ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Sep 11 , 2025 | 01:26 AM
కుప్పం పట్టణానికి చెందిన ఓ కుటుంబం తమిళనాడు రాష్ట్రంలో జిల్లా కేంద్రమైన కృష్టగిరి సమీపంలో వున్న కేఆర్‌బీ డ్యాంలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు నలుగురిలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఇద్దరి మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం
కుప్పం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): కుప్పం పట్టణానికి చెందిన ఓ కుటుంబం తమిళనాడు రాష్ట్రంలో జిల్లా కేంద్రమైన కృష్టగిరి సమీపంలో వున్న కేఆర్‌బీ డ్యాంలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు నలుగురిలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల కథనం మేరకు ..... లక్ష్మణమూర్తి (50) కుటుంబం కుప్పం పట్టణం కొత్తపేట జయప్రకాశ్ రోడ్డులో నివాసముంటోంది. టీ బంకుతో జీవనం సాగిస్తున్న ఈ కుటుంబంలో లక్ష్మణమూర్తి అత్త శారదమ్మాళ్ (75), భార్య జ్యోతి (45), కుమార్తె కీర్తిక (20) సభ్యులుగా ఉన్నారు. నలుగురు సభ్యులతో కూడిన ఈ కుటుంబం బుధవారం ఉదయం ఇంటికి తాళం వేసి ఎవరికీ చెప్పకుండా కృష్టగిరి వెళ్లింది. కేఆర్‌బీ డ్యాంలో చిన్న స్లూయిస్ గేటు వద్దకు వచ్చిన వీరంతా హఠాత్తుగా డ్యాంలోకి దూకారు.డ్యాం దిగువభాగంలో చేపలు పట్టుకుంటున్న జాలరులు గమనించి వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. అయితే ఇద్దరు మహిళల్ని మాత్రమే రక్షించగలిగారు.లక్ష్మణమూర్తి కుటుంబం మొత్తం రిజర్వాయర్‌లో దూకి ఆత్మహత్యాయత్నం చేసిందన్న సమాచారం అక్కడి పోలీసుల ద్వారా కుప్పంలో ఉన్న వారి బంధువులకు అందింది. ఈ దుర్ఘటనలో లక్ష్మణమూర్తితోపాటు ఆయన అత్త శారదమ్మాళ్ మృతి చెందారు. ఆయన భార్య జ్యోతి, కుమార్తె కీర్తికలను మత్స్యకారులు గమనించి బయటకు తీసుకు వచ్చారు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని చికిత్స నిమిత్తం స్థానిక పోలీసులు కృష్ణగిరి ఆసుపత్రిలో చేర్చారు. సమాచారం అందుకున్న కృష్ణగిరి డ్యాం పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను వెలికి తీసి, పోస్టుమార్టం కోసం కృష్ణగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో లక్ష్మణమూర్తి కుటుంబం ఆత్మహత్యా యత్నం చేసినట్లు చెబుతున్నారు.ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో బంధువర్గంతోపాటు కొత్తపేట మొత్తం శోకసంద్రమైంది. కృష్ణగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.