గ్రామాలను చుట్టేసిన గజరాజులు
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:42 AM
పులిచెర్ల మండలం పాళెం, దేవళంపేట, అయ్యావాండ్లపల్లి, ఎర్రపాపిరెడ్డిగారిపల్లె, పులిచెర్ల, రెడ్డివారిపల్లె, గడ్డంవారిపల్లె పంచాయతీల్లో మంగళవారం రాత్రంతా ఏనుగుల గుంపు హల్‌చల్ చేశాయి. ఫారెస్ట్ సిబ్బందిని పరుగులు తీయించాయి.
కల్లూరు, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): పులిచెర్ల మండలం పాళెం, దేవళంపేట, అయ్యావాండ్లపల్లి, ఎర్రపాపిరెడ్డిగారిపల్లె, పులిచెర్ల, రెడ్డివారిపల్లె, గడ్డంవారిపల్లె పంచాయతీల్లో మంగళవారం రాత్రంతా ఏనుగుల గుంపు హల్‌చల్ చేశాయి. ఫారెస్ట్ సిబ్బందిని పరుగులు తీయించాయి. కొన్నిచోట్ల పంటలను ధ్వంసం చేశాయి. రోజూ చీకటిపడగానే చొరబడి పంటలను ధ్వంసం చేస్తుండటంతో కంటి మీద కునుకు లేకుండా పోతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం సాయంత్రం సూరప్పచెరువు నుంచి బయలుదేరిన తొమ్మిది ఏనుగులు తొలుత పాళెం పంచాయతీ మీదుగా దేవళంపేట పంచాయతీ కుమ్మరిపల్లె వద్దకు చేరుకున్నాయి. నాగరాజు, రాజన్న, ధర్మేంధ్ర, మధుసూదన నాయుడులకు చెందిన మామిడిచెట్లను ధ్వంసం చేశాయి. అటవీశాఖ సిబ్బంది గుర్తించి టపాకాయలు పేల్చడంతో ఇవి వీకే పల్లె, నల్లగుట్టపల్లె, అయ్యావాండ్లపల్లె మార్గంలో యర్రంవాండ్లపల్లె వద్దకు చేరుకున్నాయి. అక్కడ మామిడిచెట్లను ధ్వంసం చేసి పశుగ్రాసాన్ని తినేశాయి. అక్కడి నుంచి పిచ్చిగుండ్లపల్లె చేరుకని వరిపంటను ధ్వంసం చేశాయి. ఫారెస్ట్ సిబ్బంది మరోమారు టపాకాయలు పేల్చడంతో ఏనుగులు పులిచెర్ల- రామిరెడ్డిగారిపల్లె రోడ్డును దాటి మామిడిచెట్ల కొమ్మలను విరిచేశాయి. అక్కడి నుంచి ఏనుగుల గుంపు చిన్నగొట్టిగల్లు మండలంలోకి వెళ్లి మళ్లీ పులిచెర్ల మండలం గడ్డంవారిపల్లె పంచాయతీ పాపిరెడ్డిగారిపల్లె సమీపంలోని అడవికి చేరుకున్నాయి. బుధవారం పగలంతా మూలమడుగు వద్ద ఏనుగులు తిష్ట వేసినట్లు సమాచారం.