Share News

పద్మశ్రీ అందుకున్న రైతుబిడ్డ

ABN , Publish Date - Apr 25 , 2025 | 02:01 AM

హైదరాబాదులో బుధవారం కన్నుమూసిన వెదురుకుప్పం ప్రాంతానికి చెందిన భాషా శాస్త్రవేత్త పద్మశీ బండి రామకృష్ణారెడ్డి సేవలను పలువురు గుర్తు చేసుకుంటున్నారు. కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయం తొలి రిజిస్ట్రార్‌గానూ చేసిన ఆచార్య బండి రామకృష్ణారెడ్డి(84) కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అక్కడే ఆఖరి శ్వాస విడిచారు. ఈయన స్వస్థలం వెదురుకుప్పం మండలం తిరుమలయ్యపల్లె పంచాయతీలోని రెంటాలచేను. వీరిది వ్యవసాయ కుటుంబం. పల్లెలో ప్రాథమిక బడికూడా లేకపోవడంతో కాపుమొండివెంగనపల్లెలో అమ్మమ్మ ఇంట్లో ఉంటూ వెదురుకుప్పంలో పదో తరగతి వరకు చదువుకున్నారు. కార్వేటినగరంలో ఇంటర్‌ చదువుతున్న రోజుల్లో గణిత అధ్యాపకుడు కార్వేటినగరం నివాసి డాక్టర్‌ అరుణాలం ప్రోత్సాహం ఈయనకు దారి చూపింది.

పద్మశ్రీ అందుకున్న రైతుబిడ్డ
ఆచార్య బండి రామకృష్ణారెడ్డి

- భాషా శాస్త్రవేత్త బండి రామకృష్ణారెడ్డి

సేవలను గుర్తు చేసుకుంటున్న విద్యావేత్తలు

-హైదరాబాదులో కన్నుమూసిన

వెదురుకుప్పం ప్రాంత వాసి

- ద్రావిడ వర్సిటీ తొలి రిజిస్ట్రార్‌గా సేవలు

వెదురుకుప్పం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాదులో బుధవారం కన్నుమూసిన వెదురుకుప్పం ప్రాంతానికి చెందిన భాషా శాస్త్రవేత్త పద్మశీ బండి రామకృష్ణారెడ్డి సేవలను పలువురు గుర్తు చేసుకుంటున్నారు. కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయం తొలి రిజిస్ట్రార్‌గానూ చేసిన ఆచార్య బండి రామకృష్ణారెడ్డి(84) కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాదులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అక్కడే ఆఖరి శ్వాస విడిచారు. ఈయన స్వస్థలం వెదురుకుప్పం మండలం తిరుమలయ్యపల్లె పంచాయతీలోని రెంటాలచేను. వీరిది వ్యవసాయ కుటుంబం. పల్లెలో ప్రాథమిక బడికూడా లేకపోవడంతో కాపుమొండివెంగనపల్లెలో అమ్మమ్మ ఇంట్లో ఉంటూ వెదురుకుప్పంలో పదో తరగతి వరకు చదువుకున్నారు. కార్వేటినగరంలో ఇంటర్‌ చదువుతున్న రోజుల్లో గణిత అధ్యాపకుడు కార్వేటినగరం నివాసి డాక్టర్‌ అరుణాలం ప్రోత్సాహం ఈయనకు దారి చూపింది. తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ(హిందీ) చదివారు. పుణెలోని డెక్కన్‌ కాలేజీలో ఏంఏ భాషా శాస్త్రం చదివారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అన్నామలై విశ్వవిద్యాలయంలోనూ, సీఐఐఎల్‌ (మైసూర్‌)లోనూ పనిచేశారు. అనంతరం కామన్వెల్త్‌ ఫెలోషి్‌పపై యూకే వెళ్లి ఎడిన్‌బర్గ్‌ విశ్వవిద్యాలయంలో అండర్సన్‌ కేస్‌ గ్రామర్‌పై పీహెచ్‌డీ చేశారు. చంద్రగిరి మండలం రంగంపేటకు చెందిన కె.నాగమ్మతో వివాహం జరిగింది. ఆమె కూడా ప్రొఫెసర్‌గా చేశారు. 2008లో ఆమె చనిపోయారు. 1977లో ఉస్మానియా యూనివర్సిటీ భాషా శాస్త్ర విభాగంలో లెక్చరర్‌గా చేరి, తరువాత ప్రొఫెసర్‌ అయ్యారు. 1990లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా చేరి రిజిస్ట్రార్‌గానూ పనిచేశారు. కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాలయం స్థాపించినపుడు తొలి రిజిస్ట్రార్‌గా సేవలను అందించారు. ఆ సమయంలో గురువు అరుణాచలం ఈ యూనివర్సిటీ వీసీగా ఉన్నారు. ఆచార్య బండి రామకృష్ణారెడ్డి అనేక గిరిజన భాషలపై విశేష కృషి చేశారు. ‘ఇంది-ఆవే’భాషకు లిపి తయారు చేశారు. భారత ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పద్మశ్రీని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఈయన మేనల్లుడు డాక్టర్‌ ఎన్‌.ఈశ్వరరెడ్డి యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో ఆచార్యుడిగా ఉన్నారు. స్వస్థలంవీడి ఈ కుటుంబం దశాబ్దాల కిందటే వెళ్లిపోయినా వెదురుకుప్పం ప్రాంతంలో వీరికి బంధువర్గం ఉంది.

Updated Date - Apr 25 , 2025 | 02:02 AM