Share News

సచివాలయాలకు ఫైబర్‌నెట్‌ బంద్‌

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:03 AM

ఫైబర్‌నెట్‌ సేవలు బంద్‌ అయ్యాయి. ఫలితంగా పౌరసేవలకు అంతరాయం కలిగింది.

  సచివాలయాలకు ఫైబర్‌నెట్‌ బంద్‌

చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రామ సచివాలయాల్లో ఫైబర్‌నెట్‌ సేవలు బంద్‌ అయ్యాయి. ఫలితంగా పౌరసేవలకు అంతరాయం కలిగింది. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు గ్రామ సచివాలయాలకు అంతరాయం లేని ఫైబర్‌ నెట్‌ సేవలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. గత ఏడాది కార్యాలయాలను సర్వేచేసి, వాటికి కనెక్షన్లు ఇచ్చారు. కానీ మెజార్టీ సచివాలయాల్లో సేవలు అందడం లేదు. ఫైబర్‌నెట్‌ ప్రతినిధులు వాటి నిర్వహణను పూర్తిగా వదిలేశారు. దీంతో కార్యాలయాల్లో నెట్‌బాక్సులు మూలకు చేరాయి. జిల్లాలో 220 గ్రామాల్లో నెట్‌ కనెక్షన్లు లేకపోవడంతో కొండల్లోకి, గుట్టల్లోకి వెళ్ళి ప్రజలకు అవసరమైన పత్రాలను సిబ్బంది అందజేస్తున్నారు. ఈ కారణంగా విధులకు ఆలస్యమౌతుందని, ప్రభుత్వ యాప్‌లను వందశాతం సక్రమంగా నిర్వహించలేక ఉన్నతాధికారుల నుంచి అనవసరంగా తాఖీదులు అందుకుంటున్నామని సిబ్బంది వాపోతున్నారు. గ్రామ సచివాలయాల్లో కుల, ఆదాయ, రేషన్‌ కార్డు, పింఛన్‌ దరఖాస్తులు, భూరీసర్వే వంటి 500కు పైగా సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఫైబర్‌నెట్‌ అంతరాయంతో ప్రజలకు ఆ సేవల పత్రాలు అందించేందుకు వీలు కావడంలేదు. రోజుకు ఒక సచివాలయానికి అన్ని రకాల సేవల వినియోగానికి 4జీబీనుంచి 6జీబీ ఇంటర్నెట్‌ అవసరమవుతోంది. ఫైబర్‌ నెట్‌ రాకపోవడంతో సిబ్బంది తమ సెల్‌ఫోన్ల నుంచి నెట్‌ కనెక్షన్‌ తీసుకుని పత్రాలను అందజేస్తున్నారు. దీంతో తమకు రూ.150 నుంచి రూ.200 దాకా ఖర్చవుతుందని సిబ్బంది వాపోతున్నారు. గత ఏడాది నుంచి స్టేషనరీ నగదు జమకావడంలేదంటున్నారు. ఫైబర్‌ నెట్‌ సమస్యను జిల్లా సచివాలయాల సమన్వయకర్త రవికుమార్‌ దృష్టికి తీసుకెళ్ళగా... ఉన్నతాధికారులకు తెలియజేశామని, త్వరలోనే సమస్య పరిష్కారమౌతుందని తెలిపారు.

Updated Date - Sep 24 , 2025 | 12:03 AM