Share News

‘జలాశయం’ నిండినా రైతుకు వ్యథే..!

ABN , Publish Date - Dec 03 , 2025 | 12:13 AM

భారీ వర్షాలు కురిసినప్పుడల్లా పెనుమూరు మండలం కలవగుంటలోని ఎన్టీఆర్‌ జలాశయం నిండి పొంగి పొర్లుతోంది

‘జలాశయం’ నిండినా  రైతుకు వ్యథే..!
నిండుకుండలా ఎన్టీఆర్‌ జలాశయం

భారీ వర్షాలు కురిసినప్పుడల్లా పెనుమూరు మండలం కలవగుంటలోని ఎన్టీఆర్‌ జలాశయం నిండి పొంగి పొర్లుతోంది. స్థానిక రైతులకు దక్కాల్సిన మిగులు జలాలంతా తమిళనాడు మీదుగా వెళ్లి సముద్రం పాలవుతున్నాయి. కళ్లెదుటే నీరు వృథా అవుతున్నా అడ్డుకోలేని స్థితి నెలకొంది.

- పెనుమూరు, ఆంధ్రజ్యోతి

చిత్తూరు నగరానికి తాగునీరు అందించే లక్ష్యంతో 1995లో 0.120 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఎన్టీఆర్‌ జలాశయాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. వృథా అవుతున్న నీటిని స్థానిక రైతులకు అందించడానికి 20 ఏళ్లుగా ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు ప్రయత్నిస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు.

చెరువులు అనుసంధానం చేస్తేనే..

ఎన్టీఆర్‌ జలాశయం నుంచి పెనుమూరు మండలంలోని రెండు (గంగుపల్లె, జలిజపల్లె) చెరువులకు, గంగాధరనెల్లూరు మండలంలోని మరో 31 చెరువులకు నీటిని కాలువల ద్వారా అనుసంధాన ప్రక్రియ 2004లో తెరపైకి వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి చెరువులకు నీరు మళ్లించడానికి రూ.5 కోట్లు మంజూరు చేశారు. కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు.

1000 ఎంసీఎ్‌ఫటీల నీరు వృథా

ఎన్టీఆర్‌ జలాశయం ఎగువ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసిన ప్రతిసారీ జలాశయం నిండి మిగులునీరు సముద్రం పాలవుతోంది. జలాశయం సామర్థ్యం 109.8 ఎంసీఎ్‌ఫటీలు కాగా రెండు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయం నిండటంతో ఇరిగేషన్‌ అధికారులు గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 500పైగా ఎంసీఎ్‌ఫటీల నీరు సముద్రం పాలయ్యిందని అంచనా. నేటికి కూడా రెండు గేట్ల ద్వారా రోజు 200 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.

గత టీడీపీ ప్రభుత్వంలో రెండు చెరువులకు నీరు

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో (2014-2019) జలాశయం నుంచి పెనుమూరు మండలంలోని గంగుపల్లె, బలిజపల్లె చెరువులకు కాలువ ద్వారా నీటిని మళ్లించేందుకు టెండర్ల ద్వారా కాంట్రాక్టర్‌ పనులు దక్కించుకున్నాడు. గంగుపల్లె చెరువుకు కాలువ పనులు పూర్తిచేయడంతో అందులో ఎప్పుడూ నీరు నిండుగా ఉంటుంది. బలిజపల్లె చెరువుకు కాలువ పనులను మధ్యలోనే ఆపేశారు.

రూ.196 కోట్లు మంజూరైనా ప్రారంభం కాని పనులు

వైసీపీ ప్రభుత్వంలో ఎన్టీఆర్‌ జలాశయం నుంచి 33 చెరువులకు కాలువల ద్వారా నీరు మళ్లించడానికి, చెరువలు మరమ్మతులు, శుభ్రత వంటి పనులకు టెండర్లను పిలిచారు. తెలంగాణకు చెందిన శ్రీనివాస కన్‌స్ట్రక్షన్‌ వారు కాంట్రాక్టు దక్కించుకున్నారు. అయితే పనులు మాత్రం మొదలుపెట్టలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇరిగేషన్‌ అధికారులు ఈ పనులు జరిగేందుకు అనుమతులు కోరగా ప్రభుత్వం కూడా గతంలో టెండర్‌ దక్కించుకున్న వారికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే రేట్లు పెరగడంతో పనులు మొదలుపెట్టలేదని సమాచారం.

అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే థామస్‌

కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వహించిన మొదటి అసెంబ్లీ సమావేశంలోనే జీడీనెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్‌ థామస్‌.. ఎన్టీఆర్‌ జలాశయం నుంచి చెరువులకు నీటి అనుసంధానం, డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా రెండు మండలాలను సస్యశ్యామలం చేయవచ్చని ప్రస్తావించారు. దీనికి ఇరిగేషన్‌ మంత్రి సానుకూలంగా స్పందించారు. అయితే ఇంకా పనులు మొదలుపెట్టనందున ఎమ్మెల్యే ఈ విషయమై ప్రత్యేక దృష్టి సారించి వేల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Dec 03 , 2025 | 12:13 AM