లిక్కర్ స్కామ్ కేసులో తండ్రీకొడుకులు
ABN , Publish Date - Jun 18 , 2025 | 01:34 AM
చెవిరెడ్డి భాస్కర రెడ్డి, మోహిత్‌రెడ్డిలను నిందితులుగా చేర్చిన సిట్ అధికారులు
తిరుపతి, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): మంచితనం, మర్యాద, క్రమశిక్షణ, నైతిక విలువలు అంటూ పదేపదే వల్లెవేసే తండ్రీ తనయులు చెవిరెడ్డి భాస్కర రెడ్డి, మోహిత్‌రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా మారడం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతోంది. గతేడాది ఎన్నికల పోలింగ్ మరుసటి రోజు టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీపై జరిగిన దాడి ఘటన చెవిరెడ్డి రాజకీయంలో కొత్త కోణాన్ని ఆవిష్కరించగా, ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో తండ్రీ తనయులిద్దరూ నిందితులుగా నమోదు కావడంతో అటు జిల్లాలోనూ, ఇటు సొంత నియోజకవర్గంలోనూ వైసీపీ శ్రేణుల నైతిక స్థైర్యం దెబ్బతింటోంది. ఎన్నికలతో నిమిత్తం లేకుండా ఏడాది పొడవునా ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక రూపంలో ప్రజలకు తాయిలాలు అందించేందుకు నిధులు వరదలా పారించిన చెవిరెడ్డి భాస్కర రెడ్డి తద్వారా జనంలో స్థానం సుస్థిరం చేసుకునేందుకు యత్నించారు.ఎన్నికల్లోనూ చంద్రగిరి నియోజకవర్గంలో విజయం కోసం వైసీపీ నేతలు విపరీతంగా ఖర్చు చేశారు. అంత భారీగా నిధులు ఎక్కడి నుంచీ వస్తున్నాయో తెలియక సొంత పార్టీ శ్రేణులు సైతం ఆశ్చర్యపడిన సందర్భాలున్నాయి. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసులో సిట్ చేస్తున్న ఆరోపణలు, అధికార పక్ష నేతల విమర్శలు చూస్తుంటే ఇంతకాలం ధారాళంగా ఖర్చు పెట్టిన డబ్బు లిక్కర్ స్కామ్ నిధులేనేమో అన్న అనుమానం జనంలో వ్యక్తమవుతోంది.శ్రీలంక రాజధాని కొలంబో వెళ్లడానికి మంగళవారం ఉదయం సుమారు 11 గంటల సమయంలో బెంగళూరు విమానాశ్రయం చేరుకున్న చెవిరెడ్డి భాస్కర రెడ్డిని ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఆయనపై ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసిన క్రమంలో ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ పోలీసులకు అప్పగించారు. వీరి సమాచారంతో ఆయన్ను అదుపులోకి తీసుకోవడానికి ఏపీ నుంచి సిట్ అధికారులు బెంగళూరు బయల్దేరి వెళ్లారు.
వరుస ఘటనలతో ఉక్కిరిబిక్కిరి
గతేడాది జూలై 27న స్నేహితుడి పెళ్లికని దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన చెవిరెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డిని లుకౌట్ నోటీసుల కారణంగా ఇమిగ్రేషన్ అధికారులు బెంగళూరు ఎయిర్‌పోర్టులో అడ్డుకున్నారు. ఆపై తిరుపతి నుంచీ పోలీసు అధికారులు వెళ్లి ఆయన్ను తీసుకొచ్చి 41 సీఆర్‌పీసీ నోటీసు ఇచ్చి పంపించేసిన సంగతి తెలిసిందే. తాజాగా లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి ప్రమేయముందంటూ సిట్ అధికారులు ఆయనతో పాటు అతడి సన్నిహితుల కార్యకలాపాలను లోతుగా తవ్వి తీస్తున్నారు. అందులో భాగంగా తొలుత ఆయన వద్ద గతంలో గన్‌మెన్‌గా పనిచేసిన గిరిని, తర్వాత మదన్‌రెడ్డిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ప్రశ్నించడం ద్వారా రాబట్టిన సమాచారంతో చెవిరెడ్డి వద్ద గతంలో వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన బాలాజీని కూడా అదుపులోకి తీసుకున్నారు. చెవిరెడ్డి ప్రమేయం లిక్కర్ స్కామ్‌లో ఉందని వారితో చెప్పించేందుకు వేధించారని, చిత్రహింసలు పెట్టారన్న ఆరోపణలు పక్కన పెడితే.. సిట్ వీరిని విచారించడం ద్వారానే కేసులో చెవిరెడ్డిని, ఆయన తనయుడిని 38, 39 నిందితులుగా చేర్చింది. తనను లిక్కర్ స్కామ్‌లో ఇరికించేందుకు తనవద్ద గతంలో పనిచేసిన వారిని వేధిస్తున్నారంటూ ఆరోపించిన చెవిరెడ్డి ఓ దశలో తనను త్వరలో అరెస్టు చేస్తారంటూ ప్రకటించారు. ఆయన ఏ ఉద్దేశంతో ఆ ప్రకటన చేసినప్పటికీ మంగళవారం బెంగళూరు ఎయిర్‌పోర్టులో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా వైసీపీ వర్గాలు, చెవిరెడ్డి అనుచరవర్గం ఉక్కిరిబిక్కిరవుతోంది.
అరెస్టు చేస్తారా? నోటీసులిచ్చి వదిలేస్తారా?
బెంగళూరులో మంగళవారం అర్ధరాత్రి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు ఆయనను అరెస్టు చేస్తారా? లేక నోటీసులిచ్చి వదిలిపెడతారా? అన్న చర్చ జిల్లావ్యాప్తంగా నడుస్తోంది. సిట్ దూకుడు చూస్తుంటే చెవిరెడ్డిని అరెస్టు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అత్యధికులు అంచనా వేస్తున్నారు. అయితే అదుపులోకి తీసుకుని విచారించే అవకాశముందని, ఆ క్రమంలో ఆయన వెల్లడించే అంశాలను బట్టి అరెస్టు చేయడం లేదా వదిలిపెట్టడం జరుగుతుందని కొందరు భావిస్తున్నారు. కేవలం సీఆర్‌పీసీ 41 నోటీసులు జారీ చేసి వదిలిపెట్టేయచ్చునని చెవిరెడ్డి అనుచరవర్గం అభిప్రాయపడుతోంది. మరోవైపు మోహిత్ కూడా నిందితుడిగా ఉన్నందున రేపోమాపో ఆయన్నూ సిట్ అదుపులోకి తీసుకునే అవకాశాల నేపధ్యంలో చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ వర్గాలు పూర్తిగా డీలా పడ్డాయి.