Share News

నిషేధం ముగిసినా.. వేటకు అంతరాయం

ABN , Publish Date - Jun 16 , 2025 | 12:37 AM

సముద్రంలో అలల ఉధృతితో ఆగిన మత్స్యకారులు సాయంత్రం వెళ్లిన కొన్ని పడవలు

నిషేధం ముగిసినా.. వేటకు అంతరాయం
కోట మండలం గోవిందపల్లిపాళెం ముఖద్వారం నుంచి సముద్రంలోకి వెళ్తున్న బోట్‌

కోట, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): సముద్ర వేటకు 61 రోజుల నిషేధం ముగిసింది. ఇక, ఆదివారం చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లేందుకు సిద్ధమైన మత్స్యకారులకు అలల రూపంలో ఆటంకం ఎదురైంది. దీంతో సాయంత్రానికి కొందరు మాత్రమే బోట్లలో వెళ్లారు. సముద్రంలో చేపలు గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి సందర్భంగా మత్స్యశాఖ అధికారులు కోట, వాకాడు, చిల్లకూరు మండలాల్లోని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా నిషేధం విధించారు. ఆంక్షల సమయంలో మత్స్యకారులు అతిక్రమించి చేపల వేటకు వెళ్తారన్న సముద్రంలో ఎప్పటికప్పుడు మత్స్యశాఖ పర్యవేక్షిస్తూ వచ్చింది. ఈ రెండు నెలల కాలంలో అరకొరతప్ప పలువురు సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకార కుటుంబాలు పస్తులతో గడపాల్సివచ్చింది. సముద్రంలో చేపల వేట నిషేధ గడువు ముగియడంతో ఆయా మండలాల్లోని మత్స్యకారులు ఆదివారం ఉదయం బోట్లు, పడవలతో సముద్రంలో వెళ్లారు. అయితే, తెల్లవారుజామునుంచే సముద్రంలో విపరీతమైన గాలులు, అలజడులు ఉండటంతో వేటకు వెళ్లలేక వెనుదిరిగారు. కోట మండలం శ్రీనివాసపురం, గోవిందపల్లిపాళెం ముఖద్వారాల నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లలేకపోయారు. భయంకరమైన అలలు, విపరీతమైన గాలులు వీస్తుండటంతో ఎక్కడ బోట్‌లు కొట్టుకుపోతాయోనని భయాందోళనకు గురై సముద్రం వద్దకెళ్లి కొంతమంది బోట్లను ముఖద్వారం వద్దకు తీసుకువచ్చారు. అయితే బాగా పొద్దుపోయేదాక 180 బోట్లకుగాను కేవలం మూడు మాత్రమే అలలు, గాలులకు లెక్క చేయకుండా సముద్రంలోకి వెళ్లినట్లు మత్స్యకారులు తెలిపారు. ఇక, చిల్లకూరు మండలం తమ్మినపట్నం, గుమ్మళ్లదిబ్బ ముఖద్వారాల నుంచి బోట్లు వెళ్లలేదు. వాకాడు మండలం కొండూరుపాలెం, తూపిలిపాలెం నుంచి అరకొరగా బోట్లు వెళ్లినట్లు సమాచారం. కాగా, సోమవారం నుంచి యథావిధిగా సముద్రంలో వేటసాగే అవకాశాలు ఉన్నాయని మత్స్యకారులు చెబుతున్నారు.

Updated Date - Jun 16 , 2025 | 12:37 AM