Share News

మధురమలై కొండ శివారు గ్రామాల రైతులు గజగజ

ABN , Publish Date - Dec 15 , 2025 | 01:20 AM

మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలోని మధురమలైకొండలో ఏనుగులు కొన్ని రోజులుగా మకాం వేశాయి. పగలు కొండలో ఉంటూ రాత్రి సమీప పంట పొలాల్లో స్వైరవిహారం చేస్తున్నాయి.

మధురమలై కొండ శివారు గ్రామాల రైతులు గజగజ
ఏనుగులు ధ్వంసం చేసిన వరిధాన్యం

- పంట పొలాలపై కొనసాగుతున్న ఏనుగుల దాడులు

సోమల, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రానికి మూడు కిలోమీటర్ల దూరంలోని మధురమలైకొండలో ఏనుగులు కొన్ని రోజులుగా మకాం వేశాయి. పగలు కొండలో ఉంటూ రాత్రి సమీప పంట పొలాల్లో స్వైరవిహారం చేస్తున్నాయి. మధురమలైకొండ శివారు గ్రామాలైన నెలుకూరివారిపల్లె, ఎర్రమిట్ట, పాయలగుట్ట, ఫిరంగులగుట్ట, ఇరికిపెంట, రాశెట్టివారిపల్లె, వడ్డిపల్లె, దాసరివారిపల్లె, గన్నావారిపల్లె పొలాలు కొండకు అతి సమీపంలో ఉండడంతో రైతులు వెళ్లడానికి భయపడుతున్నారు. నీరున్నా కూడా కొందరు రైతులు పొలాలను బీళ్లుగా వదిలేశారు. పైగా ఏనుగులు తరచూ గ్రామాల్లోకి ప్రవేశిస్తుండటంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.

ఇరికిపెంట, నెలుకూరివారిపల్లెలో పంటలు ధ్వంసం

తాజాగా శనివారం రాత్రి ఇరికిపెంట పంచాయతీలోని చెన్నపట్నం చెరువు మొరవ వద్ద సుధాకర్‌, సుబ్రహ్మణ్యం నాయుడు, దావెళ్ల రెడ్డెప్ప, హుసేన్‌సాహెబ్‌లకు చెందిన వరి, కొబ్బరి, అరటిచెట్లు, మామిడి తోటల్లో తిరగాడి పంటలను ధ్వంసం చేశాయి. నెలుకూరివారిపల్లె సమీపంలో ఇరికిపెంట ఎంపీటీసీ వేముల హరినాథ్‌ మామిడి తోటలో, పోలూరు శ్రీనివాసులు, చలపతి కొబ్బరి చెట్లను విరిచేశాయి. డ్రిప్‌ పరికరాలను ధ్వంసం చేశాయి. వరికోతల సమయంలో ఏనుగులు దాడి చేయడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు వాపోయారు. పంటలు సాగులోకి వచ్చింది మొదలు అడవి పందులు, దుప్పులు, నెమళ్లు వరుస దాడులు చేస్తుండటంతో పొలాల వద్దనే నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

పంటలను పరిశీలించిన అధికారులు

ఏనుగుల దాడిలో దెబ్బతిన్న పంట పొలాలను అధికారులు పరిశీలించారు. ఆదివారం ఇరికిపెంట వద్ద ఎఫ్‌బీవో రాధ, సోమల ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాసులు నాయుడు, చెన్నపట్నం చెరువు నీటి సంఘ అధ్యక్షుడు గల్లా బోస్‌ పొలాలను సందర్శించారు. సోమల పంచాయతీలోని నెలుకూరివారిపల్లె సమీపంలో ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతంలో రైతులతో కలిసి సింగిల్‌ విండో అధ్యక్షుడు పీవీ శివశంకర్‌, టీడీపీ సోమల పట్టణాధ్యక్షుడు మహేంద్రకుమార్‌, మేకల గంగాధరం సందర్శించారు. నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Dec 15 , 2025 | 01:20 AM