Share News

కొత్త నాయకత్వానికి ప్రోత్సాహం

ABN , Publish Date - Dec 22 , 2025 | 01:58 AM

చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా షణ్ముగ రెడ్డి, సునీల్‌ కుమార్‌ చౌదరి నియమితులయ్యారు.కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేలా అధ్యక్షుడిగా పుత్తూరుకు చెందిన షణ్ముగరెడ్డిని, ప్రధాన కార్యదర్శిగా తవణంపల్లెకు చెందిన సునీల్‌కుమార్‌ చౌదరిని నియమించారు.

కొత్త నాయకత్వానికి ప్రోత్సాహం

టీడీపీ నవ సారథులు షణ్ముగ రెడ్డి, సునీల్‌ చౌదరి

చిత్తూరు, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా షణ్ముగ రెడ్డి, సునీల్‌ కుమార్‌ చౌదరి నియమితులయ్యారు.కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించేలా అధ్యక్షుడిగా పుత్తూరుకు చెందిన షణ్ముగరెడ్డిని, ప్రధాన కార్యదర్శిగా తవణంపల్లెకు చెందిన సునీల్‌కుమార్‌ చౌదరిని నియమించారు. వన్నియకుల క్షత్రియ కులానికి చెందిన షణ్ముగ రెడ్డి సొంతూరు పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని మిట్టపల్లూరు.మొదటినుంచీ గాలి ముద్దుకృష్ణమనాయుడి వెంట నడిచిన షణ్ముగం ఆ తర్వాత ఆయన కుమారుడు గాలి భానుప్రకాష్‌ వెంట ఉంటున్నారు.గత ఎన్నికల్లో క్లస్టర్‌ ఇన్‌ఛార్జిగా పార్టీ గెలుపు కోసం పనిచేశారు.వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈయనపై పెద్ద సంఖ్యలో అక్రమ కేసులు బనాయించారు. ఓ సందర్భంలో ఈయన్ను కొట్టారు కూడా. జిల్లా టీడీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడిగా, వన్నియకుల క్షత్రియ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.ఇక తవణంపల్లె మండలం కొండ్రాజుకాల్వ గ్రామానికి చెందిన సునీల్‌కుమార్‌ చౌదరి తొలినుంచీ టీడీపీలోనే ఉన్నారు. గత ఎన్నికల్లో క్లస్టర్‌ ఇన్‌ఛార్జిగా పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే ఈయనకు మూడేళ్ల కిందట జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షుడిగా పదవి దక్కింది.

యువత అధ్యక్ష పదవిపై ఆసక్తి

అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవుల భర్తీ పూర్తవడంతో తెలుగు యువత అధ్యక్ష పదవిపై అందరిలో ఆసక్తి పెరిగింది. వాస్తవానికి అధ్యక్ష, కార్యదర్శులతో పాటు యువత పదవికి కూడా మంచి డిమాండ్‌ నెలకొంది. అధ్యక్ష పదవిని బీసీలకు, కార్యదర్శి పదవిని ఓసీలకు ఇవ్వడంతో యువత అధ్యక్ష పదవిని బలిజ వర్గానికి ఇచ్చే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

కార్యకర్తగా పనిచేస్తా

అంకితభావంతో పనిచేసే సాధారణ వ్యక్తిని సైతం అందలం ఎక్కించే ఏకైక పార్టీ టీడీపీ. ప్రతిపక్షంలో వుండగా అనేక అక్రమ కేసులు పెట్టినా, నన్ను కొట్టినా టీడీపీ ధైర్యం చెప్పింది. లోకేశ్‌ పాదయాత్ర అన్నివర్గాల ప్రజలకు, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడింది. మాలాంటి వారిని నాయకత్వ స్థానాలకు ఎంపిక చేసి రేపటి తరంలో ఆశను నింపారు.అంకిత భావంతో సాధారణ కార్యకర్తగానే పనిచేస్తా. నాకీ పదవి రావడంతో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్‌ సహకారాన్ని మర్చిపోలేను. ఎంపీ సహా ఆరుగురు ఎమ్మెల్యేలూ నన్ను సిఫార్సు చేశారు.

-షణ్ముగ రెడ్డి

నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

ఏళ్ల తరబడి టీడీపీని అంటిపెట్టుకుని ఉంటూ ఎన్నికల్లో విజయం కోసం కృషి చేశా. నా సేవల్ని పార్టీ గుర్తించి ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చింది. ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే మురళీమోహన్‌ సహకారంతోనే ఈ పదవి దక్కింది. జిల్లాలో పార్టీ అభివృద్ధికి కృషి చేసి, అధిష్ఠానం నాపై వుంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.

- సునీల్‌ చౌదరి

Updated Date - Dec 22 , 2025 | 01:58 AM