారన్నారు. జగన్‌ రెడ్డి కుంభకోణాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకే అమరావతిపై దుర్మార్గపు దాడి చేయించారని, స్వార్థ రాజకీయం కోసం ఇంత నీచానికి దిగజారిన జగన్‌ వైఖరిని ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని పిలుపునిచ్చారు. వీరిపై మహిళా కమిషన్‌, ఎస్సీ కమిషన్‌, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీని కలిసినవారిలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ రుద్రకోటి సదాశివం, నాయకులు పులుగోరు మురళీకృష్ణారెడ్డి, కుమారమ్మ, దంపూరి భాస్కర్‌, మన్నెం శ్రీనివాసులు, చినబాబు, పాటకం వెంకటేష్‌, కార్పొరేటర్‌ అన్నా అనిత, మునిశేఖర్‌ రాయల్‌, ఆముదాల తులసీరాం, కొట్టే హేమంత్‌ రాయల్‌, కంకణాల రజనీకాంత్‌, రామారావు తదితరులున్నారు.

Updated Date - Jun 09 , 2025 | 12:38 AM