గుండెపోటుతో రైతు మృతి
ABN , Publish Date - Jun 26 , 2025 | 01:23 AM
రామకుప్పం మండలం కిలాకిపోడు గ్రామంలో ఓ రైతు మృతి చెందడం కుప్పం నియోజకవర్గవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటీవల ఎయిర్‌పోర్టు కోసం భూసేకరణ జరుగుతున్న గ్రామాల్లో ఎవరు చనిపోయినా రకరకాల ప్రచారాలు జరిగి చర్చనీయాంశమవుతున్నాయి.
కుమార్తె వీడియోలతో చర్చనీయాంశంగా మారిన వైనం
రామకుప్పం, జూన్ 25(ఆంధ్రజ్యోతి):రామకుప్పం మండలం కిలాకిపోడు గ్రామంలో ఓ రైతు మృతి చెందడం కుప్పం నియోజకవర్గవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇటీవల ఎయిర్‌పోర్టు కోసం భూసేకరణ జరుగుతున్న గ్రామాల్లో ఎవరు చనిపోయినా రకరకాల ప్రచారాలు జరిగి చర్చనీయాంశమవుతున్నాయి.ఎయిర్‌పోర్టుకు భూములు తీసుకుంటున్నారన్న మనస్తాపంతోనే వారు మృతి చెందుతున్నారంటూ కొందరు పనిగట్టుకుని ప్రచారంచేస్తూ సాధారణ మరణాలను కూడా వివాదాస్పదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మూడు నెలల క్రితం మణీంద్రం గ్రామంలో ఓ యువకుడు వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పట్లో స్థానికంగా పలుకుబడి కలిగిన వ్యక్తులు అతని భూములు ఎయిర్‌పోర్టుకు తీసుకుంటున్నారన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని పుకార్లు పుట్టించారు. కుటుంబసభ్యులు ఆ పుకార్లలో నిజం లేదని వెల్లడించడంతో వారి నోళ్ళు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ, కొన్ని నెలల క్రితం ఆపరేషన్ చేసుకున్న కిలాకిపోడుకు చెందిన రైతు శ్రీనివాసులు బుధవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. ఎవరు ప్రభావితం చేశారో కానీ తన తండ్రి ఎయిర్‌పోర్టు కోసం భూసర్వే ప్రారంభమైనప్పటి నుంచి సక్రమంగా తిండి తినలేదని, అందుకే మృతి చెందాడని శ్రీనివాసులు కుమార్తె మాట్లాడుతున్న విడియో ఒకటి బయటకు వచ్చింది.దీనిపై చర్చ సాగుతుండగానే మధ్యాహ్నం ఆమె మాట్లాడుతున్న మరో విడియో సోషల్ మీడియాలో వైరలైంది. తన తండ్రి అనారోగ్యంతోనే మృతి చెందాడని, ఉదయం పొరబాటున వేరే విధంగా చెప్పానని ఆమె ఆ విడియోలో తెలిపింది. తన తండ్రికి ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారని, ఇద్దరు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు జరిగాయని ఆమె ఆ విడియోలో చెప్పుకొచ్చింది. పేదరికం కారణంగా మిగిలిన ఇద్దరి పోషణ, వారికి విద్యనందించడం ఇబ్బందికరంగా మారిందని, తమ కుటుంబాన్ని సీఎం చంద్రబాబు ఆదుకోవాలని ఆమె కోరింది.