పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం
ABN , Publish Date - Aug 15 , 2025 | 01:23 AM
తిరుపతిలోని ఎస్వీయూ స్టేడియంలో శుక్రవారం జరిగే 79వ జిల్లాస్థాయి స్వాతంత్య్ర దిన వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. గురువారం ఉదయం నుంచి జిల్లా అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేపట్టి సాయంత్రానికి పూర్తి చేశారు. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు ఈ వేడుకలను వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
391మందికి ప్రశంసాపత్రాలు
తిరుపతి(కలెక్టరేట్), ఆగస్టు 14: తిరుపతిలోని ఎస్వీయూ స్టేడియంలో శుక్రవారం జరిగే 79వ జిల్లాస్థాయి స్వాతంత్య్ర దిన వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. గురువారం ఉదయం నుంచి జిల్లా అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేపట్టి సాయంత్రానికి పూర్తి చేశారు. ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు ఈ వేడుకలను వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 11 శకటాలను.. 10 స్టాళ్లను సిద్ధం చేశారు. ఈ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేశామని కలెక్టర్ వెంకటేశ్వర్, డీఆర్వో నరసింహులు తెలిపారు. మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి పోలీసు పరేడ్ మైదానం బురదమయం కావడంతో ఈ వేడుకలకు వేదికను ఎస్వీయూ స్టేడియానికి మార్చిన విషయం తెలిసిందే. గురువారం వర్షం నిలవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
కార్యక్రమాలిలా: శుక్రవారం ఉదయం 9గంటలకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. 9.15గంటలకు స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలకు సన్మానం. ఆ తర్వాత జిల్లా ప్రగతిపై సందేశం ఇస్తారు. 9.35గంటలకు వివిధ శాఖల ప్రగతి శకటాల ప్రదర్శన, 10గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు. విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరచిన 391మంది అధికారులు, ఉద్యోగులకు మంత్రి ప్రశంసాపత్రాలు అందజేస్తారు. అనంతరం స్టాళ్లను సందర్శిస్తారు.
జస్ట్.. రిహార్సల్స్
ఎస్వీయూ స్టేడియంలో పోలీసు పరేడ్ జరిగింది. ఎస్పీ హర్షవర్ధనరాజు జాతీయ జెండా ఆవిష్కరించి సెల్యూట్ చేశారు. ఓపెన్ టాప్ జీపులో వెళుతూ పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఇదంతా శుక్రవారం స్వాతంత్య్ర దిన వేడుకలకు సంబంధించి గురువారం జరిగిన రిహార్సల్స్ మాత్రమే. ఈ సందర్భంగా వేడుకలకు సంబంధించి భద్రతపై ఎస్పీ సమీక్షించారు. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్ చూడాలని సూచించారు. మరోవైపు రెండు గంటల పాటు బాంబు, డాగ్ స్క్వాడ్లతో ముమ్మరంగా తనిఖీలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు, రిజర్వు అదనపు ఎస్సీ శ్రీనివాసరావు, రిజర్వు సీఐలు పాల్గొన్నారు.
- తిరుపతి(నేరవిభాగం), ఆంధ్రజ్యోతి