Share News

తిరుపతి గంగ జాతరకు నేడు చాటింపు

ABN , Publish Date - May 06 , 2025 | 12:55 AM

తిరుపతి పొలిమేరలో మంగళవారం అర్ధరాత్రి వేసే చాటింపుతో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర సంబరం మొదలుకానుంది. దీనికి ముందు ఉదయం 7 గంటలకు గంగమ్మ ఆలయంలోని విశ్వరూప స్థూపానికి పరిమళ, పవిత్ర జలాలతో అభిషేకం చేసి వడిబాల కట్టడంతో జాతర ప్రాధాన్యత సంతరించుకుంటుంది.

తిరుపతి గంగ జాతరకు నేడు చాటింపు
విద్యుత్‌ దీప కాంతుల్లో గంగమ్మ ఆలయం

- విశ్వరూప స్థూపానికి అభిషేకం

- ఊరేగింపుగా రానున్న అవిలాల పుట్టింటి సారె

తిరుపతి-ఆంధ్రజ్యోతి

తిరుపతి పొలిమేరలో మంగళవారం అర్ధరాత్రి వేసే చాటింపుతో తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర సంబరం మొదలుకానుంది. దీనికి ముందు ఉదయం 7 గంటలకు గంగమ్మ ఆలయంలోని విశ్వరూప స్థూపానికి పరిమళ, పవిత్ర జలాలతో అభిషేకం చేసి వడిబాల కట్టడంతో జాతర ప్రాధాన్యత సంతరించుకుంటుంది. సాయంత్రం గంగమ్మ జన్మస్థలమైన రూరల్‌ మండలం అవిలాల నుంచి సారె వస్తుంది. సారెతో పాటు స్థానిక కైకాలవాళ్లు నగర పొలిమేర్లలో చాటింపు వేస్తారు. ఆలయ ప్రాంగణం విద్యుత్‌ దీప కాంతులతో శోభాయమానంగా కనిపిస్తోంది.

రోజుకో వేషం

వేలాది మంది భక్తులు చిత్ర, విచిత్ర వేషాలు ధరించి అమ్మవారిని దర్శించుకుంటారు. బుధవారం నుంచి వేషాల జాతర మొదలవుతుంది. తరాల తారతమ్యం భక్తి భావనకు అడ్డురాదని నిరూపిస్తూ వేషాలు వేయడానికి జనం పోటీపడతారు. 7వ తేదీ బైరాగి వేషంతో మొదలై బండవేషం, తోటివేషం, దొరవేషం, మాతంగివేషం వరకు వేషాల జాతర సాగుతుంది. 12వ తేదీ సున్నపుకుండల వేషాలను ఇద్దరు కైకాల కులస్థులు వేస్తారు. వీరు చిన్న గంగమ్మ, పెద్ద గంగమ్మలకు ప్రతీకలుగా భక్తులచేత పూజలందుకుంటారు. 13వ తేదీ మంగళవారం అసలు జాతర సంబరం మొదలవుతుంది. ప్రత్యేక అభిషేకానంతరం వజ్రకిరీటంలో దర్శనమిచ్చే గంగమ్మను దర్శించుకునేందుకు భక్తులు అధికసంఖ్యలో పోటెత్తుతారు. విశేషంగా పొంగళ్లు, జంతుబలులు ఉంటాయి. గంగమ్మ ఆలయం ముందు విశ్వరూప స్థూపానికి బంకమన్నుతో అమ్మవారి విశ్వరూపాన్ని తయారు చేస్తారు. 14వ తేదీ వేకువజామున విశ్వరూప ప్రతిమ చెంప తొలిగించడంతో జాతర పరిసమాప్తమవుతుంది.

పండుగ వాతావరణంలో నిర్వహిద్దాం : కలెక్టర్‌

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ జాతరను పండుగ వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో జాతరపై ఆయన సమీక్షించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పీ హర్షవర్ధన రాజు ఆదేశించారు. సోమవారం ఆయన ఆలయాన్ని పరిశీలించి, అధికారులకు, పోలీసులకు తగు సూచనలు ఇచ్చారు.

Updated Date - May 06 , 2025 | 12:55 AM