13న జాతర
ABN , Publish Date - May 04 , 2025 | 02:18 AM
తిరుపతికి జాతర కళ వచ్చేసింది. చాటింపునకు ముందే పుర వీధుల్లో డప్పుల దరువు వినిపిస్తోంది.
తిరుపతికి జాతర కళ వచ్చేసింది. చాటింపునకు ముందే పుర వీధుల్లో డప్పుల దరువు వినిపిస్తోంది. నగరంలోని
మహా శక్తి ఆలయాలు ముస్తాబవుతున్నాయి. గడిచిన ఐదేళ్లలో కరోనా కారణంగా రెండేళ్లు జాతరకు బ్రేక్ పడింది. మిగిలిన మూడేళ్లు జాతర జరిగిన తీరుపై తిరుపతి స్థానిక ప్రజల్లో విమర్శలు వినిపించాయి. వ్యక్తిగత ప్రాబల్యం పెంచుకునేందుకు జాతర సంప్రదాయాలనే మార్చేశారనే ఆరోపణలు వచ్చాయి. స్థానిక భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆచార సంప్రదాయాలకు భంగం వాటిల్లకుండా వీఐపీ సారెలు, రాజకీయ వేషాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా జాతరను ఘనంగా నిర్వహించాలని ప్రజలు కోరుకుంటున్నారు. - తిరుపతి ఆంధ్రజ్యోతి
ప్రతి ఏటా చైత్రమాసం చివరివారంలో గంగమ్మ జాతర మహోత్సవాలు వారం రోజులపాటు ఎంతో వైభవంగా జరుగుతాయి. రోజుకోవేషంతో భక్తులు చిత్ర, విచిత్రమైన అలంకారాలతో గంగమ్మను దర్శించుకంటారు. 7వ తేది బైరాగి వేషంతో మొదలై బండవేషం, తోటివేషం, దొరవేషం, మాతంగివేషం వరకు వేషాల జాతర సాగుతుంది. 12వ తేది సున్నపుకుండలు వేషాలను ఇద్దరు కైకాల కులస్థులు వేస్తారు. వీరు చిన్న గంగమ్మ, పెద్ద గంగమ్మలకు ప్రతీకలుగా భక్తులచేత పూజలందుకుంటారు. 13వ తేది మంగళవారం అసలు జాతర సంబరం మొదలవుతుంది. ప్రత్యేక అభిషేకానంతరం వజ్రకిరీటంలో దర్శనమిచ్చే గంగమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో పోటెత్తుతారు. విశేషంగా పొంగళ్లు, జంతుబలులు ఉంటాయి. గంగమ్మ ఆలయం ముందు స్థూపానికి బంకమన్నుతో అమ్మవారి విశ్వరూపాన్ని తయారు చేస్తారు. బుధవారం వేకువజామున విశ్వరూప ప్రతిమ చెంప నరకడంతో జాతర పరిసమాప్తి అవుతుంది.
సప్పరాలు పెరగాలి
ఒకప్పుడు జాతర భారీ ఎత్తున జరిగేది. ప్రజలు ఎక్కువగా వచ్చేవారు. చాటింపు వేసిన రోజు నుంచి ఊరు వదిలివెళ్లేవారు కాదు. ప్రజలు స్వచ్చందంగా వేషాలు వేసేవారు. అంబలి పోసేవారు. బలులు ఇచ్చేవారు. ఊరంతా వారం రోజులపాటు సందడిగా ఉండేది. బంధుమిత్రులు వచ్చి వారం రోజులపాటు తిరుపతిలో ఉండేవారు. ఆ తర్వాత జాతరలో అనేక మార్పు, చేర్పులతో రాజకీయం ప్రవేశించింది. ప్రచారం కోసం రాజకీయ సారెలు మొదలయ్యాయి. జానపద నేపథ్యం ఉన్న జాతరను క్లాసికల్‌గా మార్చేశారు. జాతరలో ప్రజలు స్వచ్చందంగా వేసే పలు వేషాలు కనుమరుగు అయ్యాయి. తిరుపతి గంగమ్మ జాతరలో సప్పరాలు, మాతంగి వేషాలు ప్రత్యేకత. ఒకప్పుడు 250 సప్పరాలు వరకు భక్తులు వేసేవారు. ఒకప్పుడు తిరుమలలో సప్పరం సేవ కూడా ఉండేది. ఇప్పుడు సప్పరాలు, మాతంగి వేషాలు బాగా తగ్గిపోయాయి. వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. తిరుపతిలో 50 డివిజన్లలో ఒక్కో డివిజన్ నుంచి ఒక సప్పరం వచ్చినా పాత ఆచారం పునరుద్ధరించినట్లు అవుతుంది. జాతర నిర్వాహకులు ఆ దిశగా ఆలోచన చేయాలని కోరుతున్నాను.
- పేట శ్రీనివాసుల రెడ్డి, రచయిత,
తిరుపతి
సారెల ఊరేగింపులకు చెక్
వైసీపీ హయాంలో రెండేళ్లపాటూ సారెల ఊరేగింపులకే పెద్దపీట వేశారు. ప్రతి డివిజన్ నుంచి సారెలు తేవాలని ఆ పార్టీ శ్రేణులతో పాటు అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. దీంతో సంప్రదాయ జాతర పక్కదారి పట్టింది. సారె వెళ్లే మార్గాల్లో వాహనదారులకు చుక్కలు కనిపించేవి. సారెతో పాటు నాయకులు, అనుచరులు ఆలయంలోకి గుంపులుగా రావడంతో సాధారణ భక్తులు క్యూలైన్లలోనే గంటల తరబడి చిక్కుకుపోవాల్సి వచ్చేది. వీటిని దృష్టిలోపెట్టుకు సారెల ఊరేగింపుల సంప్రదాయానికి కూటమి ప్రభుత్వం చెక్ పెట్టింది. అమ్మవారికి సారెలు సమర్పించాలనుకునే గంగమ్మ భక్తులు ఆలయ కార్యాలయంలో ఇచ్చి రసీదు తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.